పుత్తడి బొమ్మ సినిమాలో నోటికొచ్చినట్లు కవితలు చెబుతూ వేధిస్తున్నాడు అని చెప్పి సుత్తి వీరభద్రరావు కి సన్మానం చేసి ఒక ఏనుగుని బహుకరిస్తారు ఊరి జనం. దాంతో దానిని మేపడానికి తన ఆస్తులు అమ్ముకుంటాడు వీరభద్రరావు. ఇప్పుడు అమెరికా చేసింది అదే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో! ఎలాగంటారా.. చదవండి మీకే అర్ధమవుతుంది.
జాగ్రత్త భారతీయులారా.. 85 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలని అమెరికా తాలిబన్లకి అప్పచెప్పింది! ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశం ప్రపంచంలోనే 4వ అతి పెద్ద సైనిక శక్తి. ఇలా చెత్త ప్రచారాలతో సోషల్ మీడియా లో కావచ్చు. లేదా ఎలెక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ప్రచారం జరుగుతున్నది. సంబరాలు చేసుకుంటున్న వారికి లెక్క లేదు. ఫేస్బుక్ లో పోస్టుల మీద పోస్టులు. మరీ ముఖ్యంగా తాలిబన్లు భారత్ ని ఏదో చేయబోతున్నారు అంటూ ఒకటే తాటాకు చప్పుళ్ళు.
ప్రపంచ సైనిక శక్తి లో దేశాల వరుస ఇలా ఉంది: 1. అమెరికా 2. రష్యా 3. చైనా 4. భారత దేశం. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ 4వ స్థానంలో ఉంది ఎలా అంటున్నారు బుర్ర తక్కువ వెధవలు? బుర్ర తక్కువ వెధవలకి తెలియాల్సింది చాలా ఉంది. అసలు ఏ లెక్క ప్రకారం 85 బిలియన్ డాలర్లు అంటున్నారు? అవి కొత్తవి కొనాలంటే కూడా అంత ఖరీదు చెయ్యవు. అలాంటిది పాత వాటిని కొత్తవాటితో ఎలా లెక్క కడతారు? అసలు 10ఏళ్లు దాటితే ఏ వాహనం ధర అయినా 40% కి మించదు. అలాంటిది మిలటరీ వాహనాల ధరలు ఎలా లెక్కిస్తారు? ఎలెక్ట్రానిక్ మీడియాలో అతి పెద్ద మీడియా హౌస్ లు కూడా కల్పిత కధనాలని వండి వారుస్తున్నాయి నిజాన్ని దాచిపెట్టి. అసలు నిజం ఏమిటో ఒకసారి నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం.
హామ్వీ వాహనాలు 22,174. ఇవి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లోకి అమెరికా తెచ్చిన వాహనాల సంఖ్య. అదీ 2001 నుండి 2017 వరకు. వీటిలో కొత్తవి వెనక్కి తీసుకెళ్ళిపోయింది సైన్యం. మిగిలినవి దాదాపుగా 3,000 వదిలేసి వెళ్లారు. ఇవన్నీ కూడా 15 ఏళ్ల పాతవి. ఎందుకు వదిలేసింది? తిరిగి తీసుకెళ్తే రవాణా ఖర్చులు రంధ్రం తప్పితే ఉపయోగం లేదు. వీటిని తీసుకెళ్ళి మళ్ళీ స్పేర్ పార్ట్స్ వేసి వాడే బదులు కొత్తవి వస్తాయి ఆ ధరకి. అందుకే వదిలేసింది వీటిని అక్కడే. ఇక వీటిని వాడాలంటే స్పేర్ పార్ట్స్ కావాలి. అలాగే అతి వేడి, దుమ్ము ఎక్కువగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ లో వీటికి తరుచూ సర్వీసింగ్ చేస్తూ ఉండాలి. లేకపోతే పని చెయ్యవు. తాలిబాన్ల దగ్గర ఇలాంటి సౌకర్యం లేదు. ఇప్పటి వరకు అమెరికన్ మిలటరీ వీటి నిర్వహణ కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్ లని పెట్టుకొని, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాడుకుంటూ వచ్చింది. అలాంటి సర్వీసింగ్ తాలిబాన్ ఇవ్వలేదు. కాబట్టి మరో 6 నెలలు మాత్రమే అవి పనిచేస్తాయి. ఇక మిలటరీ గ్రేడ్ లూబ్రికెంట్స్ వాడాలి అవి వాళ్ళకి దొరకవు.
ఆర్మర్డ్ వెహికల్స్ M117 లు 634. ఇవి కూడా పాత పడిపోయినవే. వీటిని నడపాలంటే బరువు ఎక్కువ కాబట్టి, ప్రతి 5 లీటర్ల డీజిల్ కి 12km మైలేజీ వస్తుంది. వీటి బరువు వలన తిరిగి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేసి స్పేర్ పార్ట్స్ మార్చాలి అంటే, దాని బదులు దీనికన్నా లేటెస్ట్ వర్షన్ కొత్తది కొనవచ్చు. కాబట్టి వీటిని కూడా వదిలేసింది అమెరికా. వీటిలో చాలా వాహనాలు అప్పటికే సర్వీసింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. మహా అయితే ఇంకో ఆరు నెలలు వీటిని నడపగలరు.
మాక్స్ ప్రొ మైన్ ప్రూఫ్ వెహికిల్స్ 155. వీటిలో చాలా వరకు ధ్వంసం అయిపోయినవే. ఇవి కూడా బరువు ఎక్కువ. ఎందుకంటే మందు పాతరలు పేలినా తట్టుకునే విధంగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు తాలిబన్లు అధికారంలో ఉన్నారు కాబట్టి మందు పాతరలు పేల్చేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి ఇవి వృధా. ఆర్మర్డ్ పర్సనల్ కారియర్స్[APC] M113 లు వదిలేసినవి 169. ఇవి పురాతన కాలం నాటివి. వీటిని వాడి రెండేళ్ళు అవుతున్నది వీటికి సర్వీసింగ్ చేయక. ఇవి తుక్కు కింద లెక్క.
ట్రక్కులు, పిక్ అప్ వాన్ లు 42,000. వీటిలో కొత్తవి వెనక్కి తీసుకెళ్లింది. మిగిలినవి 2500 ఉన్నాయి. వీటి ఇంజీన్లు పని చేయకుండా చేసి మరీ వెళ్లిపోయారు. వీటిలో టొయోటా వాహనాలు ఉంటే మాత్రం అవి పనికివస్తాయి. ఎందుకంటే ఊగ్రవాదుల అభిమాన వెహికిల్ టొయోటా. వీటికి నిర్వహణ కొట్టిన పిండి తాలిబన్లకి. కానీ ఈ విషయం తెలిసే చాలా వరకు FORD వాహనాలు కొన్నది అమెరికా. సింహభాగం FORD వాహనాలే ఉన్నాయి. అవి కూడా బగ్రాం ఎయిర్ బేస్ నుండి కాబూల్ వరకు వెళ్ళడానికి మాత్రమే వాడుకున్నారు అమెరికన్లు. వీటి వయసు 10 ఏళ్లు. అమెరికా లెక్క ప్రకారం ఇవి తుక్కు అన్నమాట కానీ వీటిని వాడుకునే వెసులుబాటు ఉంది.
