Suryaa.co.in

Telangana

హామీలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?

– ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం కూడా నేరమా?
– మహిళా మోర్చా కార్యకర్తల అరెస్టును ఖండిస్తున్నాం
– మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి
– మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం బిజెపి నిరసన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేసిన మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తే అరెస్టు చేయడమేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతికత?

మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయం ఇస్తామన్నారు.. ఏమైంది..? 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్నారు.. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతామన్నారు.. ఎందుకు అమలు చేయడంలేదు..? పెన్షన్ మొత్తాన్ని రూ.4,000కి పెంచుతామన్నారు.. కాంగ్రెస్ సర్కారు మాట మీద నిలబడటం లేదెందుకు..? అభయ హస్తం నిధులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాలోకానికి సమాధానం చెప్పాలి. ఎన్నికల ముందు హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని, అధికారంలోకి రాగానే వెనుకడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ, పదే పదే మోసం చేస్తోంది.

తెలంగాణలో మహిళలపై వేధింపులు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల సమస్యలు పట్టవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలి.

తుకారాం గేట్, అప్జల్ గంజ్, ఫలక్ నుమా, నారాయణగూడ, సీతాఫల్ మండి పోలీస్ స్టేషన్లకు తరలించిన సుమారు 150 మంది మహిళా మోర్చా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE