Suryaa.co.in

Andhra Pradesh

డయాఫ్రమ్ వాల్ పై చర్చకు చంద్రబాబు సిద్దమా?

– పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం
– మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

రాజమహేంద్రవరం : ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు సాగునీటిని ఎపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ … అనుకున్న విధంగానే జూన్‌ 1 న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశామని మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నీటి విడుదలతో నారుమళ్లు వేసుకోవడానికి రైతులకు వీలుగా ఉంటుందని చెప్పారు.

పోలవరం డయా ఫ్రం వాల్‌పై మంత్రి అంబటి రాంబాబు పలు అంశాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని కోరారు. దీనిపై చర్చకు రావాలని టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమలకు ఆయన సవాల్‌ విసిరారు. ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో డయాఫ్రం వాల్‌పై చర్చ జరగాలని కోరారు.

కాఫర్‌ డ్యాంను పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ కట్టడం వల్లే వరదలకు దెబ్బతిందని మంత్రి తెలిపారు. కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ను కట్టడం చారిత్రక తప్పిదం అని చెప్పారు. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా ? కొత్తది నిర్మించాలా ? అన్న అంశంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే పూర్తవుతుందన్నారు. మొదటి దశ పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తికి గడువు లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతోపాటు హోం మినిస్టర్‌ తానేటి వనిత, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవిలత, జెడ్‌పి.చైర్మన్‌ వి.వేణుగోపాల్‌, రాజమండ్రి, ఎంపి ఎం.భారత్‌, రుడా చైర్మన్‌, షర్మిలారెడ్డి, నిడదవోలు ఎంఎల్‌ఎ శ్రీనివాసనాయుడు, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, తదితరులున్నారు.

LEAVE A RESPONSE