-హవ్వ… మంత్రులకు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశ అర్హత ఉండదా?
-టి డి ఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి… తక్షణమే టిడిఆర్ బాండ్లు రద్దు చేయాలి
-సుప్రీం లో బెయిల్ రద్దు కేసు వాయిదా పడే ఛాన్స్
-మాకొద్దు బాబు ఎంపీ సీటు అంటున్న వైకాపా ప్రజాప్రతినిధులు
-ఎన్నికల్లో ఉచిత పబ్లిసిటీ కోసమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
భయం భయంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే ఆయనకేమీ రెండు కొమ్ములు నాలుగు చేతులు ఉండవు. ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా? అంటూ నిలదీశారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పర్యటనలకు వెళ్ళనప్పుడు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే వారని గుర్తు చేశారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి తండ్రి పంథాను తుంగలో తొక్కినప్పటికీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన 24 గంటల వ్యవధిలోని ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చి, ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రగతి భవన్ పేరును మార్చి తన పేరు, తన తండ్రి పేరు, తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పేరో పెట్టలేదు. ఒక మహనీయుడైన జ్యోతిరావు పూలే పేరును పెట్టారు.
ప్రజా భవన్ ముందు ఉన్న బారి కేడ్లను తొలగించిన ముఖ్యమంత్రి ఒకవైపు అయితే, మరొకవైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఏ పర్యటనకు వెళ్ళినా బారి కేడ్ల తో పాటు వరదాలు ఉండవలసిందేనని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు . అలాగే ఎపుగా ఎదిగిన చెట్లు నరికి వేయడం తప్పదు . భీమవరంలో ఈనెల 8వ తేదీన నిర్వహించ తలపెట్టి బటన్ నొక్కే కార్యక్రమాన్ని, ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి సభ నిర్వహించే మైదానంలో ఉన్న తాటి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. తాటి చెట్టు పైకి ఎక్కి ఎవరైనా విలు విద్య కాడు బాణం వేస్తారా?, లేకపోతే ఎవరైనా అగంతకుడు తుపాకీతో కాలుస్తారా??, తాటి చెట్టును కూడా కూకటి వేళ్లతో పెకిలించాల్సినంత పైత్యం ఎందుకని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు అద్భుతమన్నారు. అయినా ప్రజలకు దూరం అయ్యారన్న ఏకైక కారణంతో ఆయన్ని అక్కడి ప్రజలు ఓడించారు. ప్రజలు అజ్ఞానాన్ని మన్నిస్తారు కానీ అహంకారాన్ని కాదు. గత నాలుగున్నర ఏళ్లుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, బారి కేడ్లు మధ్య, పరదాల చాటున తిరుగుతూ, ఎపుగా ఎదిగిన చెట్లను నరికి వేసే జగన్మోహన్ రెడ్డి ని మార్చడానికి ప్రజలు రెడీ అయిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తారట.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి మంత్రులను, ప్రజా ప్రతినిధులనే ప్రవేశించనివ్వని జగన్మోహన్ రెడ్డి, విశాఖపట్నంలో మాత్రం స్థానికుల సలహాలు సూచనలు తీసుకుని పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని న్యాయస్థానం విశాఖకు వెళ్ళనిస్తుందో వెళ్ళనివ్వదో తెలియదన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం గేటు వద్ద తాము మంత్రులము, ఎమ్మెల్యేలమని చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోపల నుంచి అనుమతి రానిదే అడుగు లోపలికి పెట్టనివ్వమంటూ కరాకండీగా తేల్చి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ప్రజా ప్రతినిధులకే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశం లేని రాష్ట్రం ఒకపక్క అయితే, ప్రజల సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా దర్బారు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మరొక పక్క అని ఆయన అన్నారు. ఈ పోలిక చూసిన తర్వాత మహిళలు చీపుర్లతో కొడుతారని హెచ్చరించారు. పార్టీలో ఉన్న వ్యక్తిగా, ఇంకా ఉంచుకోబడిన వ్యక్తిగా మంచి చెప్పడం అనేది నా బాధ్యత అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
టీడిఆర్ బాండ్లలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అవినీతి
రాష్ట్రవ్యాప్తంగా టిడిఆర్ ( ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ) బాండ్లలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తెదేపా నాయకుడు వెంకట రమణారెడ్డి పూర్తి అధ్యయనం తర్వాత పేర్కొన్న విషయం తెలిసిందేనని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రోడ్డు విస్తరణలో, ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టడానికి భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి టి డి ఆర్ బాండ్లను జారీ చేస్తారు. తణుకు, తాడేపల్లిగూడెంలలో కూడా ఈ విధంగా టీడిఆర్ బాండ్లను జారీ చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల లో జరిగిన అవినీతిపై పూర్తి అధ్యయనం చేసిన తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డి పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అక్రమాల గురించి వెల్లడించిన విషయం తెలిసిందే.
