Suryaa.co.in

Features

పౌరోహిత్యాన్ని “కుల వృత్తి”గా గుర్తించడం అసలు సాధ్యమేనా?

ప్రస్తుత సమాజంలో ఏ కులం వారు ఏ వృత్తి చేయాలో రాజ్యాగం కానీ, చట్టం కానీ అస్సలు ఎప్పటికి కూడా నిర్ధారించదు. ప్రభుత్వం అంతకన్నా నిర్ధారించదు. పౌరోహిత్యం అనేది అసలు వృత్తినే కాదు. యుగయుగాలుగా పుర హితాన్ని కోరే విధానం. అది గొప్ప ధర్మ కార్యం. పౌరోహిత్యం చేస్తే చేయించుకున్న యజమానుల ఇష్టప్రకారం ఇచ్చేదాన్ని కూలి అనరు… దాన్ని గౌరవంగా సంభావన/పాంతు అనే అంటారు. మిగిలిన వృత్తులలో దాన్ని కూలి అంటారు.

సమాజంలో పౌరోహిత్యం నిర్వహించే పురోహితులుగా ఒక్క బ్రాహ్మణ జాతి వారు మాత్రమే కార్యక్రమాలు చేయించట్లేదు. ఈ పౌరోహిత్యాన్ని సమాజంలో విశ్వబ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, కాపు, రజక, యాదవ, గౌడ, పద్మశాలి, బలిజ, మాల, మాదిగ, చత్తాద శ్రీవైష్ణవులు, జంగాలు, బుడబుక్కల, దమ్మరి, ఎరుకల, యనాది తదితర sc, st, bc కులాల్లో మిగిలిన వారుకూడా ఈ పురోహిత వృత్తిలో శుభ,అశుభ కార్యక్రమాలు రెండూ చేయిస్తున్నారు. వారి యజమానులు వారికి వున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ జాతి ఒక్కరికే ఎలా పౌరోహిత్యంను కుల వృత్తిగా గుర్తిస్తారు. అలా అని బ్రాహ్మణ జాతిలో వున్న అన్ని శాఖలు వారు పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించలేదు. వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండిపోయారు. మిగిలిన కులాల వారు కూడా వారి కులాల్లో ఈ పౌరోహిత్యం చేసే వాళ్ళని కూడా తమని కూడా బ్రాహ్మణులతో పాటు సమానంగా గుర్తించమని హడావుడి, ఉద్యమం చేస్తే మన బ్రాహ్మణ పురోహితులు పరిస్థితి ఏంటి ఈ సమాజంలో ఆలోచించండి. వాళ్ళల్లో ఎవరైనా హైకోర్టు కి వెళితే బ్రాహ్మణ జాతి పరువు ఏమవుతుంది?

దేవాదాయ,ధర్మాదాయ శాఖలోని దేవాలయాల్లో వంశ పారంపర్య అర్చకులుగా, నియమింపబడ్డ అర్చకులుగా అన్ని కులాలు వారు ఆయా ప్రాంతాల దేవాలయాల్లో పనిచేస్తున్నారు. దేవాలయ చట్టాలు,భారత రాజ్యాంగం పై పూర్తిగా అవగాహన వున్న లాయర్లను మీ ప్రాంతాల్లో పూర్తిగా విచారణ చేసుకోగలరు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హైకోర్టు వారు బ్రాహ్మణ వ్యతిరేక తీర్పులను మర్చిపోయారా? బ్రాహ్మణులు, సంఘాల వారు ఎవరూ దేశ చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. సమాజంలో చేతకాని వారిగా పరువు తీసుకోకూడదు.

బ్రాహ్మణ పురోహితులకు పౌరోహిత్యం ను వృత్తిగా గుర్తించకపోతే మన వారు పురోహితులు కాలేరా, ఇప్పటివరకు పురోహితులుగా వీరెవరికి గుర్తింపు రాలేదా? పురోహితుడు అనే గుర్తింపు ఎవరిస్తారు? ఆ గుర్తింపు ఎవరి వల్ల వస్తుంది…?? తాము చదువుకున్న స్మార్త,వేద విద్య వల్ల, తమ మంత్ర పాఠం, తమ తమ వాగ్ధాటితో మాత్రమే సమాజంలో గుర్తింపు వస్తుంది. ఈ భూమి మీద భూత,భవిష్యత్, వర్తమాన కాలాల్లో యజమాని ఆదేశం మేరకు తనకు తానుగా చేయించే కార్యక్రమాలు వల్ల మాత్రమే బ్రాహ్మణ పురోహితుడుగా గుర్తింపు పొందుతూనే వున్నాడు.

అపుడు,ఇపుడు, ఎప్పుడూ బ్రాహ్మణ పురోహితునిగానే వారి,వారి యజమానుల వద్ద తరతరాలుగా ఎప్పటికీ బ్రాహ్మణ పురోహితునిగానే కొనసాగుతూనే వుంటారు. మంచి పురోహితుడుగా గుర్తింపు వచ్చేది కేవలం వారు చదువుకున్న విద్య మరియు వారి,వారి యజమానులు, బంధు, మిత్రుల నోటి ప్రచారం ద్వారా మాత్రమే కదా. దాన్ని ప్రభుత్వాలు గుర్తించేది ఏంటి? ప్రభుత్వం గుర్తిస్తే ఈ వృత్తిలో నిర్వహించే కార్యక్రమాలకు వసూళ్లు చేయాల్సిన రేట్లు పుష్కరాల్లో మాదిరి వీటిని కూడా ప్రభుత్వమే ప్రకటిస్తే? ఆ తరువాత ఆధార్ తో లింక్ చేసి పురోహిత వృత్తి పన్ను కట్టేందుకు సిద్ధపడాలి. ఈ పౌరోహిత్యంలో మనకి ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మనకి జరిగే పనేనా?

రాజకీయ బ్రాహ్మణ నిరుద్యోగులు కొంతమంది వాళ్ళ నామినేటెడ్ పదవుల కోసం లేదా ఎన్నికల సమయాల్లోనూ ఈ వివాదస్పద మాయా అంశాన్ని వాళ్ళ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే తెరపైకి తెస్తుంటారు.దయచేసి పురోహిత సోదరులేవరూ ఈ రాజకీయ నిరుద్యోగుల స్వార్ధ మాయలో పడిపోయి వారిని నమ్మి మోసపోవద్దు.

కుల వృత్తిని నిర్ణయించు కోవల్సింది, ఆ కులంలో ఆ వృత్తిని నమ్ముకొని చేసే వారు మాత్రమే. ప్రస్తుత సమాజంలో వివిధ కుల వృత్తులను అన్ని కులాలు,జాతులు,మతాల వారు కూడా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఉండే ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానాలు కానీ మన రాజ్యాగంలో పొందుపరిచిన ఆర్టికిల్స్,చట్టాలకు లోబడి మాత్రమే పనిచేస్తాయి.

బ్రాహ్మణ పురోహిత సోదరులారా ఇది ఎప్పటికీ జరగనిపని. రాజకీయ నిరుద్యోగుల కోసం మీ అమూల్యమైన మేధో సమయాన్ని, ధనాన్ని దయచేసి వృధా చేసుకోకండి.

– బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE