ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాల క్రితం రాజుకున్న అగ్గి..
మూడు రాజధానులు..
ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి ఈ మాట వెలువడిందో ఉత్తర క్షణం నుంచి నిరసనలు..
ఉద్యమాలు..భిన్నస్వరాలు..పగలు.సెగలు..తలోమాట.. చెరో రాయి..!
వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు మన కొత్త రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రతిపాదించిన రోజులలో.. ఇదే జగన్ సహా ఇంచుమించు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వాడుకోవడానికి పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు, అతి తక్కువ వ్యవధిలోనే అమరావతికి పురుడు పోసి రాజధానిని తరలించారు. అలాగే హైకోర్టును కూడా రాష్ట్రానికి తీసుకువవచ్చారు. ఇది గతం..!
ప్రజలు మార్పు కోరుకున్నారు.అఖండ మెజారిటీతో జగన్ కు విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ చాలా సాధిస్తారని ఆశించి గెలిపించిన ప్రజలకు గడిచిన కొద్ది నెలలుగా ఒనగూరిన ప్రయోజనాలపై స్పష్టత లేకపోగా అయోమయం ఎక్కువైపోయింది..
ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా ఒక రకమైన సందేశా ,సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడంతో తన వైఖరిని బయటపెట్టిన జగన్ ఆనాటి నుంచి ఒకవైపు జనహిత కార్యక్రమాలంటూ కొన్ని పథకాలను ప్రకటిస్తూనే..మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ అవకతవకలేనని ఎత్తిచూపే ప్రయత్నంలోనే ఎక్కువగా తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం..
ప్రజావేదిక కూల్చివేత ప్రజాహిత నిర్ణయంగా గాక , చంద్రబాబుపై కక్షసాధింపు కోసమే చేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది..చంద్రబాబు ఆ భవనాన్ని తమ అవసరాల కోసం అడిగినంతనే కూల్చివేత నిర్ణయం తీసుకుని యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేయడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారు.. చంద్రబాబుపై కోపంతో ప్రజాధనాన్ని లెక్క చేయలేదన్న విమర్శ, స్వపక్షం నుంచి సైతం కూడా వినిపించకపోలేదు.
అమరావతిలోగాని.. ఇంకెక్కడైనా గాని ఇలాంటి అక్రమ భవనాలపై ఇంత త్వరగా చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నతో పాటు, ఇందుకోసం కృత్రిమ వరదలను కూడా సృష్టించారనే విమర్శలూ వెల్లువెత్తాయి..ఇదే గాక పోలవరం విషయంలో కూడా జగన్ సర్కార్ అవసరమైన వేగంతో పనిచేయడం లేదన్న మాటలు కూడా జోరుగానే వినిపించడం మొదలైంది..ధరలను అదుపు చేయకపోగా కొన్ని వరాలను పరిమితికి మించి ప్రకటిస్తూ ఆర్థిక భారాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా నెట్టేస్తూ ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనే డిమాండ్ మొదలయ్యే వరకు పరిస్థితులను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్…ఇలాంటి సమయంలో జనం దృష్టిని మరల్చవలసిన అవసరం వచ్చినప్పుడల్లా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి మరింత గందరగోళ.. అయోమయ.. కల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నారు.రాజధాని మార్పు విషయంలో తెలుగుదేశం ప్రాయోజిత ఆందోళనే అనుకున్నా అది వెయ్యి రోజులకు పైగా సాగి ఈ రోజున తన ప్రభుత్వానికే సవాలుగా పరిణమిస్తుందని జగన్ సైతం ఊహించి ఉండరు..మెజార్టీ బలంతో నెట్టుకొచ్చేయ వచ్చుననుకున్నారో..లేదా తెలుగుదేశం పార్టీ చచ్చిన పామే కదా ఏం చేయగలుగుతుందిలే అని ధీమా పడ్డారో..
ఇప్పుడిది ప్రజలకు.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారంగా గాక ఇద్దరు వ్యక్తులకు.. రెండు పార్టీలకు మధ్యన జరుగుతున్న పోరాటంగా..అంతకు మించి రెండు కులాల నడుమ రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారిపోయింది..!
చంద్రబాబు కులస్తులు అమరావతిలో..చుట్టుపక్కల భూములు తక్కువ ధరకు కొనేసి ఆనక రాజధానిని ప్రకటించారని వైసిపి నాయకులు ప్రచారం చేస్తుంటే..జగన్ కు..ఆయన పార్టీ నేతలకు విశాఖ పరిసర ప్రాంతాలలో కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి గనక..వాటి ధరలను మరింతగా పెంచుకుని లాభపడేందుకు పథకాలు రచిస్తున్నారని తెలుగుదేశం నాయకులు కోడై కూస్తున్నారు..మధ్యలో సందట్లో సడేమియాలు ఉత్తరాంధ్ర..రాయలసీమ అభివృద్ధి మాత్రం అవసరం లేదా అంటూ తెలిసీ తెలియని సన్నాయినొక్కులు ప్రారంభించారు..!
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా ప్రభుత్వం కొత్త అడుగులు వేయడం ప్రారంభించింది.ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని అంటే ఒక అద్భుతమని..అభివృద్ధికి హేతువనే ఒక ప్రచారాన్ని తీసుకువెళ్ళే ఒక పెద్ద వ్యూహాన్ని రచించి సాక్షాత్తు మంత్రులను రంగంలోకి దించింది.కొన్ని చోట్ల ప్రభుత్వ ప్రాయోజిత సదస్సులు జోరుగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో భవనాలను కూలుస్తూ అభివృద్ధి కోసం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది.
నిజానికి రాజధాని అనేది అభివృద్ధికి గుర్తు కానే కాదు. అది సామాన్యుడికి సంబంధించిన అంశం కానే కాదు కూడా. మనలో ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పనిమీద రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లి ఉంటాము చెప్పండి. అలాగే గత మూడున్నర సంవత్సరాలలో అమరావతికైనా వెళ్లామా.. రాష్ట్ర సచివాలయం కంటే ఇంకా చెప్పాలంటే హైకోర్టు పనిమీదే రాజధానికి వెళ్లాల్సిన పని పడుతుంది.
కాని..ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో.. తెలుగుదేశమైనా కానీ..అధికార వైసీపీ కానీ.. రాజధాని సామాన్య ప్రజల అవసరాల కోసమేనని..అందుకే అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెబుతూ, ఎవరికి వారు తమ అస్మ దీయుల ద్వారా తదనుకూల ప్రచారం చేసుకుంటూ మొత్తానికి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి.నిజానికి రాజధాని అంటే సామాన్య ప్రజల జీవితం కొంత కష్టానికి గురయ్యే పరిస్థితి.ఇళ్ళ అద్దెలు..ధరలు పెరుగుతాయి.. అంతే గాని సామాన్య..మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఒనగూరే ప్రయోజనాలు ఉండవు.. బాగా భూములు ఉన్న వారికే ఇబ్బడి ఇబ్బడి ప్రయోజనాలు..లాభాలు.. వారే ఈ ఉద్యమాలకు ప్రాయోజకులు..!
అసలు రాష్ట్రంలో ఏ ప్రాంతం మనది కాదు చెప్పండి..హైదరాబాద్ విపరీతంగా అభివృద్ది చెందుతున్నప్పుడు ఇలాంటి పోకడలు కనిపించలేదు.. వినిపించలేదు..
మన రాజధాని ఆసియాకే తలమానికంగా ఎదుగుతుందని చంకలు గుద్దుకున్నాం..కాంగ్రెస్ గాని..తెలుగుదేశం గాని..చంద్రబాబు గాని.. వైఎస్ గాని హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇస్తూ..విశాఖను.. రాజమండ్రి..విజయవాడ.. కర్నూలు..నెల్లూరు.. చివరికి తిరుపతిని సైతం చిన్నచూపు చూసిన రోజుల్లో జనం గాని..పార్టీలు గానీ నోళ్ళు మెదపలేదే.. మరిప్పుడెందుకు ఈ ప్రాంతీయ వైషమ్యాలు?
ముందే చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు..రెండు పార్టీలు..రెండు కులాల మధ్య పోరులో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఈ రోజున రెండు వర్గాలుగా చీలిపోయే దుస్థితి దాపురించింది…ఇప్పుడు రాజధాని వ్యవహారం చంద్రబాబు..జగన్ వ్యక్తిగత ప్రతిష్ట..తెలుగుదేశం.. వైసీపీ ఆధిపత్య పోరుకు వేదికగా మారిపోయింది..మొన్నటి ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకుని వచ్చే పంచాయితి.. మున్సిపల్ ఎన్నికల నాటికి తమ పార్టీ పుంజుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి రాజధాని వివాదాన్ని వాడుకునేందుకు, చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు వెనకడుగు వేస్తే చంద్రబాబుకు పైచేయి ఇచ్చినట్టు అవుతుందని భావించే జగన్, మూడు రాజధానుల వైపే తుది అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నారు…ఇది నిస్సందేహం..ఇక మిగిలింది ప్రజాధనం అదనపు వ్యయం..!
ఈ దశలో రాష్ట్ర ప్రజలు చేయవలసిన ముఖ్యమైన ఆలోచన సాధ్యాసాధ్యాలు..నిధులు ఎక్కడి నుంచి వస్తాయి..అసలు అంతకంటే ముందు ప్రాంతీయ వైషమ్యాలు పెరగకుండా విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది..ఇప్పటికే ఉత్తరాంధ్రను..రాయలసీమను వేరే రాష్ట్రాలుగా విభజించాలనే మాట అక్కడక్కడా మొదలయింది..ఇలాంటి వేర్పాటువాద ఆలోచనలతో అలాంటి మాటలు డిమాండ్లుగా మారి మరిన్ని అవాంఛనీయ పోకడలకు దారితీసే ప్రమాదం ఉంది.. అమరావతి..విజయవాడ..గుంటూరు అభివృద్ధి చెందితే సరిపోతుందా..ఉత్తరాంధ్ర..ముఖ్యంగా విశాఖ అభివృద్ధి మాటేమిటి వంటి కొన్ని ప్రస్తావనలతో అనవసర వివాదాలకు తెరతీస్తున్నాయి కొన్ని శక్తులు..అభివృద్ది చెందాలంటే తప్పనిసరిగా రాజధానిగా ఉండాలా.. బొంబాయిని మించి పూనే..చెన్నైకి ధీటుగా కోయంబత్తూరు.త్రివేండ్రంతో సమానంగా కొచ్చి ఎదగలేదా?
హైదరాబాద్ కు తక్కువ కాకుండా విశాఖ..విజయవాడ.. తిరుపతి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అభివృద్ధి దిశగా పరుగులు తీయలేదా. నిజానికి విశాఖ రాజధాని అయితే ఇక్కడి ప్రజల కంటే ఇప్పటికే పెద్దపెద్ద ఆస్తులు..భూములు ఉన్న బడాబాబులకే ఎక్కువ ప్రయోజనమని..ఆ బడాబాబులు కూడా ఎవరన్నది కొద్దిపాటి బుర్రతో ఆలోచిస్తే ఇట్టే తట్టే విషయమే..
ఇది ఆవేశ కావేశాలకు..వ్యక్తిగత వైషమ్యాలకు అతీతంగా ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం..కొన్ని శక్తుల ఆధిపత్య పోరుకు ప్రజలు..ప్రజాధనం.. రాష్ట్ర అభివృద్ధి సమిధలుగా..ఫణంగా నిలిచే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు..ఆలోచించండి..!
– ఈఎస్కే
జర్నలిస్ట్