-అంబేద్కర్ ఆశయ సాధన కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ
-ప్రతి పేదవానికి కూడు-గూడు-గుడ్డ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం
-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం
-ఇళ్లకు ఓటీఎస్ కాదు – పేదల మెడకు ఉరితాడు
-పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది
-పేదల పట్ల ప్రభుత్వమే కాల్ మనీని ప్రోత్సహిస్తుంది – ఓటిఎస్ అంటేనే కాల్ మనీ
-సచివాలయంలో రిజిస్ట్రేషన్లు ఇల్లీగల్ – రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్స్ కే ఉంది – స్టాంప్స్ వైసీపీ కలర్ లోనా?
-ప్రజలకు పథకాలు కట్ చేస్తే వైసీపీనే ప్రజలు అధికారాన్ని కట్ చేస్తారు
-నారా చంద్రబాబు నాయుడు
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 65వ వర్థంతికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుందని, ఓటిఎస్ పేరుతో పేదలకు ఒత్తిళ్లు తెస్తూ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
అంబేద్కర్ స్పూర్తిగా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని, రాజ్యాంగస్పూర్తితో ముందుకెళతామని తెలుగుదేశం స్థాపించినప్పుడు ఎన్టీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ రాజ్యాంగ రూపశిల్పిగా, ఆర్థిక వేత్తగా, ప్రజాస్వామ్య వాదిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన ముందు చూపుతో రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఎంతో దూరదృష్టి ఉన్న శిల్పి మన అంబేద్కర్. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేసుకుంటుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిదిగా రుజువవుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. బ్రిటన్ రాజ్యాంగం ఎక్కడా దారితప్పలేదు. అదే విధంగా అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని గమనిస్తే అగ్రదేశంగా నిలబడటమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. వ్యక్తులను ఎంపిక చేసుకొనే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది.
2016లో అంబేద్కర్ 125వ జన్మదినం సందర్భంగా దేశమంతా ఉత్సవాలను చేస్తుంటే అదే రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ స్పూర్తి భావితరాలకు తెలియజేసేలా అమరావతిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అంత ఎత్తైన విగ్రహం పెట్టాలనే దేశంలోనే నిర్ణయం తీసుకున్నది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. దీనికి రూ.210 కోట్లు అవుతుందని అంచనా వేశాం. ఇందుకోసం మార్చి 30, 2016లో జీవో 38 కూడా విడుదల చేశాం. విగ్రహ నిర్మాణానికి 20 ఎకరాల భూమి ఎంపిక చేశాం. ఇందులో కన్వెన్షన్ సెంటర్, బుద్దిస్ట్ విజ్ఞానకేంద్రం, లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. శాశ్వతంగా ఇది ఒక రీసెర్చ్ సెంటర్ కావాలని, అంబేద్కర్ ఆశయాలను అనునిత్యం అధ్యయనం చేయాలని భావించాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేయాలనుకున్నాం. కాని నేడు ఏమైంది? ఆ ప్రాజెక్టు అతీగతీ లేదు. నాశనం చేశారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది అంబేద్కర్ పై ఈ ప్రభుత్వానికి ఎంత అభిమానం ఉందో. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గాంధీజీ, అంబేద్కర్ వంటి వారికి గౌరవం ఇవ్వడం తెలీని ప్రభుత్వమిది. బేషరుతుగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్పూర్తిని అందరికీ తెలియజేయాలి. పేదలందరికీ సాధికారత కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది.
ప్రతి పేదవానికి కూడు-గూడు-గుడ్డ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదలకు తిండి, ఉండేందుకు ఇల్లు, కట్టుకునేందుకు బట్టలు అందించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అసాధ్యమన్న రెండు రూపాయిలకే కేజీ బియ్యం పేదలకు అందించి సుసాధ్యం చేసి చూపిస్తే నాడు ఎన్నో విమర్శలు చేశారు. ఈ రోజు ఆ పథకమే ఆహార భద్రత కింద అమలవుతోంది. పేదలకు పక్కా ఇళ్లు తెచ్చాం. అప్పటి వరకూ రూ.500, రూ.600 ఇచ్చి గుడిసెలు వేసుకునేవారు. వర్షం, గాలి, ఎండ వస్తే నిలువ నీడ ఉండేది కాదు. అలాంటి సమయంలో పేదవారికి కూడా సొంత ఇళ్లు ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించి శాశ్వత ఇళ్లకు శ్రీకారం చుట్టారు. పేదల భద్రతకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే కోరికను ఎన్టీఆర్ సాకారం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ చేనేత కార్మికులకు న్యాయం చేయడంతో పాటు అదే సమయంలో పేదలు కట్టుకునేందుకు బట్టలు ఉండాలనుకునుకున్నారు. ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాళాకోరు తనమేంటో అర్ధం కావట్లేదు. నేను ఉచితంగా ఇళ్లకు పట్టాలిస్తున్నాను అంటాడు. దానికి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అని పేరు పెట్టారు.