టి డి ఆర్ బాండ్లను జారీ చేయడం అంటే అక్రమ కట్టడాలను ప్రోత్సహించడమే. ఒక ప్రాంతంలో నాలుగు అంతస్తులకే అనుమతులు లభించనుండగా, టి డి ఆర్ బాండ్లను కొనుగోలు చేసి అదనంగా రెండు అంతస్తులను కట్టుకునే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోంది. అయితే ఈ టి డి ఆర్ బాండ్లలో అవినీతికి ఎలా పాల్పడ్డారన్నదానిపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి తన స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు గిఫ్టు డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలాన్ని ఆయన ఏడాదికి ముందే కొనుగోలు చేశారు. ఎక్కడైతే ప్రభుత్వం భూసేకరణ చేస్తుందో, అక్కడ తమ మనుషులను దింపి ప్రభుత్వ పెద్దలే స్థలాలను కొనుగోలు చేయిస్తారు. ఇక్కడే వారు తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు.
తాము కొనుగోలు చేసిన ధర కంటే చదరపు గజానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి ధర చూపిస్తారు. ఒక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు వేల కోట్ల రూపాయల టిడిఆర్ బాండ్లను జారీ చేయడం జరిగింది. ఇందులో అంతిమ లబ్ధిదారులు ఎవరన్నది చెప్పుకోవలసిన అవసరం లేదు. అవినీతి చేసిన వారికి రవ్వంత దక్కితే, కొండంత ఎవరి దగ్గరకు వెళ్తుందో ప్రజలందరికీ తెలుసు. తణుకు పట్టణంతో సంబంధం లేని ప్రాంతంలో పార్కు కట్టాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. వ్యవసాయ భూమిని మున్సిపల్ పార్కు కోసం సేకరించి, చదరపు గజాలలో లెక్క కట్టి వాస్తవ ధర కంటే అదనంగా చెల్లించారు.
ఇలా తణుకు, తాడేపల్లిగూడెంలలో రెండేళ్ల క్రితమే ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరిందని జనం చర్చించుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రభుత్వం భూములు తీసుకొని, వారికి టిడిఆర్ బాండ్లను ఇచ్చింది. అయితే ఎక్కడ కూడా భూములు ఇస్తున్న వారి ఆస్తి పత్రాలను ప్రభుత్వం తనిఖీ చేయలేదు. దీనితో, దొంగ ఆస్తి పత్రాలతో టిడిఆర్ బాండ్లను పొందిన వారున్నారు. ప్రభుత్వానికి ఎవరైనా తమ భూములను గిఫ్టుగా ఇస్తున్నప్పుడు, ఈసీ పరిశీలించి ఉంటే… ఆ భూములు ఎవరివన్నది తెలిసి ఉండేది. తిరుపతి నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు ఇలా ఈసీ పరిశీలించకుండానే భూములు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
టి డి ఆర్ బాండ్లలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా, ఆధారాలతో సహా ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టారు. మద్యం, మట్టి, ఇసుక, భూముల్లోనే దోచుకున్నారని అనుకుంటే, టిడిఆర్ బాండ్లలో కూడా వినూత్నంగా ఈ రేంజ్ లో దోచుకుంటారని తెలుసుకోలేకపోయామన్నారు. దోచుకున్నది దోచుకొని, దోచుకున్నది దాచుకొని ఇప్పుడు టిడిఆర్ బాండ్ల జారీకి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ సభ్యులు టిడిఆర్ బాండ్ల జారిని పర్యవేక్షిస్తారట. దోచుకోవాల్సిందంతా దోచుకున్న తరువాత , కొంత ఏమైనా జారిపోయిందన్న అనుమానం ప్రభుత్వ పెద్దలకు వచ్చిందా?
లేకపోతే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టీడీఆర్ బాండ్ల జారీ ని కట్టు దిట్టం చేయడం ద్వారా మరింతగా దోచుకోవాలని భావిస్తున్నారా? అర్థం కావడం లేదు. రాష్ట్రంలో టిడిఆర్ బాండ్లను తక్షణమే రద్దు చేయాలి. ఎవరైనా అనుమతులు లేని చోట అదనంగా రెండంతస్తులు నిర్మించుకోవాలని భావిస్తే వారి వద్ద నుంచి ప్రభుత్వమే డబ్బులు వసూలు చేసి, భూములు కోల్పోయిన వారికి చెల్లించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.
