– ‘దేశం’లో జగన్ తమ్ముడు దుష్యంత్‌రెడ్డి?
– స్థానిక ఎన్నికల్లో పులివెందులలో సహకరిస్తానని హామీ?
– సోషల్‌మీడియాలో హల్చల్
జగన్‌కు తమ్ముడు ఝలక్?
– ‘దేశం’లో జగన్ తమ్ముడు దుష్యంత్‌రెడ్డి?
– స్థానిక ఎన్నికల్లో పులివెందులలో సహకరిస్తానని హామీ?
– సోషల్‌మీడియాలో హల్చల్
( సుబ్బు)
వైఎస్ కుటుంబ చరిత్రలో రెండో తిరుగుబాటుకు తెరలేవనుందా? తొలుత జగన్‌పై బాబాయ్ వివేకానందరెడ్డి తిరుగుబాటు చేయగా.. ఇప్పుడు వరసకు తమ్ముడయ్యే దుష్యంత్‌రెడ్డి జగన్‌కు ఝలక్ ఇవ్వనున్నారా? పులివెందులలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్న పార్టీని ఆగం చేస్తానని తమ్ముడు మాటిచ్చారా? మరి తమ్ముడు త్వరలో ‘తెలుగు’తీర్ధం తీసుకోనున్నారా? ఆ మేరకు టీడీపీ నాయకత్వంతో తమ్ముడి మాట-ముచ్చట పూర్తయిందా?
పులివెందుల రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ వైపు ఆయన కుటుంబ సభ్యులు ఉండటమే దీనికి కారణం. జగన్ సోదరుడు చెవ్వ దుష్యంత్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీ కీలక నేతలతో దుష్యంత్ రెడ్డి భేటీ ఉంటుందని చర్చ నడుస్తోంది.
చెవ్వ విజయ శేఖర్ రెడ్డి కుమారుడే దుష్యంత్ రెడ్డి. దుష్యంత్ జగన్‌కు వరుసకు తమ్ముడు అవుతాడు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని దుష్యంత్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు జమ్మలమడుగులోని దుష్యంత్‌రెడ్డి మైనింగ్ వ్యవహారాలకు ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ పంచాయితీలో దుష్యంత్‌కు పులివెందుల రూరల్ సీఐ రమణ.. దగ్గరుండి సాయం చేశారు. ఇప్పటివరకు దుష్యంత్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పులివెందులలో మారుతున్న ఈ రాజకీయాలు సంచలనం రేపుతున్నాయి.