ఇంతకుముందు జగన్ రెడ్డిలాంటి సాహసాలు ఎవరూ చేసి ఉండరు. అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటన. దీని కోసం జీవో నెంబర్ 82 తెచ్చారు. 52,69,891 మంది లోన్ తీసుకున్నారని, వారంతా పంచాయతీల్లో రూ.10,000, మున్సిపాలిటీల్లో రూ.15,000, కార్పొరేషన్లలో రూ.20,000 కట్టి శాశ్వతంగా ఇళ్లు పొందాలని 22.10.2021 జీవో జారీ చేశారు. మీరు తెచ్చింది ఇళ్లకు ఓటీఎస్ -పేదల మెడకు ఉరితాడు. పట్టా ఇవ్వడానికి నువ్వెవరు? భూమి కొన్నావా? రుణం ఇచ్చావా? ఇల్లు కట్టావా? 30, 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తో మొదలైన ఈ పథకాన్ని నేను కొనసాగించాను. పేదల భద్రతకు ఎలా భరోసా ఇవ్వాలి, వారికి మరింత మెరుగ్గా ఇల్లు ఎలా నిర్మించాలో ఆలోచిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం దోపిడీ చేస్తూ పేదల మెడకు ఉరితాడు వేస్తావా? గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తే జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేయనన్నారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా వాళ్లకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి ఇవ్వనన్నారు.
ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తున్నారు సంతబొమ్మాళిలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అందరూ గ్రామ వాలంటీర్లకు ఆదేశించింది ఏమనగా ఎంపీడీవో ఆదేశాల మేరకు మీ పరిధిలో ఓటిఎస్ కింద రూ.10వేలు చెల్లించని యెడల డిసెంబర్ నెల ఫించెన్ నిలిపివేయాలని జారీ చేశారు. దీనిని ప్రశ్నిస్తున్న మా నాయకులపై కేసులు బనాయిస్తున్నారా? అసలు చీటింగ్, 420 కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చి నేడు మాట తప్పారు, మడమ తిప్పారు. అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. బొబ్బిలిలో పొల్లూరి బుల్లెమ్మ వాళ్ల అబ్బాయికి ఆరోగ్యం బాగోలేక విద్య నిమిత్తం రూ.15వేలు లోన్ తీసుకుంటే వాటిని బలవంతంగా ఓటిఎస్ కింద కట్టించుకున్నారు. మీకు మానవత్వం ఉందా? పశువుల కంటే హీనంగా తయారయ్యారు. ఆ అబ్బాయి ఆరోగ్య ఖర్చులు తెలుగుదేశం పార్టీ బరిస్తుంది. పులిచింతల కోసం ఇళ్లు వదులుకున్న దాతలు నేడు ఓటిఎస్ కట్టాలా? ఉచిత ఆరోగ్యం అందిస్తామని మాట తప్పినందుకు జగన్ రెడ్డి మీద ఛీటింగ్ కేసు పెట్టాలి.
నెల్లూరు జిల్లా బాలాయపాలెం మండలంలో ప్రతి రోజు ఒక్కరితోనైనా ఓటిఎస్ కట్టించాలని జేసీ విదేహ్ కరే టార్గెట్లు ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతా నుండి సొమ్ము విత్ డ్రా చేసేలా బలవంతపు తీర్మానాలు చేయించారు. పేదల పట్ల ప్రభుత్వమే కాల్ మనీని ప్రోత్సహిస్తుంది. ఓటిఎస్ అంటేనే కాల్ మనీ. పేదలు చాలా మంది అప్పుల్లో కూరుకుపోయారు. ఓటిఎస్ పేదవాళ్లు ఎందుకు కట్టాలి. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో మాట్లాడుతూ ఓటిఎస్ కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వవద్దని చెబుతున్నారు. సచివాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లు అన్ని ఇల్లీగల్. రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్స్ కే ఉంది. అంతే గాని జగన్ రెడ్డి తాడేపల్లి పాలెస్ లో చేయడానికి మీకేం అధికారం ఉంది. స్టాంప్స్ కూడా వైసీపీ కలర్ లో వేసుకుంటున్నారు. ఉన్మాదానికి పరాకాష్టగా మారిపోయింది. తూర్పు గోదావరి కలెక్టర్ ఓటిఎస్ టార్గెట్లు పూర్తి చేయాలని చెప్పారు. మీరే చేసే పనులే రేపు మీకు శాపాలుగా మారతాయి. పేద వాళ్లకు ఉరితాళ్లు వేయాలని చూస్తున్నారు. ఆ ఉరితాళ్లు మీ మెడకు పడే పరిస్థితి వస్తుంది. విజయనగరం జిల్లా వేంపాడులో ఎప్పుడో ఇచ్చే ఇళ్లకు ఓటిఎస్ కట్టాలని చెప్పడంతో ప్రజలు మండిపడే పరిస్థితికి వచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం 31వ డివిజన్లో డొక్కు లలితా కుమారికి 2006లో ప్రభుత్వం రూ.9వేల నగదు 50 బస్తాల సిమెంట్ ఇస్తే వాళ్లు మిగిలిన డబ్బులు అప్పు చేసి కట్టుకున్నారు. కాని