రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: డైరెక్ట్-టు-మొబైల్ (డీ-టు-ఎం) బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ టెలివిజన్ కార్యక్రమాలను నేరుగా స్మార్ట్ ఫోన్‌లకు ప్రసారం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ, కాన్పూర్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
డీ-టు-ఎం టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం ప్రసారభారతి ఐఐటీ, కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జూన్ 1న నిర్వహించిన సమావేశంలో ఐఐటీ, కాన్పూర్ డీ-టూ-ఎం టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని పరీక్షించడానికి బెంగుళూరులో లైవ్ పీఓసీ టెస్టింగ్ సైట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
భారతదేశ శాటిలైట్ టీవీ ఛానల్స్ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ పాలసీ మార్గదర్శకాల ప్రకారం విదేశీ కంపెనీకి చెందిన శాటిలైట్ ఛానల్ ఏదైనా ఆమోదం పొందిన టెలీపోర్ట్ ఆపరేటర్ సహాయంతో తమ కార్యక్రమాలను భారత్ నుంచి అప్‌లింక్ చేసుకోవచ్చు. తద్వారా విదేశాల్లో ఆ కార్యక్రమాలను డౌన్‌లింక్ చేసుకుని వీక్షించవచ్చని అన్నారు.
వార్షిక అనుమతి రుసుము చెల్లించడం ద్వారా అటువంటి విదేశీ ఛానల్స్ ఇండియన్ టెలీపోర్టు నుంచి తమ కార్యక్రమాలను అప్‌లింక్ చేసుకోవచ్చని అన్నారు. దీని వలన ఇండియన్ టెలీపోర్ట్ ఆపరేటర్లకు వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. భారత్ భవిష్యత్తులో అప్‌లింకింగ్ హబ్‌గా అవతరిస్తుందని మంత్రి తెలిపారు.
కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగే ఆలోచన లేదు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను విస్తృతం చేస్తూ వాటిలో సమర్దత సాధించే లక్ష్యాలతో జాతీయ క్రీడా విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ రూపొందించిన అనేక పథకాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌ను ఇంగ్లండ్ రాణి లేదా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రారంభించనున్న కారణంగా భారత్ ఆ పోటీల నుంచి వైదొలగే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అటువంటి ఆలోచనేమీ లేదని మంత్రి స్పష్టం చేశారు.