మెషీన్ గన్లు 64,000 దాకా ఉన్నాయి. వీటిలో చాలా భాగం పనికిరానివి. కానీ ఒక 5వేల మెషీన్ గన్లు మాత్రం కొత్తవి. వీటికి కావాల్సిన బులెట్స్ ఇతర విడిభాగాలు పాకిస్థాన్ లో దొరుకుతాయి కాబట్టి, వీటి వల్ల తాలిబాన్ల శక్తి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే వీటిలో చాలా భాగం ఇప్పటికే పాకిస్థాన్ తరలించినట్లు తెలుస్తున్నది. వీటిని భారత్ సరిహద్దుల్లో తీవ్రవాదులకి ఇచ్చి చొరబాట్లు చేయిస్తుంది పాకిస్తాన్. ఒకవేళ దొరికినా అవి అమెరికన్ ఆయుధాలు కాబట్టి, మాకేం సంబంధం లేవు అని అనేయవచ్చు పాకిస్థాన్. ప్రస్తుతం భారత సైన్యానికి సవాల్ ఉంది అంటే ఈ అమెరికన్ మెషీన్ గన్స్ వల్లనే.
ఇక వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ 1,50,000 దాకా వదిలేసింది అమెరికా. వీటిలో పనికి వచ్చేవి దాదాపుగా ఒక లక్ష వరకు ఉంటాయని అంచనా. అయితే ఇవి వాడి పారేసేవి రిపేర్ చేయడానికి పనికిరావు. కానీ వీటి వల్ల ప్రమాదం ఉంది భారత్ కి. ఇవి కనుక తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే ..వీటి సహాయంతో సరిహద్దులు దాటడానికి, పాకిస్థాన్ వైపు నుండి సూచనలు ఇవ్వడానికి పనికివస్తాయి. ఎటూ ఉచితంగా వచ్చినవే కాబట్టి, వీటిని తీవ్రవాదులకి ఇచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం.
3,50,00 అసాల్ట్ రైఫిల్స్[M-16,M -4] తాలిబాన్ల అధీనంలో ఉన్నాయి. వీటిని కూడా చాలా వరకు పాకిస్థాన్ తరలించినట్లు తెలుస్తున్నది. అయితే వీటి మెయింటనెన్స్ మాత్రం కొంచెం కష్టం. AK-47 ల లాగా ఇవి ఎలా పడితే అలా వాడడానికి కుదరదు. పైగా అమెరికన్ స్టాండర్డ్ ప్రకారం, బులెట్స్ తయారుచేయడం అంత సులభంగా ఉండదు కానీ పాకిస్థాన్ వీటిని తయారుచేయగలదు. వీటిలో ఆఫ్ఘన్ సైనికులు, పోలీసుల దగ్గర ఉన్నవి కాక, చాలా భాగం తాలిబన్ల అధీనంలో ఉన్నాయి. అఫ్కోర్స్ ..ఇవి కూడా ప్రమాదకరమే. తీవ్రవాదులకి వీటిని ఇచ్చి సరిహద్దులు దాటిస్తుంది పాకిస్థాన్.
నైట్ విజన్ గాగుల్స్/డివైజెస్రా. రాత్రి పూట చూడడానికి ఉపయోగించే పరికరం. రైఫిల్ మీద పెట్టె స్కోప్ లు 16,000 దాకా వదిలేసింది. పైన పేర్కొన్న అన్నిటికంటే ఇవి చాలా ప్రమాదకరం అవుతాయి మనకి. వైర్లెస్ సెట్ తో పాటు M-16 అసాల్ట్ రైఫిల్ తో ఇవి జత కలిస్తే మాత్రం చాలా చాలా ప్రమాదకరం అవుతుంది మన సైన్యానికి. నిజానికి ఈ కాంబినేషన్ మన సైనికుల దగ్గర కూడా ఉంటుంది. అలాంటప్పుడు శత్రువు దగ్గర కూడా ఉంటే అది ఇంకా ప్రమాదం. ఈ కాంబినేషన్ గురుంచి ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతున్నది సైనిక వర్గాలలో. అయితే వీటికి కావలసిన బాటరీలు మాత్రం ఎక్కడా దొరకవు. అవి ప్రతీ 6 నెలలకి ఒక సారి మార్చాల్సి ఉంటుంది. కొన్ని మోడల్స్ లో అయితే బాటరీలు మార్చడానికి వీలు లేదు పడేయాల్సిందే. ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్ ఫోన్ లలో బాటరీలు మార్చే వీలు ఉండదు. అవి అయిపోగానే పడేస్తున్నాం కదా అలాగే ఇవి కూడా. ఆర్టిలరీ గన్స్ 176 దాకా ఉన్నాయి కానీ వీటిని మోసుకెళ్లడం కష్టమయిన పని. అలాగే వీటి నిర్వహణకు కావాల్సిన షెల్ల్స్ దొరకవు కాబట్టి వీటి వల్ల మనకి ప్రమాదం లేదు.
