Home » ఐఆర్‌ను 20శాతానికి పెంచాలి

ఐఆర్‌ను 20శాతానికి పెంచాలి

-సాధారణ బదిలీలు చేపట్టండి
-నాలుగు పెండింగ్‌ డీఏలను చెల్లించాలి
– సీపీఎస్‌ను రద్దుచేయాలి

-అదనపు క్యాడర్‌ స్ట్రెంత్‌ను మంజూరుచేయాలి
-సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలి
-ప్రభుత్వానికి టీజీవో కార్యవర్గం డిమాండ్‌

హైదరాబాద్‌ : దశాబ్దకాలంగా నోచుకోని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్‌ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన వారిని తిరిగి వెనక్కి రప్పించాలని కోరింది. హైదరాబాద్‌లో జరిగిన టీజీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధానకార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల సమాన వాటాతో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని, ట్రస్టులో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం పెంచాలని, ప్రస్తుతం ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువు కాలాన్ని పొడిగించాలని కోరారు.

సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ పునరుద్దరించాలని, ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలని, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ఆమోదించిన ఫైల్‌ను అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. జీవో -317 వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకొన్న అన్ని రకాల ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ఐఆర్‌ను 5 నుంచి 20శాతానికి పెంచాలని కోరారు.

వైద్యారోగ్యశాఖకు సంబంధించిన జీవో 142ను పునఃసమీక్షించాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో గత జిల్లాల ప్రకారం అదనపు క్యాడర్‌ స్ట్రెంత్‌ను మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులకు ఒక నెల వేతనంతోపాటు, పెండింగ్‌లోని రెమ్యునరేషన్‌ను చెల్లించాలని కోరారు. జిల్లా, మండలస్థాయి అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, అద్దె వాహనాల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేట్‌ అధ్యక్షుడు బీ శ్యామ్‌, ఉపాధ్యక్షుడు ఏ జగన్‌మోహన్‌రావు, కోశాధికారి ఉపేందర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పరమేశ్వర్‌రెడ్డి, మహిళా ప్రతినిధి జీ దీపారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎమ్‌ రామకృష్ణాగౌడ్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply