Suryaa.co.in

Andhra Pradesh

దేశంలో ఎక్కడైనా ఇంతలా విద్యుత్ సర్ చార్జీలు వసూలు చేస్తున్నారా?

ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి సామాన్యుడిపై 35 నుంచి 40% విద్యుత్ చార్జీల భారం
అక్రమంగా నిర్బంధించాలని చూసిన పోలీసు అధికారులపై ఐపిసి 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేయండి
మంత్రి చెప్పిన దశావతారాలలో ముఖ్యమంత్రి పేరు లేకపోవడం ఆశ్చర్యకరం
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఖాయం… అయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రెండు వారాల ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం
విశాఖపట్నం పై నిజంగా ప్రేమే ఉంటే నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గా పోటీ చేయాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రజలపై రాష్ట్రంలో విద్యుత్ సర్చార్జీలను విధిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . జగనన్న చేదోడు పథకంలో భాగంగా 325 కోట్ల రూపాయలను ప్రజలకిస్తే, విద్యుత్ వాతల రూపంలో అదే ప్రజలకు 7200 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెండర్ పెట్టారు.. జగనన్న చేదోడు పథకం కూడా కేంద్ర ప్రభుత్వ పథకమేనని ఆయన తెలిపారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 7 నుంచి 8 పథకాలకు ఖర్చు చేస్తున్న డబ్బులకు మించి, సామాన్యుల నుంచి విద్యుత్ చార్జీల రూపంలో లాగేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలపై యూనిట్ కు 1.25 రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపగా, ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు.

ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల సకాలంలో బొగ్గును కొనుగోలు చేయకుండా, దిగుమతి దారుల వద్ద అధిక మొత్తాన్ని చెల్లించి బొగ్గును కొనుగోలు చేశారు. బొగ్గు కొనుగోలు లో బహుశా ప్రభుత్వ పెద్దలు కన్నాలు వేసి ఉంటారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న పి పి ఏ లను గౌరవించకుండా, బొగ్గు లేదన్న కారణంగా కొన్ని విద్యుత్ ప్లాంట్లను మూసివేసి అమ్మకానికి పెట్టాలని చూశారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను కూడా ఆదానీ కంపెనీకి విక్రయించాలని చూశారు.

ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చిన పాపానికి సామాన్యులపై 35 నుంచి 40 శాతం విద్యుత్ భారాన్ని అదనంగా మోపుతున్నారు. విద్యుత్ చార్జీలు ఇంత పెద్ద ఎత్తున పెంచితే, సామాన్యుడు ఎలా బ్రతక గలరు… పరిశ్రమలు ఎలా బ్రతికి బట్ట కడతాయని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇలా విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ ప్రభుత్వ పెద్దలు కన్నాలు వేస్తుంటే, వారు వేసిన కన్నాలకు సామాన్యులను బాధ్యులను చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సర్చార్జీలను వసూలు చేస్తున్నారని ఈనాడు దినపత్రికలో వార్తా కథనాలను రాస్తున్నందుకు ఆ సంస్థ యజమాని రామోజీరావును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆయనపై లేనిపోని కేసులను నమోదు చేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం చేతిలో ప్రజలు ఎంతగా దోపిడీకి గురవుతున్నారో గ్రహించాలన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చేది గోరంత అయితే దోచుకునేది కొండంత. దోచుకున్న దాంట్లో ఎన్నికలలో ఓట్ల కొనుగోలు కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులను ప్రజలు బహుమతిగా స్వీకరించాలి , అంతేకానీ నోట్లు తీసుకుని ఓట్లు వేయరాదని… అది చట్టరీత్యా నేరం అవుతుందని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఈసారి ఎన్నికల్లో అన్యాయంగా జైల్లో ఉన్న నిజాయితీపరులకు ఓటు వేయాలని కోరారు.

ఆరు నెలల పాటు అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు విని కేసులు పెడితే బ్రతుకు పులివెందుల బస్టాండ్ అవుతుందని పోలీసులు గ్రహించాలి
ఆరు నెలల పాటు అధికారంలో ఉండే ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు అక్రమ కేసులను బనాయించే పోలీసుల బ్రతుకు పులివెందుల బస్టాండ్ అవుతుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల బూట్లు నాకే కొంతమంది పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న వ్యక్తి, సామాన్యులను నిర్బంధించాలని చూస్తే సదరు అధికారిపై ఐపిసి 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేయాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

రామోజీరావు స్థానంలో నేను ఉండి ఉంటే, యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి విభాగం డిఎస్పి పై కచ్చితంగా ఐపీసీ 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేసి ఉండేవాడిని. ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదు. అయినా ఆరు నెలల తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు, ఈ ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకొని బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

తమపై నమోదు చేసిన కేసు ను క్వాష్ చేయాలని రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 8 వారాలపాటు తదుపరి చర్యలేమి తీసుకోవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. ఆరు వారాల్లోగా ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారో చెప్పాలన్నారు.

మార్గదర్శి నుంచి డివిడెంట్ రూపంలో పెద్ద అమౌంట్ చెక్ తీసుకొని ప్రజెంట్ చేసుకున్న వారు , చిన్న అమౌంట్ చెక్ తీసుకొని ప్రజెంట్ చేయకుండా ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గురించి మిల్లెట్ రెడ్డి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది. మార్గదర్శిలో ఐదువేల రూపాయలు పెట్టుబడి పెట్టిన జి జే రెడ్డి అనే వ్యక్తి దేశద్రోహి.

దేశ రహస్యాలను రష్యాకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయి, విదేశాలకు పారిపోయిన వ్యక్తి. ఇప్పటికే తమ షేర్ల గురించి చోటు చేసుకున్న వివాదంపై యూరి రెడ్డి రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. అక్కడ ఆయన ఫిర్యాదు పెండింగ్లో ఉంది. అయినా యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. హైదరాబాదులో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, అక్కడే దొంగతనం జరిగితే ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు చేస్తారా అంటూ ఏపీ సిఐడి తరఫున వాదనలు వినిపించిన శివ కల్పనా రెడ్డిని ప్రశ్నించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

గుడ్డ కాల్చి మీద వేస్తే… తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలట
గుడ్డ కాల్చి మీద వేసేది మిల్లెట్ రెడ్డి వంతైతే, తాను ఏ తప్పు చేయలేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలట. పార్టీని ఒక దుష్ట మహిళ నుంచి కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాన్ని వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్నారు. సొంత బాబాయిని హత్య చేశారని సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంత దారుణాన్ని చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు పై అవాకులు, చవాకులు పేలుతున్నారని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసు నమోదు చేసిన అధికారులపై ఐపీసీ 220 సెక్షన్ కింద ఫిర్యాదు చేస్తాం. అవినీతి నిరోధక చట్టంలోని 17 A కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారుడైన మిల్లెట్ రెడ్డి చెబుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసులన్నింటిలో తాను నిర్దోషిని ఆయనే నిరూపించుకోవాలి. సిబిఐ కోర్టు విచారణకు హాజరు కాకుండా ఆయన ఆర్డర్ తెచ్చుకున్నారు.

నాలుగేళ్లుగా తాను ఈ పిటిషన్ దాఖలు చేశానని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 2800 సార్లు న్యాయస్థానాన్ని వాయిదాలు కోరారు.. 77 సార్లు వాయిదా అడిగిన వ్యక్తిని 78వ సారి వాయిదా అడిగితే బెయిల్ రద్దు చేసి జైలులో వేయమని న్యాయస్థానం ఆదేశించింది. 2800 సార్లు వాయిదా అడిగిన వ్యక్తి గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. సజ్జల ఇచ్చిన సలహా ప్రకారం ముఖ్యమంత్రి బిజీగా ఉంటారని ఆయన బెయిల్ రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించమని సజ్జల రామకృష్ణారెడ్డి సూచిస్తున్నారా?

