– జనసేనకు దన్నుగా ఉంటానని చెప్పని చిరంజీవి
– పవన్‌కు మద్దతునిస్తానని ఎప్పుడూ చెప్పలేదన్న వ్యాఖ్య
– తమ్ముడు పవన్ ఎదగాలన్న సందేశంతో సరి
– అభిమానులకు అర్ధం కాని అన్నియ్య సందేశం
– అంతుబట్టని అన్నియ్య అంతరంగం
-చిరు వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధంగా మారాయా?
– జనసేనకు దన్నుగా ఉంటానని చెబితే బాగుండేది కదా?
– అన్నయ్యే నమ్మని తమ్ముడిని జనం ఎందుకు నమ్మాలన్న వైసీపీ ప్రశ్నలకు జవాబిచ్చేదెలా?
– జనసైనికుల తాజా జంజాటం
( మార్తి సుబ్రహ్మణ్యం)
నువ్వు ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అని రంగస్థలంలో రాంచరణ్ లెక్క అడిగితే.. ఏదో ఒక వైపు ఉంటానని చెబుతారు. నువ్వు తమ్ముడివయినా నీతో ఉండనని బరాబర్ చెప్పడం ఒక పద్ధతి. లేదా ఎంతమంది వచ్చినా నా తమ్ముడి వెంట ఉంటానని చెప్పడం మరో పద్ధతి. లేదా నేను ఎటు వైపూ ఉండను అని తేల్చి చెప్పడం ఇంకో పద్ధతి. అంతేగానీ.. ‘‘ఆ గట్టునున్న తమ్ముడు గెలవాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం తమ్ముడి వైపు ఉంటానని మీకు చెప్పలేదు కదా’’? అని వాదిస్తే, సదరు స్థితప్రజ్ఞులను ఏమనాలి? ఆయన తెలివిని ఎలా అంచనా వేయాలి? తెలివిపరుడనా? అతి లౌక్యుడని అంచనా వేయాలా? అంటే తాను త మ్ముడితో కలసి నడుస్తానని చెప్పినట్లా? లేక ఇద్దరు దారులు వేరని చెప్పినట్లా? ఇంతకూ అన్నియ్య ఏం సెలవిచ్చారు? మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతు విషయంలో, జాతినుద్దేశించి చేసిన ప్రసంగం అచ్చం ఇలాంటి గందరగోళంగానే ఉంది మరి.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మీడియా ముందుకొచ్చి చేసిన ప్రసంగం పరిశీలిస్తే.. తమ్ముడి గ్లామర్‌ను వాడుకుంటున్నట్లుగానే ఉంది తప్ప.. తాను తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఎవరేమనముకున్నా మద్దతునిచ్చి తీరతానన్నట్లు, ఏ కోణంలోనూ కనిపించలేదన్నది కల్యాణ్‌బాబు అభిమానుల ఆవేదన. జగనన్న అంతటి
బలవంతుడితో నిర్భయంగా తలపడుతున్న తమ్ముడు పవన్ కల్యాణ్‌కు, తాను మద్దతునిస్తానని.. రేపటి ఎన్నికల్లో జనసేన కోసం తానూ ఒక సమిధగా మారతానని చిరంజీవి అన్నియ్య విస్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పకపోవడాన్ని పవన్ ఫ్యాన్సుకు తెగ ఫీలయిపోతున్నారు. ఓవైపు జనసైనికులు, మహిళలు పవన్ కోసం ముందుకు వస్తుంటే.. స్వయంగా అన్నయ్య చిరంజీవి మాత్రం, తాను ఎన్ని కష్టాలు-సమస్యలు వచ్చినా తమ్ముడి వెంటే నడుస్తానని చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకూ చిరంజీవి అన్నియ్య ఏం చెప్పారంటే.. ‘‘తమ్ముడు పవన్‌కు మద్దతునిస్తానని ఏనాడూ గట్టిగా చెప్పలేదు. భవిష్యత్తులో మద్దతునిస్తానో లేదో తెలియదు. నా తమ్ముడి నిజాయితీ, నిబద్ధత గురించి నాకు
తెలుసు. ఎక్కడా కూడా వాటిని వదల్లేదు. నిజాయితీగల నాయకులు మనకు కావాలి. అలాంటి వారు రావాలని నా ఆశ. నా సపోర్టు తమ్ముడికి ఉంటుంది. నేను తప్పుకుని సైలెంట్ అయిపోతేనే పవన్ బెస్ట్ నాయకుడవుతాడని అని ఉంటానేమో. నా మద్దతు నా తమ్ముడికి నేను స్ట్రాంగ్‌గా నేనెక్కడా మాట్లాడలేదు. వాడు ఏ పక్షాన ఉంటాడు? ఎలా ఉంటాడనేది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు’
– ఇదీ అన్నియ్య, తమ్ముడు పవన్‌కు మద్దతు గురించి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు.
