-
పెద్దల జేబుల్లోకి ‘పేదల’ బియ్యం!
-
దేశం దాటుతున్న లక్ష టన్నుల బియ్యం
-
అద్దంకి కేంద్రంగా అడ్డగోలు రేషన్ దందా
-
కృష్ణపట్నం పోర్టుకు రవాణా
-
పోలీసు, సివిల్‌సప్లయిస్, ట్రాన్స్‌పోర్టు శాఖలకు నెలవారీ మామూళ్లు
-
రేషన్ దందాకు ఆయనే ‘సారథి’
-
ఇసుక, మట్టి, క్వారీల దందాకూ ఆయనదే సారథ్యం?
-
ఆయనకు ఓ మంత్రిగారి ఆశీస్సులు
-
కొత్తగా దందాలోకి ఓ సీనియర్ జర్నలిస్టు?
-
రంగంలోకి ఆయన మిత్రుడు
-
మూడు ఏరియాల్లో ఆయనదే పెత్తనం
-
నెల్లూరు, ఒంగోలు, అద్దంకి, పరుచూరు, బాపట్ల, చీరాల, రేపల్లె, పల్నాడు జిల్లాల నుంచి ఎగుమతులు?
-
గుజరాత్ పోర్టుకూ తరలివెళుతున్న రేషన్ బియ్యం
-
ఎమ్మెల్యేలకు 25 లక్షలు సమర్పణ?
-
గత వైసీపీ జమానాలో 8 లక్షల మామూళ్లు
-
చీరాల ప్రముఖుడికి రెండు నెలల అడ్వాన్సు?
-
కూటమి ఇమేజీకి తమ్ముళ్ల డ్యామేజీ
-
పాలిషింగ్ కోసం ఒంగోలు, అద్దంకిలో లీజుకు రైస్ మిల్లులు
-
బాబు ఆదేశాలు బేఖాతర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘పార్టీకి మచ్చ తెచ్చే పనులు చేయవద్దు. వారి వల్ల పార్టీకి నష్టం కలిగితే సహించేది లేదు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మిమ్మల్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలన్నదే నా ప్రయత్నం. కానీ మీరు వన్‌టైమ్ ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటే మీ ఇష్టం. కానీ పార్టీకి నష్టం చేస్తే మాత్రం సహించేది లేదు. వైసీపీ అలా చేస్తేనే మనం అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనం ప్రజలకు జవాబుదారులం. ప్రజల్లో చెడ్డపేరు వస్తే నేను వారిని వదిలేసేందుకు సైతం సిద్ధం. కాబట్టి మీరంతా జనంలో ఉండండి. వారి సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ సెటిల్‌మెంట్లు, అక్రమ వ్యాపారాల జోలికి వెళ్లకండి. ఇసుక జోలికి అసలు వెళ్లకండి’’- ఇది తన పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తరచూ చెప్పే హితోక్తులు, చేసే హెచ్చరికలు. కానీ వాటిని తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారు. రేషన్ బియ్యం దందానే అందుకు నిలువెత్తు నిదర్శనం.
అది పేదల కడుపునింపే బియ్యం. దివంగత మహానేత ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్ర పేదలకు ఇచ్చిన వరం. ఇప్పుడది అష్టావక్రరూపు దాల్చి.. ముడుపులు మూటకట్టుకుని పల్లె, పట్టణాల మీదగా.. ఏకంగా దేశాలే దాటుతోంది. ఒక్క ఉమ్మడి గుంటూరు-ప్రకాశం జిల్లాల నుంచి నెలకు లక్ష టన్నుల బియ్యం దాటుతోందంటే.. పెద్ద గద్దల రెక్కలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఇందులో అధికారల పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, మీడియా అంతా భాగస్వాములే.
కృష్ణపట్నం, గుజరాత్ పోర్టులకు నిర్భయంగా వెళుతున్న ఈ రేషన్ బియ్యం దందాను, అడ్డుకునే మొనగాడే కరవయ్యారు. కారణం.. ఎవరి వాటాలు వారికి వెళ్లటమే! అద్దంకి కేంద్రంగా జరుగుతున్న ఈ దందాకు ఓ రాష్ట్ర స్థాయి కీలక నేత అనుచరుడే, ‘సారథి’ అన్నది బహిరంగంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇసుక, బుసుక, మట్టి, క్వారీరాళ్ల రవాణా.. ఒకటేమిటి? సర్వవ్యాపారాలకు ఆయనే ‘సారథి’ అన్నది, కూటమిలో ఓపెన్‌టాక్. ఇప్పటిదాకా క్వారీ దందాలో తెరవెనుక కింగ్‌మేకర్‌గా ఉన్న ఈయన కన్ను ఇప్పుడు బియ్యంపైనా పడిందట. అద్దంకి అడ్డాగా జరుగుతున్న ఈ దందా అసలు స్వరూపమిది!