మిల్లెట్ రెడ్డి చెబితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఆయన మాట ప్రకారమే పార్టీతో పాటు, ముఖ్యమంత్రి కూడా నడుచుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్… ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరొకరు అంటే బాగుండదు. ఈరోజు నుంచి నేను కోర్టు విచారణకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి చెబితే బాగుంటుంది. కోడి కత్తి శ్రీనుకు బెయిల్ ఎందుకు మంజూరు చేయడం లేదో అర్థం కావడం లేదు.

మరో 8 వారాలపాటు ఎన్ ఐ ఏ విచారణకు నో అన్నారు. ఈ కేసును ఎన్నికల వరకు సాగదీసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కోడి కత్తి దిగింది లేదు.. సాస్ పూసుకొని రక్తం వచ్చినట్లుగా డ్రామా ఆడారు. కోడి కత్తి శ్రీను బయటకు వచ్చిన ఏ సాక్షులను ప్రభావితం చేయగలరు. నిజా నిజాలు బయటకు వస్తాయనే ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని మా పార్టీలో అందరూ దేవుడని అనుకుంటుంటే మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రకటించిన దశావతారాలలో ఆయన స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యాన్ని కల్పించింది.

ఓ పదిమంది మంత్రుల పేర్లు చెప్పి వారు దశావతారాల దేవుళ్ళుగా పేర్కొన్న ఆయన, బహుశా జగన్మోహన్ రెడ్డి ని జీసస్ క్రైస్ట్ గా భావించి ఉంటారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. దశావతారాలలో మంత్రి రోజాకు కూడా స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తక్షణమే మంత్రి వేణుగోపాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. దేవుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండాలంటూ ఆయన అపహాస్యం చేశారు.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఖాయం
ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ లభించడం ఖాయమని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు వైద్య నివేదికలను అందజేయడంలో జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని జైల్లో ఖైదీగా ఉన్న బాబాయి కి రెండు నెలల బెయిల్ లభించగా, చంద్రబాబు నాయుడు కి స్టాచ్యూరిటీగా లభించే మూలాఖాత్ లను కూడా జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉంది. తోటి ఖైదీలు ఇబ్బంది పడకూడదని, చంద్రబాబు నాయుడు కున్న సౌకర్యాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు రెండు వారాల ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ కేసులో ఎప్పుడు తీర్పు వెలువడినా అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ప్రకారం చంద్రబాబు నాయుడుకు సానుకూలంగానే తీర్పు వెలువడుతుంది. ఋషికొండకు గుండు కొట్టి పర్యాటక భవనాల పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాస సముదాయాన్ని నిర్మించారు.. ప్రత్యేక జీవో విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ పై నిర్మించిన అక్రమ భవనంలో కాపురం పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఋషికొండపై గతంలో ఉన్న కాటేజ్ లను కూల్చివేసి, వాటి స్థానంలో నూతన నిర్మాణాలను చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించగా, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ భవనాల పేరిట అక్రమ నిర్మాణాలను చేపట్టింది. ఇదే విషయాన్ని శివరామ ప్రసాద్ అనే పర్యావరణవేత్త 290 పేజీల పిటిషన్ తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తే తాము కూడా సుప్రీం కోర్టులో ఇంప్లిడ్ అవుతాము. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మా లాయర్ ఉమేష్ చంద్ర, ప్రధాన న్యాయమూర్తి ని కలిసి తీర్పును త్వరగా వెలువరించాలని అభ్యర్థించారు.. ప్రధాన న్యాయమూర్తి కూడా పరిశీలిస్తామని చెప్పడం శుభ సూచకమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

విశాఖలోని నాలుగు స్థానాలలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయండి
జగన్మోహన్ రెడ్డికి నిజంగా విశాఖపట్నం పై అంత ప్రేమే ఉంటే నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలని రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పై పోటీకి తాను సిద్ధమేనని ప్రకటించిన ఆయన, విశాఖ నగరంలో పోటీ చేయడానికి కూటమి నేతలను టికెట్ అభ్యర్థించాల్సి ఉంటుందన్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరం లోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదు. ఆయనపై పోటీ చేసేందుకు నేను కూడా కూటమి నాయకులను టికెట్ అడగాల్సిన అవసరం వస్తుందనుకోవడం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE