– కాంగ్రెస్ కర్నాటక పాలనపై బీఆర్‌ఎస్ ప్రకటనలు
– కర్నాటకలో హామీలు అమలుకావడం లేదన్న ఆరోపణలు
– పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసినవేమీ లేవా?
– కేంద్ర ప్రశంసలు, సంక్షేమం చెప్పలేని బీఆర్‌ఎస్
– ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ విమర్శలు
– కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత గడ్డురోజులొస్తాయని హెచ్చరిక
– దానిని ఖండించలేని తెలంగాణ కాంగ్రెస్
– తెలంగాణ వచ్చాక అధికారంలోకి రాని కాంగ్రెస్
– ఉమ్మడి-తెలంగాణ బడ్జెట్ వేరని చెప్పలేని కాంగ్రెస్
– కర్నాటక బూచి చూపి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహం
– కన్నడ బూచి తెలుగునాట చెల్లుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా తన సొంత రాష్ట్రంలో సమస్యలు ఏకరవు పెడుతుంది. తాము అధికారంలోకి వస్తే వాటిని కడతేరుస్తామని హామీలిస్తుంది. అదే అధికారంలో ఉన్న పార్టీ అయితే మరో నాలుగడుగులు ముందుకేసి.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తుంది. వాటిని ఇతర రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధితో పోల్చి, తామే గొప్ప అని ప్రచారం చేసుకుంటుంది. దేశంలో ఇవి ఎక్కడయినా కనిపించే ఎన్నికల ప్రచార దృశ్యాలే.
కానీ తెలంగాణలో మాత్రం ఎన్నికల ప్రచారం అందుకు భిన్నంగా సాగుతుండటమే ఆశ్చర్యం. అధికార బీఆర్‌ఎస్ పార్టీ… పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన గురించిపై మాత్రమే, ఎక్కువ ప్రచారం చేసి, దానిపైనే దృష్టి సారించడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్ వివిధ పత్రికలలో మొదటిపేజీలో విడుదల చేస్తున్న ప్రచారం అంతా, కర్నాటక కేంద్రంగానే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కర్నాటకలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడం లేదన్నది బీఆర్‌ఎస్ ప్రకటన సారాంశం.
అంటే ప్రజలు ‘కర్నాటక కాంగ్రెస్ విజయం’పై ప్రభావితులయి ఉన్నందున, అసలు కర్నాటకలోనే ఏమీ జరగడం లేదన్న ప్రచారం, తెరపైకి తీసుకురావాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
అందులో భాగంగా కర్నాటకలో కరెంటు కూడా ఉండటం లేదని, చివరికి దీపావళి రోజు కూడా కరెంటు లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ట్వీట్లు, ప్రభుత్వ ఆఫీసులలో మొసలిని పంపి నిరసన వ్యక్తం చేస్తున్న ఫొటోలు విడుదల చేస్తోంది. అంటే.. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణ పరిస్థితి కూడా, కర్నాటక మాదిరిగానే ఉంటుందన్నది బీఆర్‌ఎస్ వ్యూహకర్తల కవిహృదయం అన్నమాట.
బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఇక ఆ పార్టీ వద్ద ఉన్న అస్ర్తాలన్నీ అయిపోయి, చివరకు కర్నాటక ఒక్కటే ఆయుధంగా మిగిలిందని అర్ధమవుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు, కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నలు, కాంగ్రెస్ వస్తే నెలకో సీఎం అవుతారన్న వ్యాఖ్యలు, కరెంటు ఉండదన్న హెచ్చరికలు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెంగళూరు నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడాలనే సెంటిమెంటు వ్యాఖ్యలు..చివరాఖరకు ప్రజలు తమను గెలిపించకపోతే, ఇంట్లో రెస్టు తీసుకుంటామన్న కేసీఆర్ వైరాగ్యపు మాటలన్నీ, పెద్దగా వర్కవుట్ కావడం లేదని చెప్పకనే చెప్పినట్లయింది.
అందుకే కొత్తగా కర్నాటక అస్త్రం బయటకు తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ఆంధ్రావారిపై చేసే వ్యాఖ్యలు మాత్రమే ఓట్లు కురిపిస్తాయి తప్ప, కన్నడవారిపై చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోరని గ్రహించకపోవడమే విచిత్రం. గత ఎన్నికల్లో చంద్రబాబు భుజంపై ఆంధ్రా సెంటిమెంట్‌తో, కాంగ్రెస్‌ను పేల్చినట్లు… ఈసారి కర్నాటక భుజంపై నుంచి కాంగ్రెస్‌ను పేల్చడం కుదరడం లేదు.
ఆంధ్రులు మాత్రమే తమను దోచుకున్నారని భావించే తెలంగాణ ప్రజలు, ఆ స్ధాయిలో కర్నాటకను చూడరు. కర్నాటకలో జరిగే వ్యవహారాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఈ సూక్ష్మం తెలియక, ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు.. కర్నాటక బూచి చూపించిన బీఆర్‌ఎస్ వ్యూహం, ఫలించే అవకాశాలు లేవన్నది విశ్లేషకుల అంచనా.
దీనితో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగి.. అటుంచి నరుక్కురావడంతో బీఆర్‌ఎస్ ప్రచారం బూమెరాంగయింది. తమ రాష్ట్రంలో తామిచ్చిన హామీలు అమలు అవుతున్నాయంటూ, కర్నాటక మంత్రి మునియప్ప హైదరాబాద్ వచ్చి మరీ ఎదురుదాడి ప్రారంభించారు. తమ హామీలు కర్నాటకలో ఏ స్థాయిలో అమలవుతున్నాయో వివరించారు.