చిరంజీవి ప్రెస్‌మీట్ వీడియోను పదిసార్లు పరిశీలించినా.. ఎక్కడా తాను జనసేనకు మద్దతునిస్తున్నట్లు చెవులు రిక్కిరించి విన్నా, లీలగా కూడా వినిపించకపోవడమే ఆశ్చర్యం. తమ్ముడు అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నారే తప్ప.. రాజకీయాల్లో పోరాడుతున్న జనసేన అధిపతి అయిన తమ్ముడికి, తన మద్దతు ఉంటుందని మాట వరసకయినా చెప్పకపోవడం, కల్యాణ్‌బాబు అభిమానుల మనసు గాయపరిచినట్టయింది.
సొంత అన్నయ్యే తమ్ముడి పార్టీకి మద్దతు ప్రకటి ంచకపోతే, ఇక ఎలాంటి సంబంధం లేని జనం ఎందుకు మద్దతు ప్రకటించాలన్న కొత్త ఆలోచనకు, చిరంజీవి వ్యాఖ్యలు దోహదం చేశాయి. రేపు వైసీపీ నేతలు కూడా పవన్‌పై ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తే, ఏవిధంగా ఎదురుదాడి చేయాలన్న కొత్త పితలాటకం జనసైనికుల్లో మొదలయింది. చిరంజీవి మద్దతునివ్వకపోయినా ఫర్వాలేదు గానీ.. తమ్ముడికి మద్దతునిస్తున్నట్లు తానెప్పుడూ బలంగా చెప్పలేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో, పవన్ ఇమేజీ దారుణంగా డామేజీ అయిందన్నది జనసైనికుల మనోవేదన. చిరంజీవి వ్యాఖ్యలు ఒకరకంగా, వైసీపీ నేతలకు ఆయుధం అందించినట్లయింద న్నది జనసైనికుల ఆగ్రహం.
ఇప్పటికే సీఎం జగన్‌తో జనసేనాధిపతి యుద్ధం చేస్తుంటే, చిరంజీవి మాత్రం రెండుసార్లు సతీ సమేతంగా జగన్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన వైనం, తమకు ఇబ్బందికరంగా మారిందని జనసైనికులు
తలపట్టుకుంటున్నారు. పవన్ వల్లే చిరంజీవికి చెడ్డపేరు వస్తుందని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించినా .. దానిని చిరంజీవి ఖండించకపోవడం తమను కుమిలిపోయాలా చేసిందన్నది జనసైనికుల అంతర్మథనం.
తాజాగా చిరంజీవి.. జనసేనకు తాను మద్దతునిస్తున్నానని చెబితే, ఏపీలో జనసేన ఇమేజ్ మరోలా ఉండేదంటున్నారు. పవన్ భీమ్లానాయక్ సినిమాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వని జగన్ సర్కారు.. చిరంజీవి కొడుకు రాం చరణ్ నటించిన ఆర్ఆర్ఎస్ సినిమాకు, రేట్లు పెంచుకునేందుకు.. అదే పవనన్న వ్యతిరేకించే జగనన్న వద్దకు వెళ్లిన చిరంజీవి యవ్వారం, పవన్ అభిమానులకు రుచించలేదు.
బహుశా జగనన్నతో చిరంజీవికి ఉన్న అనేక రకాల మొహమాటాల వల్లే, ఆయన తమ్ముడి పార్టీకి మద్దతునిస్తున్నట్లు ప్రకటించలేకపోతున్నారన్నది, జనసైనికుల విశ్లేషణ. భవిష్యత్తులో చిరంజీవి కొత్త సినిమాలు, వాటితో పాటు కొడుకు రాంచరణ్ సినిమాలు కూడా ఉన్నందున.. టికెట్ల రేట్లు-అదనపు షోలకు సంబంధించిన మొహమాటాలే, తమ్ముడికి మద్దతు ప్రకటించలేకపోయాయన్నది పవన్ అభిమానుల మరో విశ్లేషణ. అదే సమయంలో తన గాడ్‌ఫాదర్ సినిమా హిట్ కోసం, పవన్ ఫ్యాన్స్‌పై చిరంజీవి వేసిన వలగానే రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. నిజమెంతో పైవాడికెరుక?!
ఇక పవన్‌కు మద్దతుపై, ఓ సినిమా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన చిరంజీవిని.. పాపం ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని సినిమా జర్నలిస్టులు, ఆయనను వ్యూహాత్మకంగా ‘గాడ్‌ఫాదర్’ వైపు మళ్లించినట్లు కనిపించింది. సహజంగా సినిమా జర్నలిస్టుల యవ్వారం అంతే ఉంటుంది. దాదాపు ప్రతి సినిమా జర్నలిస్టు ఒక సినిమా పీఆర్ఓగా పనిచేస్తుంటారు కాబట్టి, పెద్ద హీరోలను ఇబ్బంది పెట్టేందుకు సాహసించరు. సహజంగా ప్రెస్మీట్లలో ఎక్కడా చప్పట్లు వినిపించవు. కానీ సినిమా ప్రెస్మీట్లలో జర్నలిస్టుల నుంచి చప్పట్లు వినిపిస్తాయి. తాజా చిరంజీవి ప్రెస్మీట్లో అది రిపీటయింది. కాబట్టి తమ్ముడి గురించి అన్నయ్య చెప్పిన ఆ మాటలే, మనకు ఆణిముత్యాల కింద లెక్కన్నమాట!