Suryaa.co.in

Political News

ప్రభావశీల నాయకులు మోడీ,కేసీఆర్ !

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న నాయకులని ఒక సర్వే వెల్లడించింది. వాగ్ధాటి,ప్రజల్ని మంత్ర ముగ్దుల్ని చేయగల ప్రసంగాలలో ఈ ఇద్దరికీ ఎవరూ సాటిలేరు.ప్రభావశీలుడైన నాయకుడు ప్రధాని మోడీతో టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్‌ పోటీ పడుతున్నారు.తెలంగాణ యాసతో కూడిన ప్రసంగం… అందులో దొర్లే సామెతలు,ఆకట్టుకునే నినాదాలు కేసీఆర్ సొంతం. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు వలన కేసీఆర్ ‘ప్రత్యేక’ నాయకునిగా గుర్తింపు పొందుతున్నారు. భాషా పటిమలో మమతా బెనర్జీ,స్టాలిన్,జగన్,నితీష్ కుమార్, ఉద్ధవ్ థాకరే వంటి ముఖ్యమంత్రులను కూడా ఆయన ఎప్పుడో వెనక్కి నెట్టిపారేశారు.

”గాడిదలకు గడ్డేసి… ఆవులకు పాలు పిండితే వస్తాయా?: కత్తి ఇంకొకనికి ఇచ్చి .. ఇంటోన్ని యుద్ధం చేయమంటే కుదురుతదా”? అంటూ ఉద్యమ కాలంలో ఆయన సంధించిన మాటలు తూటాల వలె పేలినవి. ఆయన సమ్మోహన శక్తి, ఎత్తుగడలు,అత్యంత వేగంగా తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్,బీజేపీ వంటి పార్టీలను కోలుకోకుండా చేస్తున్నవి. ‘టిఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల సొంత పార్టీ’ అని ఆయన బలంగా ముద్ర వేయగలిగారు.ఇటీవల టిఆర్ఎస్ 21 వ ఆవిర్భావ సదస్సులోనూ ”తెలంగాణకు టిఆర్ఎస్ రక్షణ కవచంగా ఉంటుంద”ని కేసీఆర్ ప్రకటించారు.తాము కాపలాదారుగా ఉంటామని కూడా ఆయన అన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోగలదని ముందుగానే ఊహించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెనుకంజ వేయని కారణంగానే 60 ఏళ్ల కల సాకారమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కాంట్రిబ్యూషన్ ఘనమైనది. మరవరానిది . కానీ ఆ విషయాన్ని సరిగ్గా ప్రచారం చేసుకోవడంలో,లేదా ప్రజల్ని తమ వైపునకు ఆకర్షించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం దారుణంగా విఫలమైంది.ప్రతిపక్షాలను బలహీనపరచడం లేదా బలహీనంగా ఉన్న చోట వాటిని చావుదెబ్బ కొట్టడం వంటి విద్య కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.దాదాపు ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దిక్కుతోచని స్థితిలో ఉన్నది.రేవంత్ రెడ్డి నాయకత్వానికి వెన్నుదన్ను ఇవ్వవలసిన మిగతా నాయకులు ఆయనను ‘వెన్నుపోటు’ పొడవడం ఎలా? అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారు.ఆ పార్టీకి ఇదొక ప్రతికూల అంశం.ఒక వేళ కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై గెలిచినా వాళ్ళు పార్టీ ఫిరాయించరన్న గ్యారంటీ లేకపోవడం మరొక విషాద ఘట్టం.2018 లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది జారుకోవడం ఆ పార్టీ పట్ల ప్రజలలో,కాంగ్రెస్ ఓటర్లలో నమ్మకాన్ని సడలించింది.తాజాగా 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ‘పరిస్థితి’ రిపీట్ కాకుండా ఎలాంటి ‘కట్టడి’ చర్యలు తీసుకుంటారో తెలియదు.రాజకీయాల్లో ధర్మం,అధర్మం అనేవి పనికిరాని మాటలు.అవి ఆచరణలో చెల్లుబాటు కానివి.

తెలంగాణ ఉద్యమం ఆటుపోట్లకు గురైనప్పుడు ”సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు.రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది” అని తెలంగాణ వాదులకు,ఉద్యమ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు. చరిత్ర గురించి అవగాహన పుష్కలంగా ఉన్నందున కేసీఆర్ ఇలాంటి విషయాలు అలవోకగా చెబుతుండేవారు.ఇక తెలుగు సాహిత్యంపై ఆయనకున్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు.ఉద్యమ సమయంలో కానీ,పరిపాలానా కాలంలోనూ ఆయనతో సమఉజ్జీగా పోరాడగలిగిన నాయకులు కాంగ్రెస్,బీజేపీలలో తయారు కాలేదు.