దేశంలోనే తొలిసారి గృహలక్ష్మి పథకం తామే అమలుచేశామని మునియప్ప గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా తాము ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని, సంవృద్ధిగా కరెంటు సరఫరా అవుతోందని కర్నాటక విజయాలు ఏకరవు పెట్టడంతో బీఆర్‌ఎస్ సహజంగానే ఆత్మరక్షణ లో పడింది.
ఫలితంగా తెలంగాణ ప్రజలకు కర్నాటకను బూచిగా చూపి, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలన్న బీఆర్‌ఎస్ వ్యూహం బూమెరాంగయింది. పైగా కర్నాటకలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు రావాలని అక్కడి ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చేసిన సవాలుకు బీఆర్‌ఎస్ నుంచి జవాబు లేకపోవడం ప్రస్తావనార్హం.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తిచూపి కాంగ్రెస్‌ను, ముద్దాయిగా నిలబెట్టడంలో మాత్రం బీఆర్‌ఎస్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉండేది కాదని, మంచినీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని. ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగేవంటూ బీఆర్‌ఎస్ నాటి కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. రేవంత్‌రెడ్డి మూడు గంటలు ఇస్తే చాలంటున్నారని గుర్తు చేస్తోంది. ‘మళ్లీ ఇప్పుడు అలాంటి పాలన కావాలా? కరెంటు ఇచ్చే కేసీఆర్ పాలన కావాలా’? అన్న ప్రశ్నలతో, కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ శిబిరం నుంచి పెద్దగా ఎదురుదాడి లేకపోవడమే ఆశ్చర్యం.
కరెంటు, నీళ్లపై బీఆర్‌ఎస్ ఆరోపణలో అబద్ధం ఏమీ లేదు. అవన్నీ అక్షర సత్యాలే. కాకపోతే అది ఉమ్మడి రాష్ట్రంలోనన్న విషయం విస్మరించకూడదు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను అన్ని ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కాబట్టి అందులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదనను కొట్టివేయలేం. కానీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి పదేళ్లయింది. రాష్ట్ర బడ్జెట్‌కు ఉమ్మడి రాష్ర్టానికి మించి ఉంది.
లక్ష కోట్లతో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు, మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వచ్చాయి. కరెంటు కూడా పుష్కలంగా ఉంది. ఆదాయం గతంలో కంటే పెరిగింది. హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు తరలిస్తున్నాయి. భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాటి నిధుల కేటాయింపులు తగ్గుతాయే తప్ప, ఏదీ నిలిచిపోదు. దీనిని చెప్పడంలో కాంగ్రెస్ విఫలమయిందన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
ఇక రాష్ట్రం విడిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఈ పదేళ్లూ కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. మరి తెలంగాణలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాని కాంగ్రెస్ హయాంలో చీకట్లు ఎక్కడ? నీటి బాధలు ఎక్కడ? అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే కదా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండి… చీకట్లు కమ్మి, నీళ్లు రాకపోతే కదా కాంగ్రెస్ వైఫల్యం?
అసలు సొంత రాష్ర్టంలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాని కాంగ్రెస్‌ను, ఉమ్మడి రాష్ట్ర పాలన వైఫల్యంతో పోలిస్తే ఎలా అన్నది తెలంగాణ మేధావుల ప్రశ్న. వీటిని ప్రజలకు వివరించడంలో రేవంత్ సహా కాంగ్రెస్ అగ్రనేతలంతా విఫలమయ్యారన్నది మేధావుల మనోగతం. పోనీ కేసీఆర్ ఆరోపణల ప్రకారం అవన్నీ నిజమే అనుకున్నప్పటికీ… కేంద్రంలో మన్మోహన్‌సింగ్, ఉమ్మడి రాష్ర్టంలో వైఎస్ మంత్రివర్గాల్లో టీఆర్‌ఎస్ సంకీర్ణ భాగస్వామి అన్న విషయం విస్మరించటడమే వింతగా ఉందంటున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ హయాంలో కమ్మిన చీకట్లు, నీళ్లు రాని వైఫల్యానికి నాటి టీఆర్‌ఎస్ కూడా బాధ్యురాలే కదా అని మేధావులు గుర్తు చేస్తున్నారు. నాటి వాస్తవాలు విస్మరించి.. కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలను మేధావులు, యువకులు విశ్వసించరని స్పష్టం చేస్తున్నారు.
ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, వివిధ వర్గాలకు చేసిన మేలు, కొత్త ప్రాజెక్టులు, వాటి వల్ల ప్రజలు పొందిన ప్రయోజనం, కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రశంసలు వివరిస్తే నాలుగు ఓట్లు వస్తాయే తప్ప.. కర్నాటకపై దృష్టి పెడితే కాసుల నష్టం తప్ప, మరొకటి ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పైగా కాంగ్రెస్ పైనే ఆరోపణలు-విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఈ పదేళ్లలో ఏమీ చేయలేదన్న భావన స్థిరపడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. మరో ప్రధాన ప్రత్యర్ధి బీజేపీని విడిచిపెట్టి, కేవలం కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకునే విధానం వల్ల.. కాంగ్రెస్ బలంగా ఉందన్న సంకేతాలు బీఆర్‌ఎస్ పరోక్షంగా ఇచ్చినట్లుగానే భావించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.