-బీసీలపై బాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలి
-ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లకు బేరాలు పెట్టిన చరిత్ర టీడీపీది
-సామాజిక విప్లవంవైపు సీఎం వైయస్ జగన్ అడుగులు
-బీసీలు తల ఎత్తుకొని జీవించేలా వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ పాలన
-చంద్రబాబుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సవాల్
తాడేపల్లి: బలహీనవర్గాల ప్రజలు తల ఎత్తుకొని జీవించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం వైయస్ జగన్ నిరూపించారన్నారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ బద్దలుకొట్టారన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సీఎం వైయస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. సామాజిక విప్లవంవైపు సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాలను చంద్రబాబు బేరానికి పెట్టారని, రాజ్యసభ స్థానాలను సైతం చంద్రబాబు సూట్‌కేసుల కోసం అమ్ముకున్నాడని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో బలహీనవర్గాలవారు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు చంద్రబాబు సిద్ధమా..? అని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలన్నారు. సీఎం వైయస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతోందన్నారు. డీబీటీ ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా అందజేశామన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందన్నారు. సీఎం వైయస్ జగన్ బీసీలను తల ఎత్తుకునేలా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు విషయం కక్కుతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.