Suryaa.co.in

Andhra Pradesh

పారిశ్రామిక కారిడార్ల ద్వారా రూ.లక్ష కోట్లపైన పెట్టుబడులు

-పారిశ్రామిక కారిడార్ల ద్వారా 25 వేల ఎకరాలలో రూ.లక్ష కోట్లపైన పెట్టుబడులు 
-2040 కల్లా కేవలం పారిశ్రామికవాడల ద్వారా 5,50000మందికి ఏపీలో ఉద్యోగాలు
-సెప్టెంబర్ 2022 కల్లా మూడు కారిడార్ల కీలక పనులు కొలిక్కి
-3 కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్
-కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశం
-పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ 

అమరావతి, జూలై, 07 : దేశంలో ఎక్కడా లేని విధంగా 3 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశం గురువారం ఢిల్లీ వేదికగా జరిగింది. డీపీఐఐటీ, నిక్డిక్ట్ నేతృత్వంలో జరిగిన “జాతీయ పారిశ్రామిక వాడ అభివృద్ధి కార్యక్రమం”లో మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీసీ) ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏపీ పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ), విశాఖపట్నం -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్ బీఐసీ) లలో నిక్డిక్ట్ నిధుల ద్వారా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్, కొప్పర్తి, శ్రీకాళహస్తి- ఏర్పేడు, ఓర్వకల్ నోడ్ లలో పనులు పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నాయన్నారు. మూడు పారిశ్రామిక వాడలు పూర్తయితే 2040 కల్లా 5,50000మందికి ఏపీలో ఉద్యోగాలు అందించవచ్చని పరిశ్రమల మంత్రి తెలిపారు. మొత్తం 25వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోని జిల్లాలన్నీ కలుపుతూ ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ కారిడార్ల ద్వారా రూ.లక్ష కోట్లకు పైన పెట్టుబడులు వస్తాయన్నారు. విశాఖపట్నంలో నక్కపల్లి క్లస్టర్ , గుట్టపాడు క్లస్టర్లను కూడా పారిశ్రామికంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. మూడు కారిడార్లపై ఎప్పటికప్పుడు ప్రణాళికను సిద్ధం చేసి అనుకున్న సమయానికి నిధులను సేకరించి మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. భూ సమీకరణలు, ప్రాజెక్టుపై పూర్తి నివేదికను తయారు చేయడం, నీటి సరఫరా , విద్యుత్ సరఫరా, టెండర్ల నిర్వహణ సహా కీలకమైన పనులను సెప్టెంబర్, 2022లోగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా నిక్ డిక్ట్(ఎన్ఐసీడీఐటీ) నిధులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహకారం ద్వారా కారిడార్ల అభివృద్ధి మరింత వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయాన్ని మంత్రి కోరారు.

న్యూఢిల్లీలోని అశోక హోటల్ కన్వెన్షన్ మందిరంలో జరిగిన అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హర్యాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీహార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శానవాజ్ హుస్సేన్ నీతి ఆయోగ్ ఛైర్మన్ సుమన్ బేరీ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తరపున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE