Suryaa.co.in

Entertainment

పౌరాణికానికి ప్రామాణికం!

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు..

వ్యాసుడు భారతానికి
ప్రసాదిస్తే అక్షరరూపం…
కమలాకరుడు ఇచ్చాడు
అక్షరాలా దృశ్యరూపం..
కళ్లకు కట్టినట్టు కథ..
కళ్ళ ముందు సజీవంగా తిరుగాడే పాత్రలు..
పదమూడేళ్ళ అరణ్యవాసం
అయింది మూడు గంటల
పాండవవనవాసం..
ఏడాది అజ్ఞాతం
రక్తికట్టింది నర్తనశాల గా..
కామేశ్వరుడి ప్రతిభ సాక్షిగా..!

పాండవుల కథ..
శ్రీకృష్ణుడి చరిత..
యధాతథంగా తీసి చరితార్ధుడైన
కమలాకర కామేశ్వర రావు..
అయ్యాడు పౌరాణిక బ్రహ్మ
జూదఘట్టం చూస్తే చాలు
తెలియదా ఆయన ప్రతిభ..
ఆయన సినిమాలతోనే వెలిగిపోయె
ఎన్టీవోడి ప్రభ..!
నటయశస్వి ఎస్వీఆర్
సుయోధనుడై..
అన్న నందమూరి భీముడిగా..
మహానటి సావిత్రి పాంచాలి..
గుమ్మడి ధర్మరాజై..
బాలయ్య అర్జనుడిగా..
లింగమూర్తి శకుని మామ..
మిక్కిలినేని దుశ్శాసనుడు..
ప్రభాకరరెడ్డి కర్ణుడు..
నాగయ్య విదురుడు..
ఇందరు మహానటుల కూడలి
కురుసమ్రాట్టు నిండు పేరోలగం
మొత్తం భారతానికే కీలకఘట్టం
మాయాజూదం..
ఇప్పుడు కదా
ఆట రక్తి కట్టింది
ధర్మజునితో జూదమంటే
ఆట ఆఖరు వరకు గెలుపోటములు తేలవంటూ
రెచ్చగొట్టే మామ..
ధర్మ విజితనా..
అధర్మ విజితనా
ద్రౌపది ప్రశ్నకు బదులేది..
పరాకాష్టగా ఊరువుపై ఆసీనురాలివి కమ్మని
దుర్యోధనుడి పిలుపు..
రెచ్చిపోయిన వృకోదరుడి అరుపు..తొడ చరుపు…
ధిక్..బానిసలు అంటూ ఎస్వీఆర్ బలుపు…
ఆ సన్నివేశాలన్నీ
ఓ మైమరపు
కమలాకరుడి
దర్శకత్వ మెరుపు..!
అదే సినిమాలో ద్వైతవనంలో
హేమమాలిని
తొలివిరుపు..!!

చారిత్రకంలోనూ
అదే టాలెంటు..
తిమ్మరుసు పేటెంటు..
గుమ్మడి శిఖరాగ్ర నటన..
రాయలుగా ఎన్టీఆర్
అందమైన రూపం..
కామేశ్వరరావు
దర్శక విశ్వరూపం..
మొత్తంగా అపురూపం!
సాంఘికాల్లో నభూతో
నభవిష్యతి గుండమ్మకథ..
అదీ కమలాకరుడి సృష్టే..
ఇంతవరకు మరొకరు సాహసించని ప్రతిసృష్టి..
విజయా బ్యానరుకే పుష్టి..
కలెక్షన్ల కుంభవృష్టి..!

తెలుగు సినిమాకు
మూల విరాట్టు..
ప్రతిభకు ఆటపట్టయిన
సమ్రాట్టు..
సాంఘికం తీస్తే సాధికారం
పౌరాణికం మాత్రం
ఆయన ప్రతిభకు ప్రామాణికం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE