(నవీన్)
ఈ రోజు మీలో ఎంతమంది ఆన్లైన్లో ఒక వీడియో చూశారు? బహుశా ఒక ఫన్నీ రీల్, లేదా ఒక న్యూస్ క్లిప్? బాగుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను… ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ మాటలు ఎప్పుడూ అనలేదంటే? ఆ ముఖం, ఆ గొంతు పూర్తిగా నకిలీవి అయితే?
భయంగా ఉంది కదూ? ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. ఇది మనం జీవిస్తున్న నిజం.
మనందరికీ ఇదొక మేలుకొలుపు
జర్నలిస్టు స్వప్న, టెక్నాలజీ నిపుణుడు జానకిరాం మధ్య జరిగిన ఒక సంభాషణను యూట్యూబ్ చానల్ లో విన్నాను. అది విన్నాక నా ప్రశాంతత పోయింది. దిగులో, భయమో మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) మన ఉద్యోగాలు తీసేస్తుందని మాట్లాడలేదు. అసలు మనిషిగా మన ఉనికినే ఏఐ ఎలా మార్చేస్తుందో మాట్లాడారు. అది మనందరికీ ఒక మేలుకొలుపు.
నిజానికి ముగింపు పలికే రోజులు
మొదటి ప్రమాదం, సత్యం చచ్చిపోవడం. ‘డీప్‌ఫేక్’, ‘వాయిస్ క్లోనింగ్’ టెక్నాలజీలతో మనం చూసేది, వినేది ఏదీ నిజం కాకపోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు అనని మాటలను అన్నట్టు, ఒక సెలబ్రిటీ చేయని పనిని చేసినట్టు సృష్టించవచ్చు. ఇక సాక్ష్యాలకు విలువేముంటుంది? మన న్యాయవ్యవస్థ, మన సంబంధాలు ఏమవుతాయి? నమ్మకం అనే పునాది కూలిపోతే, సమాజం నిలబడగలదా?
మన మెదడుకు ఆటోమేషన్
రెండో ప్రమాదం ఇంకా సూక్ష్మమైనది. మన పర్యవేక్షణ లేకుండానే నిర్ణయాలు తీసుకునే ఏఐ ఏజెంట్లను మనం తయారు చేస్తున్నాం. అవి మన పనులను సులభం చేస్తాయి, నిజమే. కానీ వాటివల్ల మనం ఆలోచించడం మానేస్తున్నాం. మన నిర్ణయాలను వాటికి వదిలేస్తున్నాం. క్రమంగా మన మెదడుకు తుప్పు పడుతుంది. మన ఆలోచనా శక్తిని మనమే చంపేసుకుంటున్నాం. ఇది మనల్ని మనం కోల్పోవడం లాంటిది. లాండ్ లైన్ ఫోన్ల కాలం గుర్తుంది కదా? అప్పట్లో కనీసం ముప్పై, నలభై ఫోన్ నంబర్లు మనకు గుర్తుండేవి. మరి ఇప్పుడు? మన జ్ఞాపకశక్తిని సెల్ ఫోన్ కి ఇచ్చేశాము.
అసలు మన ఉనికికే అర్థం ఉందా?
ఇక చివరిది, అన్నింటికన్నా పెద్ద ప్రశ్న. ఏఐ కవిత్వం రాస్తే, సంగీతం సృష్టిస్తే, అద్భుతమైన చిత్రాలు గీస్తే… మరి మనకేం పని? అన్ని జీవరాశుల్లో సృజనాత్మకతే మనిషి ప్రత్యేకత. అదే లేకపోతే మన ఉనికికి ప్రయోజనం ఏంటి? ఉద్యోగం పోవడం కన్నా ప్రమాదకరమైనది జీవితంలో ఒక లక్ష్యం, ఒక ప్రయోజనం లేకుండా పోవడం. అది మానవాళి ఎదుర్కొనబోయే అతిపెద్ద సంక్షోభం.
కాబట్టి మనం ఏం చేయాలి? టెక్నాలజీని నాశనం చేయడం పరిష్కారం కాదు. దాన్ని తెలివిగా నియంత్రించాలి. ప్రతి ఒక్కరం ఏఐ గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వాలు బలమైన చట్టాలు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రతి ఏఐ వ్యవస్థలోనూ అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం మనిషి చేతిలోనే ఉండాలి.
మనిషికి ఉన్న “తెలుసుకోవాలి” అనే ఆసక్తి వల్లే మనమంతా అభివృద్ధి చెందాం. మన ఆలోచనలన్నింటికీ మెదడే మూలం.
మెదడు ఎప్పుడూ పనిచేయడం వల్లే మానవ నాగరికత ముందుకు సాగింది. ఇప్పుడు మనం టెక్నాలజీతో అలాంటి మేధస్సునే కాపీ చేస్తున్నాం. దీనినే కృత్రిమ మేధస్సు (AI) అంటున్నాం. AI చేసే అద్భుతాలు చూసి మనం ఆశ్చర్యపోతున్నాం.
కానీ ఒక ప్రమాదం ఉంది. ఫోన్ వచ్చాక మనం నంబర్లు గుర్తుపెట్టుకోవడం మానేశాం. అలాగే, AI మీద పూర్తిగా ఆధారపడితే, మన మెదడు ఆలోచించడం మర్చిపోతుంది. ఈ లక్షణం మన తర్వాతి తరాలకు కూడా రావచ్చు.
ఒకవైపు మనిషి ఆలోచించడం ఆపేస్తాడు. మరోవైపు, AIకి చెప్పిన పని చేయడం తప్ప సొంతంగా స్పందించడం రాదు. అలాంటి ప్రపంచాన్ని మనం ఊహించగలమా?
పురాణాల్లో కూడా బ్రహ్మ సృష్టి మాత్రమే నిలిచింది. విశ్వామిత్రుడి సృష్టి కాసేపు మెరిసి ఆగిపోయింది. మన సహజమైన మేధస్సు బ్రహ్మ సృష్టి లాంటిది, కృత్రిమ మేధస్సు విశ్వామిత్రుడి సృష్టి లాంటిది.
కృత్రిమ మేధ ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మానవ వినాశనానికి వాడాలా లేక మానవ వికాసానికి వాడాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తును సాఫ్ట్ వేర్ కోడ్‌తో కాదు, మన వివేకంతో, మన విచక్షణతో, మన ఇంగిత జ్ఞానంతో రాసుకుందాం.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)