నేడు రూ.20వేలు కట్టమని అంటున్నారు. ఇదేమి న్యాయం? పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన పార్వతీశానికి 1996-97లో ఇళ్లు వచ్చింది, తీసుకున్న రుణం బ్యాంకులకు కట్టేశాడు అయినా అతను రూ.10వేలు కట్టమని అంటున్నారు. ఇంటికి వచ్చి ప్రతి రోజు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రజలకు పథకాలు కట్ చేస్తే వైసీపీనే ప్రజలు అధికారాన్ని కట్ చేస్తారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం, వన్నెపూడి వీఆర్వోపై ఒత్తిళ్లకు గురవ్వడంతో గుండె పోటుకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా రొట్టివలసలో ఆళ్లూరి రాధాపై ఓటిఎస్ ఒత్తిళ్లకు గురి చేయడంతో ఆమెకు పక్షవాతం వచ్చింది. తూర్పు గోదావరి మండపేటలో 1984లో రూ.6వేల రుణం పొంది ఇళ్లు శిధిలావస్థకు వస్తే దానికి రూ.10వేలు అడుగుతున్నారు. మేము విశాఖపట్నంలో శాశ్వతంగా పట్టాలు ఇచ్చినప్పుడు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రభుత్వ ఖర్చుతో బస్సుల్లో తీసుకువచ్చి ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ల చేతుల్లో పెట్టాం. నివాస యోగ్యం కాని ఇళ్లకు సైతం ఓటిఎస్ వసూళ్లు చేస్తున్నారు. నాడు పాతబడిపోయిన ఇళ్లకు రూ.10వేలు అందించాం. కాకినాడలో డిసెంబర్ 1న టీడీపీ నాయకులపై సెక్షన్ 353, 109 కింద ఎఫ్ఐఆర్ నెం. 262/2021 కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులకు అంత కండ కావరం ఏంటి? కళ్లు కనపడకుండా పని చేస్తున్నారా? ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించే హక్కు లేదా? పోలీసులు మాకు రూల్స్ చెబుతారా? చట్టాన్ని పోలీసులు అమలు చేయడమే గాని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదు. ఈ రోజుతోనో అయిపోదు చట్ట వ్యతిరేకంగా ఎవ్వరూ పని చేసినా జైలు పాలు కాక తప్పదు.
ప్రపంచంలో అత్యున్నత టెక్నాలిజీతో టిడ్కో ఇళ్లు కట్టాం. టిడ్కో లే అవుట్ లో గేటెడ్ కమ్యునిటీ, అప్పర్ మిడిల్ క్లాస్ లోలా ఇళ్లు కట్టాం. ఇళ్లకు మెరుగైన కలప, మౌలిక సదుపాయాలు కల్పించాం. స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, షాపింగ్ మాల్స్ కట్టాం. కాని నేడు వాటన్నింటిని నిలిపివేసి తుప్పు పట్టేలా చేశారు, పనికి రాకుండా పోయేలా చేశారు. కరోనా పేషెంట్లు, వరద బాధితుల కోసం ఆ ఇళ్లను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం. ఉచితంగా ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా ఇళ్లు, రిజిస్ట్రేషన్ చేయిస్తాం. సహాయ నిరాకరణకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరుతున్నాం. వైసీపీ మినహా అన్ని పార్టీలు ఓటిఎస్ ను వ్యతిరేకిస్తున్నాయి. పేదల ద్రోహిగా వైసీపీకి మిగిలిపోయింది. పేదల పొట్టకొట్టి ఆనందపడవద్దని సూచిస్తున్నాను. పేదరికాన్ని అవమానిస్తే అంబేద్కర్ ను అవమానించినట్లే. రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ బడుగు బలహీన వర్గాలకు సాధికారత సాధించే వరకు, ఆర్ధిక అసమానతలు తొలగిస్తే అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. సమాజంలో ఉండే మేథావులు, ఎన్జీవోలు, ప్రజా సంఘాలు అందరం కలిసి పేదలకు అండగా ఉండాలని పిలుపునిస్తున్నాను.
నాడు దామోదరం సంజీవయ్య రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ పోర్ట్ లో అవకతవకలు వచ్చాయని రాజీనామా చేశారు. అదే విధంగా నేదురమల్లి జానర్ధన్ రెడ్డి హయాంలో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశారు. నేడు వందల కోర్టు తీర్పులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నా ఆయనలో స్పందన, చలనం లేదు. తప్పు చేసిన అధికారులందరూ చట్టం ముందు దోషులే. నైతిక విలువలు పాటించరు, ప్రజాస్వామ్య స్పూర్తి లేదు, విలువలు లేని వ్యక్తులు కరుడుగట్టిన నేరస్థులు వైసీపీ నాయకులు. అక్రమంగా డబ్బు రావడంతో అధికారంలోకి వచ్చారు. వీరికి ప్రజాస్వామ్యం, న్యాయస్థానం, రాజ్యాంగం అంటే లెక్కలేదు.