Suryaa.co.in

Andhra Pradesh

అనుమతులు లేకుండా బెకెమ్ ఇన్ఫ్రా అడ్డగోలు తవ్వకాలు

– అధికారుల తనిఖీలో అక్రమాలు బట్టబయలు
– పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారుల తనిఖీలు
– సంస్థలు అధికారుల నోటీసులు బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ
– ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలు
* అనుమతులకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా రెడ్ గ్రావెల్ తవ్వకం
* రెవెన్యూ, గనుల శాఖల విచారణలో బయటపడిన విషయాలు

ఏలూరు: ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ దీపం 2 పథకం ప్రారంభం కోసం ఐ.ఎస్.జగన్నాథపురంలో పర్యటించారు. అక్కడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొండ సమీపంలో ఎర్ర కంకర తవ్వారు. భారీగా తవ్వకాలు సాగించినట్లు చూస్తుంటేనే కనిపించే పరిస్థితి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

నివేదికలో వివరాలివి…
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి విచారణ నివేదిక చేరింది. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలోని సర్వే నెంబర్ 425 లో 6.18 ఎకరాల్లో 74,875 క్యూబిక్ మీటర్లు తవ్వుకొనేందుకు అనుమతి తీసుకొని ఎలాంటి తవ్వకాలు చేయలేదు. అదే సర్వే నెంబర్ లో మరోచోట 1.48 ఎకరాల్లో 36,107 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని 33,637 క్యూబిక్ మీటర్లు తవ్వుకున్నారు.

అదే సర్వే నెంబర్ లో మరో చోట ఎలాంటి అనుమతులు లేకుండా 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6,15,683 క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు తాజా విచారణలో గుర్తించారు. అనుమతి ఉన్న చోట తవ్వకుండా మరో చోట తవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా తవ్విన రెడ్ గ్రావెల్ ను అనుమతి ఉన్న ప్రదేశాల నుంచి తవ్వినట్లు నమోదు చేసినట్లు గుర్తించారు.

ఈ తప్పిదాలపై బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు తెలియచేశారు.

ఐ.ఎస్.జగన్నాథపురం తవ్వకాలు సాగించిన ప్రదేశంలో భారీగా పచ్చదనం దెబ్బ తిన్నట్లు, జీవ వైవిధ్యానికి విఘాతం వాటిల్లిన విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ అంశంపైనా అటవీ శాఖ అధికారులను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE