– విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు ?
– ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్… రాజకీయ కమిషన్ల వ్యవహరిస్తోంది
– రాష్ట్రంలో విద్యా వికాసానికి కేసీఆర్ హయాంలో పునాది
– కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1900కు పైగా పాఠశాలల మూసివేత
– ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మంజూరులో వివక్ష తగదు
– 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేస్తే ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ ప్రాతిధ్యం – వహించే నియోజకవర్గానికి కేటాయించడం దారుణం
– కెసిఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పెరిగాయి తప్ప ఒకటి కూడా మూసివేయలేదు
– కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలి
– శాసనమండలిలో విద్యారంగంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్ : విద్యారంగంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. విద్యారంగంపై కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు ఎందుకని నిలదీశారు.
అత్యధికంగా పేద ప్రజల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగుపరచాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యా వికాసానికి కెసిఆర్ గారు పునాది వేశారని, వందలాది గురుకులాలను, ప్రభుత్వ పాఠశాలలను కొత్తగా తెరిచి లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని తెలిపారు.
బుధవారం శాసనమండలిలో విద్యారంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా తాము గురుకుల విద్యార్థులను తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వల్లకాటికి పంపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు సహా ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు సాధించారని గుర్తు చేశారు.
ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీకి తాము వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో 84 మంది బిడ్డలను కాటికి పంపిందన్నారు. పేదతల్లి తన పిల్లలను చదివించుకునేందుకు ఎలా తపన పడుతుందో అలాంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కేసీఆర్ గారు పరితపించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యపై ఖర్చు చేసే విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 200 గురుకులాలు ఉంటే తమ ప్రభుత్వం వాటిని వెయ్యికి పెంచిందన్నారు. ఇప్పుడు ఆ గురుకులాలు ఎలా దెబ్బతిన్నాయో అందరికీ తెలుసన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ రాజకీయ కమిషన్ లా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును తప్పు బట్టే విధంగా విద్యా కమిషన్ ఎలా వ్యాఖ్యానిస్తుందని.. గత తొమ్మిదిన్నరేళ్లలో విద్యా వ్యవస్థ నాశనమైందని కమిషన్ ఎలా చెబుతోందని నిలదీశారు. తెలంగాణ బిడ్డల చదువుకు మంచి బాటలు వేయాలని కమిషన్ అనుకుంటే గత 60 సంవత్సరాల చరిత్రను ప్రస్తావించాలన్నారు. నిజాం హయాంలో తెలంగాణలో అక్షరాస్యత కేవలం నాలుగు శాతమేనని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో విద్యా వికాసానికి అప్పటి ప్రభుత్వాలు చేసిందేమి లేదన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే విద్యావ్యవస్థను మెరుగు పరిచేందుకు బలమైన పునాదులు వేశారన్నారు. వ్యవస్థలో లోపాలుంటే విద్యా కమిషన్ ఎత్తి చూపాలి కానీ ఇలా పొలిటికల్ కమిషన్ లా వ్యాఖ్యలు చేయడం ఏమిటని నిలదీశారు. కమిషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ సిఫార్సులను ఎంతమాత్రం పరిగణలోకి తీసుకోలేదని బడ్జెట్ ప్రతిపాదనలతో తేలిపోయిందన్నారు. రాష్ట్రంలోని 632 మండలాల్లో రూ.31 వేల కోట్లతో పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసిందని, మొదటి ఏడాదిలో వంద మండలాల్లో రూ.5 వేల కోట్లతో ఈ స్కూళ్లు నిర్మించాలని సిఫార్సు చేస్తే ప్రభుత్వం బడ్జెట్ లో రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
దీంతోనే కమిషన్ సిఫార్సుల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో తేటతెల్లమవుతుందన్నారు. ప్రభుత్వానికి విద్యావ్యవస్థను మెరుగు పరచాలన్న చిత్తశుద్ధి లేనప్పుడు కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసిందో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను మూసేసిందని తప్పుడు ప్రచారం చేశారని.. కానీ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 1,913 స్కూళ్లను మూసేశారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని ప్రచారం చేసే వారి కళ్లు తెరిపించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా సమాధానం ఇచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పడేటప్పడికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, 2023-24 నాటికి వాటి సంఖ్య 30,022కు పెరిగిందని.. ప్రైవేటు పాఠశాలల సంఖ్య 15,069 నుంచి 12,126కు తగ్గిందని అలాంటప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఎక్కడ మూసివేసిందో చెప్పాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లను కేసీఆర్ ప్రోత్సహించారని, అందుకే గవర్నమెంట్ స్కూళ్లలో ఎన్ రోల్మెంట్ పెరిగిందన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫీజు చెల్లించే విధానాన్ని కేసీఆర్ రద్దు చేయడంతోనే అదనపు అడ్మిషన్లు పెరిగాయని, ఉన్నత విద్య అడ్మిషన్లలోనూ దేశ సగటుతో పోల్చితే తెలంగాణను కేసీఆర్ గారు నంబర్ వన్ గా నిలబెట్టారని వివరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీసి కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా విద్యా కమిషన్ నివేదిక ఉందని ఆక్షేపించారు. ప్రైవేటు స్కూళ్లు, బడ్జెట్ స్కూళ్ల గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదని.. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడే ప్రమాదముందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను పేద విద్యార్థుల చదువు కొనసాగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. అవి కాకుండా తొమ్మిదిన్నరేళ్లలో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.24 వేల కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్ లను రెట్టింపు చేశామన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా విదేశాల్లో చదివే విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్ లు అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా బకాయి పెట్టిందన్నారు.
రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే ఈ ప్రభుత్వానికి పేద పిల్లల బకాయిలు చెల్లించేందుకు ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు. డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు కేసీఆర్ గారు దోస్త్ అనే వ్యవస్థను తీసుకువచ్చారని.. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు దోస్త్ లో చేరితే హైదరాబాద్ లో ఉన్న బడా కాలేజీలు కోర్టుకు వెళ్లి ఫీజు పెంపునకు మినహాయింపులు తెచ్చుకున్నాయని గుర్తు చేశారు.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న1,050 టీచింగ్ పోస్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫై చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా వాటి భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి నిధులివ్వలేమని చేతులెత్తేస్తే కేసీఆర్ మొత్తం ఖర్చు భరించి మోడల్ స్కూళ్లను కొనసాగించారని గుర్తు చేశారు. లక్ష కోట్లకు పైగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం నిధులను రాష్ట్రాలు ఖర్చు చేయలేదని కేంద్రం చెప్తోందని.. అందులో తెలంగాణ విద్యారంగానికి కేటాయించిన నిధులెన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండా వెనక్కి పోయిన నిధులెన్నో ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ను గెలిపిస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం టీచర్ పోస్టులే భర్తీ చేయలేదని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. డీఎస్సీ 2017 ద్వారా 8,792 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, గురుకులాల్లో 3 వేల పోస్టులకు పైగా భర్తీ చేశామన్నారు. డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు 1,500లకు పైగా భర్తీ చేశామన్నారు. 2023లో 5 వేల పోస్టులతో తాము డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసి ఇంకో 6 వేల పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ 15 నెలల పాలనలో విద్యారంగానికి చేసింది శూన్యం అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గురుకులాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారని.. ఆ వ్యాఖ్యల అర్థమేంటో అప్పుడు బోధ పడలేదు కానీ గురుకులాలను దెబ్బతీసి కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నారనే విషయం తర్వాత తెలిసివచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తే అందులో ఒక్క ఆసిఫాబాద్ మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేస్తారా? మిగతా తెలంగాణతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం లేదా అని నిలదీశారు.