ఇక డొనాల్డ్ ట్రంఫ్ తాలిబన్లతో మొదటి సారి దోహా లో చర్చలు[2019] జరిగినప్పుడే సైన్యానికి పరోక్షంగా సంకేతాలు వెళ్ళాయి మనం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోబోతున్నాము అంటూ. పైగా ట్రంఫ్ ఒక్క డాలర్ కూడా అదనంగా ఖర్చుచేయవద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. దాంతో మిలటరీ ఎక్విప్మెంట్ నిర్వహణ ని తగ్గిస్తూ వచ్చింది అమెరికన్ సైన్యం. అప్పటికే స్పేర్ పార్ట్స్ మార్చాల్సినవి ఏమైనా ఉంటే వాటిని అలానే వదిలేశారు. 2020 మార్చి నెల నుండి ఒక్కో కాంట్రాక్టర్ తన ఎక్విప్మెంట్ తో వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. జూన్ నెల మొదట్లోనే కాంట్రాక్టర్ లు అందరూ తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోయారు. జూన్ నుండి ఇప్పటివరకు వేటికీ నిర్వహణ లేదు. అలాగే అంతకుముందు 5 నెలల నుండి నిర్వహణ ఆపేశారు. కాంట్రాక్టర్స్ కి చెల్లింపులు మార్చి నెల వరకే జరిగాయి అంటే అర్ధం చేసుకోవచ్చు నిర్వహణ లేకుండా ఎన్ని వాహనాలు, ఆయుధాలు అలా పడి ఉన్నాయో.
పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికన్ సైన్యాధికారి ఒకరు.. చాలా విలువయిన వాటిని వదిలేయడానికి కారణం ఉంది. అది మేము ప్రస్తుతం అన్నీ ఆయుధాలని అప్ గ్రేడ్ చేస్తున్నాము కాబట్టి, వాడిన వాటితో మాకు పనిలేదు. వాటిలో చాలావరకు పనిచేయనివి ఉంటే పని చేసే వాటిని మేము పనికిరాకుండా డిజేబుల్ చేసి వచ్చాము అని తెలిపారు. 2021 ఆగస్ట్ నెల 14 నుండి కొంతమంది సైనికులు, కేవలం అత్యవసరమయిన స్పేర్ పార్ట్స్ ని పీకేసి , వాటిని అక్కడే ధ్వంసం చేసే పనిని మొదలుపెట్టాము. అది ఆగస్ట్ 25 నాటికి పూర్తయి పోయింది కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు అని అన్నాడు. అవి నడవాలి అంటే మేము స్పేర్ పార్ట్స్ ఇస్తే తప్పితే నడవలేని విధంగా వదిలేసాము. వాటిని రవాణా విమానాలలో అమెరికా తీసుకెళ్లడం కంటే వాటిని ఆఫ్ఘనిస్తాన్ లోనే వదిలేయడం మాకు చౌక అవుతుంది అన్నాడు. ప్రమాదం ఉంది. అది మెషీన్ గన్లు, నైట్ విజన్ గాగుల్స్/డివైజెస్, వైరలేస్స్ కమ్యూనికేషన్ సెట్ల తోనే. అయితే వీటి నిర్వహణ అంత సులభంగా ఉండదు.ఇప్పుడు అర్ధమయిందా?.. పుత్తడిబొమ్మ సినిమాలో సుత్తి వీరభద్రరావుకు జనం ఏనుగును ఎందుకు బహుకరించారో?!