దేశంలో మేధావులు పడ్డారు;
బండరాళ్లు దొరలి వచ్చినట్టుగా,
ముళ్ల వాన కురిసినట్టుగా,
క్రూర మృగాలు ఉరికినట్టుగా,
ఘోర సర్పాలు కాట్లువేసినట్టుగా,
దేశంలో మేధావులు పడ్డారు.
సమాజం
మంటల్లో చిక్కుకున్న వనం అయింది;
పౌరుడి మనుగడ
మరుగుతున్న నీళ్లలో మునిగిన తల అయింది.
పెరిగిన మేధ పగుళ్లకు కారణమయింది;
అభద్రత వచ్చిన జ్ఞానానికి ఫలితం అయింది.
చదువుకు విదేశీ విధ్వంసక భావజాలం నిప్పంటుకుంది;
ఈ గడ్డను ధ్వంసం చెయ్యడానికి
విద్య విజృంభిస్తోంది.
మేధావులు దేశాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు;
తమ బుఱ్ఱల్లోని రోగాల్ని ఈ మట్టికి అంటిస్తున్నారు.
మేధ అన్న విషం ఒలికింది;
అది దేశమంతా చిందింది.
శుభ్రం చేసుకోవడం మన బాధ్యత;
దేశ శుభ్రతే దేశ భద్రత.
పామరులారా,
సామాన్యులారా,
ఈ మట్టి మనది,
ఈ సమాజం మనది,
ఈ దేశం మనది.
పామరులారా,
సామాన్యులారా,
మేధావుల భ్రష్టత్వం
సాహిత్యం కాదు;
మేధాజాగిలాల మొరుగుడు సంగీతం అవదు;
మేధావులకు మనం బలి కాకూడదు.
పామరులారా రండి,
సామాన్యులారా రండి,
ప్రజలారా రండి;
మేధావుల్ని వేటాడి వేటాడి నాశనం చేసేద్దాం;
మేధావుల పీడను వదిలించుకుందాం.
వక్రతకు అతీతంగా,
ఛిద్రం అయిపోకుండా
మామూలుగా ఉందాం;
నిమ్మళంగా బతుకుదాం.
మనల్ని మనం దక్కించుకుందాం.
మనం మన దేశాన్ని నిలుపుకుందాం;
మన సంతతికి ఈ దేశాన్ని
సంపదగా అందిద్దాం.
– రోచిష్మాన్
9444012279