కొద్దినెలల ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకెళ్లి.. ‘సీజ్ ద షిప్’ అన్న డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. షిప్పుల్లో లక్షల టన్నుల రేషన్‌బియ్యం దక్షిణాఫ్రికాకు తరలివెళుతున్న నేపథ్యంలో, ఆకస్మిక తనిఖీకి వెళ్లిన పవన్.. స్వయంగా చూసిన దందా అది. ఫలితంగా పవన్ కల్యాణ్ పుణ్యాన ఒకనెల మాత్రం రేషన్ దందాకు బ్రేకు పడింది. మళ్లీ తర్వాత ‘మామూలే’. విచిత్రంగా ఈ నిర్బంధాల వల్ల అక్రమార్కుల రేటు పెరిగింది. బిజినెస్ బాగా టైట్ అయినందున మామూలు రేట్లు కూడా పెంచేశారట.
నిజానికి ఈ బియ్యం దందా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం నుంచి వెళ్లే ఎమ్మెల్యేకు నెలకు 5 నుంచి 8 లక్షలు సమర్పించుకునేవారట. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 15 నుంచి ఇప్పుడు ఏకంగా 25 లక్షలకు పెంచేశారట. ఖర్చులు పెరిగాయి కదా? అందుకన్నమాట! చీరాలకు చెందిన ఓ అధికార పార్టీ ప్రముఖుడికి అయితే ఏకంగా రెండునెలల అడ్వాన్సు కూడా, పువ్వులో పెట్టి అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక రేషన్ బియ్యం డీలర్లకు కిలో బియ్యానికి 15 రూపాయల చెల్లించి బియ్యం తీసుకుంటుండగా.. ఆ రేషన్ డీలర్లు వినియోగదారుడికి, కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. అంటే 5 రూపాయల లాభంతో రేషన్ డీలర్లు, రేషన్ మాఫియాకు బియ్యం అమ్ముతున్నారన్నమాట. వాటిని రైస్‌మిల్లుల్లో పాలిషింగ్ పెట్టి లారీల ద్వారా కృష్ణపట్నం, గుజరాత్ పోర్టుకు తరలిస్తారు. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, చీరాల, అద్దంకి, పరుచూరు, దర్శి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కనిగిరి, వినుకొండ ప్రాంతాల్లో సేకరించే బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక గుంటూరు, రేపల్లె, చిలకలూరిపేట సహా పల్నాడు నుంచి సేకరించే బియ్యాన్ని, గుజరాత్ పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ లారీలు చెక్ పోస్టు దాటాలంటే, ఒక్కో లారీకి 500 రూపాయల మామూళ్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. వీటిని పాలిషింగ్ పెట్టేందుకు ఏకంగా రెండు రైస్‌మిల్లులనే లీజుకు తీసుకున్నారంటే.. పేదల బియ్యంపై పెద్ద గద్దలు ఏ స్థాయిలో వాలిపోయాయో, ఈ దందాతో నెలకు ఎన్ని కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారో స్పష్టమవుతోంది.
ఇక ఈ దందాకు కర్త కర్మ క్రియ.. అద్దంకి చెందిన ఓ రాష్ట్రస్థాయి కీలకనేత ‘ఆత్మ’ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ‘ఆత్మ’ ‘సారథి’గా ఉంటూ రేషన్ బియ్యం దందాను నడిపిస్తున్నారని, గతంలో తమకు బియ్యం ఇవ్వని వారిని, ఇప్పుడు బెదిరించి తీసుకుంటున్నారన్న విమర్శ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అద్దంకి కేంద్రంగా జరుగుతున్న ఇసుక, బుసుక, మట్టి, క్వారీ రాళ్ల ఎగుమతుల దందాకు సైతం ఆయనే ‘సారథి’ అన్నది చాలాకాలం నుంచి వినిపిస్తున్న ఆరోపణ.
జాతీయ రహదారి నిర్మాణాలకు అవసరమయ్యే గ్రావెల్ సరఫరాకూ ఆయనే ‘సారథి’ అన్నది టీడీపీలోని మరో వర్గం ఆరోపణ. క్వారీరాళ్ల ఎగుమతులు కావాలంటే, ఆయనకు కప్పం కట్టాల్సిందేనట. పక్క నియోజకవర్గంలోని మరో అధికార పార్టీ ప్రముఖుడు కూడా, చాలాకాలం నుంచి ఈ దందాలో నిష్ణాతుడిగా ఉన్నారన్నది మరో విమర్శ.
