– ఎమ్మెల్యే కన్నా ప్రకటన
గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు విగ్రహాన్ని సత్తెనపల్లిలో ఏర్పాటు చేయనున్నట్టు మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన ఆయన ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ కు ఆయన పేరు పెట్టనున్నామని, ప్రజా వేదిక వద్ద కోడెల వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు అనే అంశంపై లెక్చర్ కూడా ఉంటుందన్నారు. అనంతరం ప్రతిభా అవార్డులు కూడా ప్రదానం చేస్తామని చెప్పారు.
అధికారం పోయిన తర్వాత జగన్ కు మతిభ్రమించిందని, రాష్ట్రంలో ఇరిగేషన్ కు సంబంధించి జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. కాలువలో ఒక తట్టమట్టి కూడా తీయలేదు… దీంతో పై నుండి వరద వచ్చి పడిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన పాపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందిస్తోందని, బాధితులు బాధ పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కన్నా కోరారు. మోసాలతో ప్రజలను మభ్య పెట్టొద్దని గత పాలకులకు హితవు పలికారు.