రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
‘2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం ఓటర్లు 94.50 కోట్లకు పైన ఉన్నారు. భారత ఎన్నికల సంఘం డేటాబేస్ ప్రకారం కొత్త ఏడాది మొదటిరోజున ప్రచురించిన మొత్తం ఓటర్ల సంఖ్య 94,50,25,694.’ ఈ సమాచారాన్ని నాటి న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజీజు రాజ్యసభకు ఫిబ్రవరి 2న ఓ లిఖిత జవాబులో తెలిపారు. రాజ్యాంగం ప్రకారం తొలి సాధారణ ఎన్నికలకు ముందు 1951లో మొత్తం నమోదైన ఓటర్లు 17 కోట్ల 32 లక్షలని, ఐదేళ్ల తర్వాత 1957 ఎన్నికల సమయానికి వారి సంఖ్య 19.37 కోట్లకు పెరిగిందని కొద్ది నెలల క్రితం రాజకీయపక్షాలకు రాసిన లేఖ ద్వారా ఎన్నికల కమిషన్ వివరించింది. ఇలా దేశంలో కేవలం నివాసం (పౌరసత్వం), నిర్ణీత వయసుకు చేరుకోవడం అనే ప్రధాన అర్హతల ద్వారా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విధానం ప్రవేశపెట్టడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. ప్రజలను వర్గాలుగా విభజించి ఒకదాని తర్వాత ఒక తరగతి జనానికి ఓటు హక్కు ఇవ్వలేదు స్వతంత్ర భారతదేశం. నిర్ణీత వయసు నిండిన (1947లో 21 ఏళ్ల, 1989 నుంచి 18) ప్రజలందరికీ జాతి, మత, కుల, లింగభేదం లేకుండా ఓటు హక్కు కల్పించిన దేశంగా ఇండియా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. పాశ్చాత్య దేశాల్లో మొదట ఉన్నత వర్గాలకు తర్వాత కార్మికులు, స్త్రీలకు ఓటు హక్కు కల్పించారు. ఓటు కోసం శ్రామికులు, మహిళాలోకం అనేక దశాబ్దాలు పోరాటం చేయాల్సివచ్చింది. కాని ఇండియాకు స్వాతంత్య్రం ప్రకటించడానికి ముందు ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తులో 1947 ఏప్రిల్ మాసంలోనే వయోజన ఓటింగ్ పద్ధతిపై సభ్యుల మధ్య ఓ అంగీకారం కుదిరింది. రాజ్యాంగ సభ సభ్యుల మధ్య ఈ ఒప్పందం కుదరడానికి రెండు దశాబ్దాల ముందే వయోజన ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను పండిత నెహ్రూ చేశారు.
1923 నెహ్రూ నివేదికతో వయోజన ఓటింగ్ కు జాతీయోద్యమ కాలంలో హామీ
నిర్ణీత వయసు నిండిన భారత పౌరులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఓటు హక్కు ఇచ్చే వయోజన ఓటింగ ప్రక్రియ అమలులోకి తీసుకొస్తామని జాతీయోద్యమ సమయంలో భారతీయులకు స్వాతంత్య్ర పోరాటం నడిపిన నేతలు హమీ ఇచ్చారు. 1928లో భారత జాతీయ కాంగ్రెస్ నియమించిన జవహర్లాల్ నెహ్రూ కమిటీ– వయోజన ఓటింగ్ పద్ధతి అమలు చేయాలని సిఫార్సుచేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో వలసపాలనకు వ్యతిరేకంగా ఉద్ధృతమైన జాతీయ పోరాటంలో ఈ మేరకు జనం కూడా డిమాండ్ చేశారు. నాటి బ్రిటిష్ పాలకులు పరిమిత అధికారాలతో ఏర్పాటు చేసిన కేంద్ర, రాష్ట్రాల చట్టసభల ఎన్నికల కోసం ఓటర్ల నమోదు కార్యక్రమం ఆరంభించినప్పుడు కనీస విద్యార్హతలు, ఆస్తి, ప్రభుత్వానికి పన్ను చెల్లించే ఉన్నతవర్గాలకే ఓట హక్కు కల్పించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చాక ఈ కారణాల వల్ల దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్లకు కాస్త ఎక్కువ. అంటే నాటి వయోజన జనాభాలో (21 ఏళ్లు నిండినవారు) ఇది కేవలం ఐదో వంతు మాత్రమే. 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి తెచ్చే క్రమంలో ఓటు హక్కును ఎక్కువ వర్గాలకు విస్తరించాలనే విషయంపై నాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు, చట్టసభల సభ్యులకు మధ్య పలు రకాల సంప్రదింపులు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక పౌరులకు ఓటు హక్కు ప్రసాదించే వయోజన ఓటింగ్ ప్రక్రియ ఆచరణసాధ్యం కాదని అధికారులు వాదించారు. పాలనాపరంగా కూడా ఈ ప్రతిపాదన అమలు కుదరని పని అని వారు అభివర్ణించారు. అయితే, 1947–50 మధ్య స్వతంత్ర భారతంలో వయోజన ఓటింగ్ అమలు చేయాలని నిర్ణయించి దాన్ని భారత నూతన రాజ్యాంగంలో చేర్చారు. అలా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని గొప్ప ప్రయోగం 1951–52 ఎన్నికల్లో చేసి, భారతదేశం గొప్ప విజయం సాధించింది. రాజకీయ చైతన్యానికి గొప్ప చదువులు, ఆస్తులు అవసరం లేదని, సహజ సిద్ధమైన వివేకం ఉంటే చాలని, అదే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తుందని భారత ప్రజానీకం నిరూపించారు. సువిశాల భారతదేశంలో ఓటర్ల నమోదు బాధ్యత తొలి భారత ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు 1950 మార్చిలో అప్పగించడానకి ముందు ఓటర్ల నమోదు ప్రక్రియ 1947 సెప్టెంబర్ లో ఆరంభమైంది. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా పేరు సంపాదించడానికి, చలనశీల ప్రజాతంత్ర వ్యవస్థకు పునాదులు బలోపేతం కావడానికి ఈ వయోజన ఓటింగ్ ఎంతగానో ఉపకరిస్తోంది.