‘స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష’ అని అప్పుడూ ఇప్పుడూ టిఆర్ఎస్ మాట్లాడుతున్నది.కేసీఆర్ ఏది చేసినా,ఏమి మాట్లాడినా ముందస్తుగా భారీ కసరత్తు జరుపుతారు.అవి అప్పటికప్పుడే మదిలోంచి వచ్చిన వ్యాఖ్యలుగా మనకు అనిపించినా వాస్తవం కాదు. అంతకు ముందు కొంతకాలంగా ఆయన మనసులో దానిపై ఆయన ఘర్షణ పడుతూ ఉంటారు. ”సంపూర్ణ తెలంగాణను పునర్నిర్మించుకోవాలంటే. మన రాష్ట్రంలో మన పార్టీ గెలవాలి. మన ప్రభుత్వం ఏర్పడాలి. మన రాష్ట్రంలో మనం రాజకీయ స్వతంత్రం సాధిస్తేగానీ న్యాయం జరగదు” అని కేసీఆర్ ఇచ్చిన సందేశం 2014 లో ప్రజలకు సులభంగా ‘కనెక్టు’అయ్యింది.కాంగ్రెస్ కు ఈ తరహా మాట్లాడే నాయకుల,వ్యూహకర్తల కొరత ఎక్కువగా ఉన్నది.అందువల్ల వాళ్ళు ప్రజలతో ‘కనెక్టు’ కాలేకపోతున్నారు.”మన తలరాతను మనమే రాసుకోవాల”న్న నినాదం అద్భుతంగా పనిచేసింది.కేసీఆర్‌ కు ఉన్న ఆకర్షణ,ఆదరణ,పట్టుదల కాంగ్రెస్ లో కానరావడం లేదు.

కేసీఆర్ స్థాయిలో కాకపోయినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అలాంటి వాగ్ధాటి,పోరాట పటిమ ఉన్నప్పటికీ జాతీయ పార్టీ కనుక ఢిల్లీ నుంచి అందే సూచనలు,డైరెక్షన్ ప్రకారమే పనిచేయవలసి ఉంటుంది.జాతీయ పార్టీలకు ఉండే మైనస్ పాయింట్లే కేసీఆర్ కు ప్లస్ అవుతున్నవి.ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోగలినవాడే సమర్ధ నాయకుడు.2018 లో ఎన్నికల సమయంలో చంద్రబాబు + కాంగ్రెస్ కూటమిని కేసీఆర్ తన ఎత్తులతో సులభంగా చిత్తు చేసి పారేశారు.2013 లోనూ అలాంటి ‘భావోద్వేగ’భరితమైన అవకాశాలు చిక్కితే టిఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం.ఇక కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెమ్మదిగా పెరుగుతోందని, కనుక తమకు ఇంకొక మార్గం లేనందున ప్రజలు తమకు పట్టం కడతారని టీ.కాంగ్రెస్ నాయకులు గట్టిగా భావిస్తున్నారు.ఇక బీజేపీ కూడా తెలంగాణ తమ చేతికి చిక్కినట్లేనన్న భ్రమల్లో ఉన్నది.’ప్రజా సంగ్రామ యాత్ర’పేరిట బండి సంజయ్ చేస్తున్న హడావుడితో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది.

టిఆర్ఎస్ పై ప్రజలలో ఉన్న ‘వ్యతిరేకత’ను ఎక్కువగా అంచనా వేసుకుంటూ కాంగ్రెస్,బీజేపీలు ఊహల పల్లకీలో ఉన్నవి.ఆ పార్టీలు కేవలం ‘నెగెటివ్’ ఓట్లపైన ఆశయాలు పెట్టుకున్నవి.టిఆర్ఎస్ అభివృద్ధి నమూనాకు ‘ప్రత్యామ్నాయ’నమూనాను ప్రదర్శించి ‘పాజిటివ్’ఓట్లు రాబట్టవలసిన ‘మెకానిజం’ విపక్షాలలో కనిపించడం లేదు.అందుకు తగిన శిక్షణ,రాజకీయ పరిణతి,వ్యూహరచన ఆ రెండు పార్టీలలో కొరవడినవి.

తెలంగాణ ఉద్యమ అనుభవం,రెండు టర్మ్ లలో సాగిస్తున్న పరిపాలనా చాతుర్యం కేసీఆర్ కు లభించిన గొప్ప అడ్వాంటేజ్.ఉద్యమాల అనుభవమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ప్రతిపక్ష’ పాత్రను కేసీఆర్ సమర్ధంగా పోషిస్తున్నారు.ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రశంసించడం బీజేపీ తెలంగాణ నాయకత్వానికి మింగుడుపడడం లేదు.టీబీజేపీ ఇలాంటి ఘటనలను చూడడం ఇదే మొదటిసారి కాదు.ఇదివరకు కూడా కేంద్రమంత్రులు కేసీఆర్ పాలనా తీరును అభినందించడం,దానిపై బీజేపీ నాయకులు రుసరుసలాడడం,కేంద్రంలోని అగ్రనాయకులకు ఫిర్యాదు చేయడం చాలా సందర్భాలలో కనిపించిన సన్నివేశాలే!

ఇక వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ’ సభావేదిక మీదినుంచి రాహుల్ గాంధీ ఇచ్చే సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.మే 6, 7 తేదీలలో రెండు రోజులపాటు తెలంగాణలో జరిపే రాహుల్ పర్యటనను రేవంత్ రెడ్డి బృందం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.పార్టీలో ఎన్ని ముఠా తగాదాలున్నా సమిష్టిగా పనిచేస్తారని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్,ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసి.వేణుగోపాల్ భావిస్తున్నారు.

– ఎస్.కె. జకీర్
ఎడిటర్, బంకర్‌న్యూస్

LEAVE A RESPONSE