-100 టన్నుల ఎరువుల పంపిణీ
ఎరువుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సాయమందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చెందిన రెండు విమానాలు 100 టన్నుల నానో నైట్రోజన్ ద్రవ ఎరువులతో(Nano Nitrogen liquid fertilizers) గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో ల్యాండ్ అయ్యాయి.నానో ఫెర్టిలైజర్స్ ను అందించాలంటూ శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ణప్తికి ప్రతిస్పందనగా ఈ డెలివరీ జరిగిందని శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీపావళి రోజున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి శ్రీలంకకు ఆశాకిరణాన్ని తీసుకొచ్చిందని ట్వీట్ లో పేర్కొంది.
కాగా, ఈ ఏడాది మే నెలలో రసాయన ఎరువుల దిగుమతులను నిలిపివేస్తూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నిర్ణయం తీసుకున్న కొన్ని నెలల తర్వాత ఈ నానో నైట్రోజన్ ద్రవ ఎరువుల దిగుమతి జరిగింది. ఎరువుల దిగుమతి నిషేధం తర్వాత శ్రీలంక ఎరువుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకకు నానో ఎరువుల సరఫరాను వేగవంతం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది.