-ఆత్మహత్యలను నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబాలకు న్యాయం చేయడం కూడా తప్పైందా?
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీద , అబ్దుల్ అజీజ్, మాలెపాటి…
నెల్లూరు: దుగ్గిరాల కరుణాకర్ మరణం అత్యంత బాధాకరం, కరుణాకర్ ను తిరిగి తీసుకురాలేము..కానీ వారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడుతాం.వైసీపీ నేతల వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరుణాకర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు మద్దతు గా నిలుస్తున్నాయి.కరుణాకర్ ఆత్మహత్య ఒక ఘోర సంఘటన, తన మరణానికి కారణమేమిటో స్పష్టంగా లేఖ రాసి విధిలేని పరిస్థితుల్లో కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నేషనల్ ఎస్సీ కమిషన్ ను కలిసి న్యాయం చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , బొల్లినేని రామారావు కోరడంతో కరుణాకర్ కుటుంబానికి నేడు న్యాయం జరుగుతోంది.ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని ఒకటిన్నర నెల కు పైగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన పోరాటం ఫలితంగా 3 ఎకరాల భూమి, 18 అం.స్థలం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదువేల పెన్షన్, పిల్లలకు ఉన్నత చదువు దక్కాయి.
ఉదయగిరి నారాయణ, కరుణాకర్ లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. వారి ఆత్మహత్యలకు కారణం టిడిపి, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య గొడవలు కాదు. వైఎస్ఆర్సిపి నేతలకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తల కుటుంబాలకు మధ్య జరిగిన గొడవలు.టిడిపి శవ రాజకీయాలు చేస్తోందని వైసిపి విమర్శిస్తోంది. టిడిపి చేసిన తప్పు ఏంటి? నేషనల్ ఎస్సీ కమిషన్ ను కలిసి కరుణాకర్ కుటుంబానికి న్యాయం కోరడమే టిడిపి చేసిన తప్పా ? కరుణాకర్ కుటుంబానికి మాలేపాటి సుబ్బానాయుడు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు అడుగడుగునా అండగా నిలిచారు.
కరుణాకర్ కుటుంబానికి చేపలు పట్టుకునేందుకు అనుమతులు ఇప్పుడు ఇచ్చామని కలెక్టర్ చెప్తున్నారు, అంటే గతంలో వాళ్ళు చేపలు పట్టుకోలేని దుస్థితి ఎవరి వల్ల ఏర్పడింది ? ఆత్మహత్యలకు పాల్పడితే తప్ప చేపలను పట్టుకోనివ్వరా ?
సీఐ ఖాజావలి ప్రైవేట్ పంచాయతీలు, దందాలలో తలమునకలై ఉన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే తీరిక ఆయనకు లేదు. టిడిపి నేతలను పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇబ్బందులు పెట్టే డిఎస్పి శ్రీనివాసరావు కరుణాకర్ విషయంలో ఎందుకు స్పందించలేదు?
వైసీపీ నేతల వేధింపులతో బలహీనవర్గాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రశ్నించకూడదా? ప్రతిపక్షంగా అండగా నిలవకూడదా? ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోవద్దా ? ఆర్డిఓ శీను నాయక్ “ఖల్ నాయక్” పాత్ర పోషిస్తున్నారు. అడ్డగోలు పనులకు ముందుండే ఆర్డిఓ శీను నాయక్ కరుణాకర్ కుటుంబం కు మంచి ఇంటి స్థలం ఇచ్చే విషయంలో కనీసం మానవత్వం చూపలేకపోతున్నారు.
బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ నేతలు పోరాడుతున్నారు. కరుణాకర్ కుటుంబానికి న్యాయం చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం.