ఆత్మీయుల సమక్షంలో.. బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు ‘స్వీయ వివాహం’ చేసుకొంది.సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. ఒక్క వరుడే లేడు. ముందుగానే అన్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24ఏళ్ల క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇందుకు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే, ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమా తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకొంది.
ఇంతకీ ఎవరీ క్షమా బిందు?
గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు సరేనన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియోకాల్ ద్వారా హాజరయ్యారు.