కేంద్ర మంత్రులను ఎంపీలు నేరుగా కలవడానికి వీల్లేదని గతంలో జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారు
కేంద్ర మంత్రులను నేరుగా ఎంపీలు ఎవరు కలవ వద్దని, మిథునన్న, సాయన్నతో కలిసి మాత్రమే వెళ్లి కలువాలని గతంలో జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఎవరైనా నేరుగా వెళ్లి కలిస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారన్నారు. అయితే ఆ తర్వాత తాను కేంద్ర మంత్రులను కలిశానని, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. మిగిలిన ఎంపీలు ఎవరు కూడా కేంద్ర మంత్రులను కలిసి సాహసం మాత్రం చేయలేదని చెప్పారు. కేంద్ర మంత్రులను కూడా నేరుగా కలిసే స్వేచ్ఛ లేని ఎంపీ టికెట్ తమకు వద్దని సిట్టింగ్ ఎంపీలంతా భావిస్తున్నారు.
వైకాపా సిట్టింగ్ ఎంపీలు ఎవరు కూడా మళ్లీ పోటీ చేయాలని భావించడం లేదంటూ ఒక ప్రముఖ దినపత్రికలో వార్తా కథనం వెలువడింది. రాజంపేట, కడప, మచిలీపట్నం స్థానాలలో తిరిగి ప్రస్తుత ఎంపీలకే పార్టీ అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే వాళ్లు తప్ప ఇంకెవరు పోటీ చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ప్రాథమికంగా వారి పేర్లను ఖరారు చేసి ఉంటారన్నారు. ఎంపీ టికెట్ కోసం గతంలో కంటే నాలుగు రెట్లు అధికంగా మా పార్టీ నాయకత్వం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు వరకు మా పార్టీ గెలిచే ఛాన్సే లేదు.
ఈ విషయం జగమెరిగిన సత్యమేనని, జగన్ ఎరిగిన సత్యమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని స్థానాలు రావచ్చు, రాకపోవచ్చు అన్నారు. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా నియోజకవర్గాలలో అడుగుపెట్టలేని దుస్థితిలో ఎంపీ లు ఉన్నారు. ఒక ఎస్సై నుంచి మొదలుకొని కానిస్టేబుల్ వరకు బదిలీ చేయించాలన్న స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సు కోరాల్సిన దుస్థితిలో ఉన్న ఎంపీ పదవి అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
వన్ షాట్ టూ బర్డ్స్ అనే కాన్సెప్ట్ తో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం
రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు. నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. దీనితో, వన్ షాట్ టూ బర్డ్స్ అనే కాన్సెప్ట్ తో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్, కబడ్డీ, ఖో ఖో తో పాటు యోగా, ధ్యానం లలో కూడా పోటీలు నిర్వహిస్తారట. ఎక్కువసేపు ఎవరు కళ్ళు మూసుకుంటే వారికే బహుమతులు ఇస్తారేమో. డిసెంబర్ 17వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఈ కార్యక్రమం పబ్లిసిటీ కోసం ప్రతి ఆర్టీసీ బస్సుపై స్టిక్కర్లు అతికిస్తున్నారు. నవరత్నాల మాదిరిగా తొమ్మిది క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారట. ఈ పోటీల పబ్లిసిటీ కోసం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. రానున్న ఎన్నికల్లో ఉచిత పబ్లిసిటీ కోసమే ఐప్యాక్ కను సన్నల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడలను నిర్వహించడానికి అవసరమైన కోచ్ లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( శాప్)లో అందుబాటులో లేరు . శాప్ లో ఉన్నది పర్మినెంట్ కోచ్ లు ముగ్గురు అయితే, తాత్కాలిక ప్రాతిపదికన 142 మందిని నియమించారట. అయితే, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడలను నిర్వహించడానికి 750 నుంచి 800 మంది వరకు క్రీడా అధికారుల అవసరం పడుతుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆటలు నిర్వహించడానికి అవసరమైన క్రీడా అధికారులు అందుబాటులో లేకపోగా, క్రీడా ప్రాంగణాలు కూడా లేవన్నారు. ఇప్పటివరకు క్రీడలను ప్రోత్సహించడానికి ఔత్సాహికులైన క్రీడాకారుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేసింది లేదు. ఇప్పుడు మాత్రం క్రికెట్లో ఐపీఎల్ జట్లతో శిక్షణ ఇప్పిస్తామని, ప్రతిభ కనబరిచిన వారిని ఐపీఎల్ జట్లలో ఆడిస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రచారంలో ఎక్కడ కూడా క్రీడల శాఖ మంత్రి రోజా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఫోటోలు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా చిరునవ్వులు చిందించే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపిస్తున్నాయంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోసం వేసిన కేసు వాయిదా పడే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 A వర్తింపుపై జడ్జిమెంట్ రాస్తున్నారని, ఆ తీర్పు వెలువడిన తర్వాతే బెయిల్ రద్దు పిటిషన్ విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అన్నారు. సుప్రీంకోర్టుకు జనవరి రెండవ తేదీ వరకు సెలవులు ఉండడంతో, ఆ తరువాతే కేసును విచారించే అవకాశం ఉందన్నారు.