ఊహించనిరీతిలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ విపత్తు రాబోయే తమిళనాడు శాసనసభా ఎన్నికల సమరానికి విపక్షం విసిరిన కత్తి. విపక్షం అంటే విపక్షమే, ఎన్నికలను ఎదుర్కొనటానికి ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాల దారి వేరు. ఇప్పటి రాజకీయం వేరు. తమిళనాడులో రాజకీయపక్షాల మధ్య ఎన్ని గొడవలు వున్నప్పటికీ, వారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టరు. ఫిరాయింపులు వుండవు అనే చెప్పొచ్చు.
కేంద్రం నుండి తమకు రావలసిన వాటికోసం ప్రభుత్వపక్ష పార్లమెంటు సభ్యులే కొట్లాడాలనే నిబంధన వారికి ఉండదు, ఏపార్టీకి చెందిన సభ్యుడైనా తమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తారు. తమిళనాడులో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఆసుపత్రిలో చేరి నెలల తరబడి వున్నా ఆమె అలా ఆసుపత్రిలో ఉండటానికి కారణం ఏఐఏడిఎంకె అంతర్గత రాజకీయమే కారణమని డీఎంకే వాళ్లు మాట్లాడలేదు. ఆమెను చూడటానికి నరమానవుడికి అవకాశం ఇవ్వకపోయినా, దాని చుట్టూ దేశంలో చాలామంది చాలారకాల ఊహాగానాల కథలు వండి వార్చారే కానీ, అప్పటి విపక్షం నోరు మెదపలేదు.
వేరే రాష్ట్రంలో అయితే జయలలిత అనారోగ్యం, శశికళ జైలు జీవితం నేపథ్యంలో ఏఐఏడీఎంకే ని ముక్కలు చేసి అధికారాన్ని విపక్షం చేజిక్కించుకొనేది. అభివృద్ధిని అభివృద్ధిగానూ, రాజకీయాన్ని రాజకీయంగానూ చూస్తారు కాబట్టి, వారు దేశంలో ఎవరితో పెద్దగా ఆత్మీయమైన సంబంధాలు కూడా నెరపరు. కానీ ఇప్పుడు తమిళనాడులో దశాబ్దాలుగా స్థిరపడిన రాజకీయ వాతావరణానికి చెదలు పట్టినట్టు కనిపిస్తున్నది.
తిరుప్పరన్ కుంద్రం సుబ్రమణ్యేశ్వర ఆలయానికి చెందిన ఒక ఆచారమైన కార్తిగదీపం వెలిగించవలసిన ప్రదేశం గురించి చెలరేగిన వివాదం.
స్థలవివాదం 1915 లోనే మొదలయింది. ఇప్పటి భారత దేశానికి సుప్రీంకోర్టు ఎలానో, అప్పటి బ్రిటిష్ ఇండియాలో అలాంటి ప్రివికౌన్సిల్ వరకు వెళ్ళింది. ఒకే కొండను ఆధారం చేసుకుని దేవాలయం, దర్గా వుండగా, దర్గాకు చెందిన హక్కుదారులు కట్టడం మొదలు పెట్టినప్పుడు అప్పటికి కొండపై ఉన్న హిందూ దేవాలయాన్ని నిర్వహిస్తున్న మధుర మీనాక్షి దేవాలయ బోర్డు కోర్టును ఆశ్రయించి కట్టడాన్ని నిలుపుదల చేసింది.
1837 నాటి పత్రాల ప్రకారం దర్గా ఉన్న ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతమంతా హిందూ దేవాలయానికి చెందినదే అంటూ వాదించింది.
మర్పించబడిన పత్రాల ఆధారంగా దర్గా, దర్గా మార్గం మినహాయించి మిగిలిన కొండ మొత్తం సుబ్రమణ్యేశ్వర దేవస్థానం వారిదే అని ప్రీవికౌన్సిల్ నిర్ధారించింది. యధాతధస్తితి కొనసాగించమని ఆదేశించింది. అప్పటినుండి సజావుగా సాగిపోతున్న సమయంలో రెండు మూడు సంవత్సరాలనుండి, దేవాలయానికి సంబంధించిన పూజలు, ప్రదర్శనలు అంటూ కొత్త కొత్త విషయాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు కొందరు. గతంలో ఒకసారి హైకోర్టుకు వచ్చినప్పుడు ఆనాటి జడ్జి, ప్రదర్శన దారికి సంబంధించి కొన్ని రాజీ ప్రతిపాదనలు చేశారు. కానీ ఇరుపార్టీలు ఒప్పుకోలేదు.
కొత్తగా దీపం ఎక్కడ వెలిగించాలి అనే విషయంపై ఒక రిజిస్టర్డ్ హిందూ సంఘం మరలా హైకోర్టుని ఆశ్రయించింది. దేవాలయంలో వెలిగించవలసిన కార్తీకదీపాన్ని దర్గాకు సమీపంలో ఉన్న దీపాదూన్, ఒక రాతికట్టడం పైన చేయటానికి అనుమతిని కోరింది. ఆ కట్టడం దర్గాకు సమీపంలో ఉండటం, దశాబ్దాలుగా లేని ఆచారాన్ని ఇప్పుడు చేసినందువలన ఉద్రిక్తతలు పెరుగుతాయి అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు.
కానీ జస్టిస్ స్వామినాథన్ ఆలయ ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించి, దీపధూన్ పైనే జ్యోతిని వెలిగించటానికి అనుమతిస్తూ ఆర్డర్ ఇచ్చారు.
డిసెంబర్ ఒకటి నాడు ఆర్డర్ ఇచ్చారు. మూడవ తేదీ నాడు ప్రతిసంవత్సరం జరిగినట్లుగానే ఆలయ ప్రాంగణంలోని పిల్లయ్యర్ మండపంలోనే జ్యోతిని వెలిగించారు. హిందూ సంఘం తరఫున కోర్టులో పోరాడుతున్న రవికుమార్ కొండపైకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, జరిగిన ఘర్షణల నేపథ్యంలో సెక్షన్ 144 ను విధించారు. కోర్టు తీర్పును ధిక్కరించారు అంటూ సదరు రవికుమార్ జస్టిస్ స్వామినాథన్ కు విన్నవించగానే, స్వయంగా రవికుమార్ నే పదిమంది వ్యక్తులను తోడుగా తీసుకొని వెళ్లి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణలో దీపం వెలిగించమని ఆదేశించారు.
హిందూ సంఘాలు అక్కడకు వెళ్ళటం, గలాటా జరగటం, కొంతమంది గాయపడటం జరిగింది. ఈలోపుగా కలెక్టర్, దేవాదాయశాఖవారు కోర్టు ధిక్కరణ విచారణను ఆపు చేయవలసిందిగా డివిజన్ బెంచ్ కు చేసిన అప్పీల్ ను బెంచ్ త్రోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం స్వామినాథన్ ఇచ్చిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. కోర్టుధిక్కారం కేసులో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని స్వామినాథన్ బెంచ్ కోర్టుకు హాజరు కమ్మని ఆదేశించింది. అదే సమయంలో దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని దీపధూన్ లోనే దీపం వెలిగించవలసిందిగా ఆదేశించారు.
అది చిలికి చిలికి గాలివానగా మారింది. సోమవారం కోర్టుధిక్కరణ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కాపీ రాగానే మంగళవారం జస్టిస్ స్వామినాథన్ పైన అభిశంసన తీర్మానానికి అనుమతి కోరుతూ 107 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతో లోక్ సభ స్పీకర్ కు ఫార్మాట్ ను సమర్పించింది డీఎంకే ప్రభుత్వం. అభిశంసన జరగటం అసాధ్యమని పెట్టిన వారితో సహా అందరికీ తెలుసు. జడ్జిమెంట్ల ఆధారంగా జడ్జిలను అభిశంసించటం, ఆఖరుకు అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన అవకపోతే, దేశంలో న్యాయస్థానాలకు గౌరవం అనేది మిగలదు.
ఎవరికి ఏ జడ్జిమెంటు నచ్చకపోతే వారు జడ్జిమెంటు ఇచ్చిన జడ్జిని, అవకాశముంటే అభిశంసన ద్వారా సాగనంపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే న్యాయవ్యవస్థల పనితీరును చట్టసభలు శాసిస్తున్నాయి అనేది ప్రజల భావన. ఇలాంటి సాంప్రదాయం, ప్రజలకు న్యాయవ్యవస్థ పైన ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని పోగొడుతుంది. అప్పుడిక ప్రజాస్వామ్యం పూర్తిగా మంటకలసి పోతుంది. మరో విషయం, జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన జడ్జిమెంటును కామెంట్ చేసే అధికారం ఎవరికీ లేదు.
కానీ పిటిషనర్ రవికుమార్ అనే వ్యక్తికి స్వయంగా వెళ్లి వారు కోరిన దగ్గర జ్యోతి వెలిగించమని ప్రోత్సహించటం, మాత్రం అంతులేని ఆశ్చర్యం కలిగించటమే కాదు భయంకూడా కలిగిస్తున్నది. కోర్టుఆర్డర్ ను ధిక్కరించిన వారిని శిక్షించవచ్చు. కానీ పిటిషనర్ కోరిక సహేతుకమైనదని బెంచ్ కు అనిపించినా, ఒక సున్నితమైన అంశంలో ఒకవర్గాన్ని ప్రోత్సహించటం మాత్రం సబబు కాదు అనిపిస్తున్నది. అలా ఆదేశించడం సమంజసం అని సుప్రీంకోర్టు భావిస్తుందని అనుకోలేము.
అదే జరిగితే భారతదేశానికి భవిష్యత్తే ఉండదు. స్వామినాథన్ పైన పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోవచ్చు. కానీ పెట్టవలసి వచ్చిన విషయాన్ని గుర్తించి, న్యాయవ్యవస్థ తనను తాను లోతుగా ప్రశ్నించుకుంటుంది అని ఆశించుదాము. ఈకేసులో సాంకేతిక విషయాలు ప్రక్కన పెడితే, వివాదం గురించి 1916 నాటి పత్రికలు ప్రచురించిన విషయాన్నే 2025 లో కూడా ప్రచురించవలసి రావటం దురదృష్టకరం. 1916 లో హిందూ పత్రిక కరెస్పాండెంట్ తన మధుర నోట్స్ లో మార్చ్ 9 నాడు “ఏ హిందూ మొహమ్మదీన్ డిస్ప్యూట్” అని ప్రచురించారు. 110 సంవత్సరాల తరువాత అదే పరిస్థితి ఉండటం బాధాకరం.!
– ఇంద్రాణి.