– వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి
తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు.
పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్ ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ..సొంత పార్టీపై విమర్శలు చేశారు.
“ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే.
గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని నన్ను వెళ్లమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావించారు.నేను వెళ్లేందుకు విభేదించడం పార్టీకి నచ్చలేదు.
బలహీనవర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరు” అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు తెదేపాలో పార్థసారథి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఆయనతో చర్చించారు. వారు తెదేపాలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి తెదేపాలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.