రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా ప్రధాన సమాచార కమీషనర్, సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్ మహబూబ్ భాషా, పి.శ్యామ్యూల్ జోన్నాధన్ సోమవారం రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసారు. పాత్రికేయిలుగా విశేష అనుభవం ఉన్న వీరికి ఇటీవల ప్రభుత్వం సమాచార కమీషన్ లో అవకాశం కల్పించింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన వీరు సమాచార కమీషన్ కు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పాత్రికేయిలుగా ప్రజా సమస్యల పట్ల విశేష అవగాహన కలిగి ఉన్నందున సమాచార కమీషన్ ద్వారా వారికి గణనీయమైన సేవను అందించాలని ఆదేశించారు. అతి త్వరలో సాంవత్సరిక నివేదికను సమర్పించనున్నామని కమీషనర్లు మహబూబ్ భాషా, శ్యామ్యూల్ జోన్నాధన్ గవర్నర్ కు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.