Suryaa.co.in

Editorial

ఇదో రకం.. ‘ఐపిఎస్ ఇంటర్నల్ కండిషన్ బెయిల్’!

  •  ఆ 16 మంది ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా మెమో

  • వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్‌లు ఆఫీసుకు రావలసిందే

  • ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లాల్సిందే

  • డీజీపీ ద్వారకా తిరుమలరావు అసాధారణ ఆదేశం

  • వాళ్లది ‘కండిషన్ బెయిల్’ అంటూ జెసి ప్రభాకర్‌రెడ్డి సెటైర్లు

  • చర్యలు తీసుకోకుండా నాన్చివేత ఎందుకంటున్న ఐపిఎస్‌లు

  •  సస్పెండ్ లేదా పోస్టింగ్ ఇవ్వవచ్చు కదా అన్న వ్యాఖ్యలు

  • జగన్ జమానాలో ఏబీపై చర్యలను గుర్తుచేస్తున్న పోలీసు వర్గాలు

  • ఇప్పుడు ఆ పని ఎందుకు చేయరన్న ప్రశ్నల వర్షం

( అన్వేష్)

వివిధ కేసుల సందర్భంలో న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇస్తుంటుంది. అంటే సదరు పిటిషనర్ రోజూ పోలీసుస్టేషన్‌ను వెళ్లి సంతకాలు చేయాలన్నమాట. అది కోర్టు ఇచ్చే కండిషన్ బెయిల్. కానీ అసాధారణ రీతిలో డీజీపీ కూడా ఐపిఎస్‌లకు దాదాపు అలాంటి ‘ఇంటర్నల్ కండిషన్ బెయిల్’ ఇవ్వడం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? విన్నారా?..లేదుకదా? ఇప్పుడు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సరిగ్గా అదే పనిచేసి, సంచలనం సృష్టించారు.

అసలు ఐపిఎస్‌లకు ఏమిటి? డీజీపీ కండిషన్ బెయిల్ ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోతున్నారు కదా? అవును. తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత జెసి ప్రభాకర్‌రెడ్డి అయితే.. డీజీపీ తీసుకున్న అసాధారణ చర్యకు సరికొత్త భాష్యం చెప్పారు. ‘మాకు కోర్టు కండిషన్ బెయిలిస్తుంది. అంటే మేం పోలీసుస్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి ఇళ్లకు వెళతాం. కానీ మీకు డీజీపీ కండిషన్ బెయిల్ ఇచ్చి, ఉదయం-సాయంత్రం సంతకం పెట్టమనడం వెరీ బ్యాడ్. ఐపిఎస్-ఐఏఎస్‌లకు పట్టిన దుస్థితికి జాలిపడుతున్నా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారులకూ రాకూడదు. వారికి పట్టిన గతికి నాకేమీ సంతోషంగా లేదు. చేసిన పాపాలు ఊరకనే పోవు. అనుభవించండి అని నేను అనను. కానీ ఇప్పుడైనా మారండి సార్. మీ పరువు నిలబెట్టుకోండి సార్’ అంటూ.. బాధాతప్త హృదయంతో విడుదల చేసిన వీడియో, సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరకంగా డీజీపీ ఇచ్చిన మెమోను జెసి ప్రభాకర్‌రెడ్డి ‘కండిషన్ బె యిల్’గా అభివర్ణించారన్నమాట.

ఐదేళ్ల జగన్ జమానాలో ఒక వెలుగువెలిగి.. జగన్ కళ్లలో మెరుపుల కోసం విపక్షాలను వేధించి, కాయకష్టం చేసిన 16 మంది ఐపిఎస్ అధికారులను, కూటమి సర్కారు శంకరగిరి మాన్యాలు పట్టించింది. అంటే వారికి ఎలాంటి పోస్టింగ్ లేకుండా, సస్పెండ్ చేయకుండా పక్కనపెట్టింది. ఆరకంగా ఇప్పుడు వారంతా వెయిటింగ్‌లో ఉన్నారన్నమాట.

సరే.. సహజంగా వెయిటింగ్‌లో ఉన్న అధికారులు స్వేచ్ఛగా తిరుగుతుంటారు. వారిని హెడ్‌క్వార్టర్‌లోని చీఫ్‌కు రిపోర్టు చేసి, అందుబాటులో ఉండమని ఉత్తర్వులిస్తారు. అయితే హెడ్‌క్వార్టర్ విడిచివెళ్లవద్దని ప్రత్యేకించి ఎక్కడా ఆదేశించరు. దానితో హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేసిన అధికారులు, మళ్లీ పోస్టింగు వచ్చేంతవరకూ స్వేచ్ఛగా బయట తిరుగుతుంటారు.

కూటమి సర్కారు అధికారంలోకి వ చ్చిన ఆ 16 మందిని ప్రతిరోజూ మంగళగిరిలోని చీఫ్ ఆఫీస్ కార్యాలయానికి ఉదయం వచ్చి, సాయంత్రం వెళ్లాలని.. ఆ మేరకు ఆఫీసులో సంతగించాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు తాజాగా ఇచ్చిన అసాధారణ మెమో, పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా నాన్ క్యాడర్ ఐపిఎస్‌లు, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీల విషయంలోనే ఇలా జరుగుతుంది. వారికి ఎలాంటి పనులు అప్పగించరు. వీఐపీల బందోబస్తులకు వాడుతుంటారు. ఉదయం చేతిలో డైరీ పట్టుకుని, మళ్లీ సాయంత్రానికి వెళ్లడమే తప్ప.. ఐపిఎస్‌లకు ఇలాంటి శిక్షలు విధించిన దాఖలాలు లేవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

కాగా వెయిటింగ్‌లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్, కాంతి రాణా టాటా, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు, విశాల్ గున్ని, విజయరావు, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, అన్బురాజన్, వై రవిశంకర్ రెడ్డి, అమ్మిరెడ్డి .. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు.

LEAVE A RESPONSE