కాగా కొత్తగా ఈ దందాలోకి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించి, వారికి అనధికార సలహాదారుగా ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు ప్రవేశించారన్న చర్చ జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సదరు జర్నలిస్టు, ఆ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతోపాటు, కొందరు వైసీపీ నేతలతోనూ అత్యంత సన్నిహితంగా ఉంటారన్న పేరుంది. ఆయన మిత్రుడి ద్వారా చీరాల, బాపట్ల నుంచి రేషన్‌బియ్యం సేకరించి మాఫియాకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవిగో రైస్‌మిల్లులు..
ఉమ్మడి గుంటూరు-ప్రకాశం జిల్లాల్లో రేషన్‌డీలర్ల నుంచి సేకరించే రేషన్ బియ్యాన్ని.. రైస్‌మిల్లులలో పాలిషింగ్ పెట్టించి, దేశం దాటిస్తున్నారు. ఈ క్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు గ్రామంలో ఓ పదిరోజుల క్రితం, ఒక రైస్ మిల్లును లీజుకు తీసుకున్నారు. అంతకుముందు ఇంకొల్లు, సంతమాగులూరులో రెండు మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడి నుంచే కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా .. రైస్ మాఫియా మిల్లులను లీజుకు తీసుకుని, పాలిషింగ్ చేసిన బియ్యాన్ని పోర్టుకు చేరుస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.
ఇదీ లెక్క!
రేషన్‌షాపులో చాలామంది బియ్యం తీసుకోరన్నది మనం మనషులం అన్నంత నిజం. దానితో డీలర్లు వారికి కిలోకు 10 రూపాయల చొప్పున నగదు చెల్లించి, ఆ బియ్యాన్ని తమ వద్ద ఉంచుంటారు. దానిని రేషన్ మాఫియా.. డీలర్ల నుంచి కిలోకు 15 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తుంది. దానిని రైసుమిల్లుల్లో పాలిషింగ్ చేయించి, కిలోకు 75 రూపాయల చొప్పున ఆఫ్రికా దేశాలకు అమ్ముతుంటుంది. ఇవి కృష్ణపట్నం, గుజరాత్ పోర్టు ద్వారా చేరుతున్నాయన్నది బహిరంగ రహస్యం.
ఎవరి మామూళ్లు ఎంతంటే..
మరి ఒక బియ్యం లారీ రేషన్‌డీ లర్ల నుంచి మిల్లుకు.. అక్కడి నుంచి పోర్టుకు తరలించాలంటే మామూలు యవ్వారం కాదు. దానికి చాలా ధైర్యం ఉండాలి. యంత్రాంగం ఉండాలి. దానికిమించి.. అధికారుల జేబులు నింపే తెలివి ఉండాలి. ఆ ప్రకారంగా బియ్యం లారీలు వెళ్లే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకు నెలకు 25 లక్షలు, సీఐకి నెలకు 50 వేలు, విజిలెన్స్‌కు 50 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక్కో చెక్‌పోస్టుకు లారీకి 500 రూపాయలు ముడుపులు సరేసరి. సివిల్ సప్లయ్ అధికారుల ద్వారా జిల్లాల్లోని కీలక అధికారికి, నెలకు 10 లక్షలు సమర్పించుకోక తప్పదు. ఇక వీరు కాకుండా జిల్లాల్లో చిన్నా చితకా పత్రికలు, యూట్యూబ్ చానెళ్ల నుంచి.. జిల్లా స్థాయి రిపోర్టర్లకూ యాడ్స్ పేరుతో మామూళ్లు సమర్పించుకోవలసిందే. ఆ రకంగా కిలోబియ్యం 15 రూపాయలకు కొంటున్న బియ్యం మాఫియాకు.. ఈ ఖర్చులన్నీ పోను, కిలోకి 30 నుంచి 40 రూపాయలు మిగులుతాయన్నమాట.
కృష్ణపట్నం పోర్టు దగ్గర తనిఖీలు కృష్ణార్పణం!
కృష్ణపట్నం పోర్టు కోస్తాలో ఉన్న కీలకమైన రవాణా కేంద్రం. ప్రస్తుతం ఈ పోర్టు అదానీ స్వాధీనంలో ఉన్న విషయం తెలిసిందే.గతంలో ఇక్కడ నుంచే కంటైనర్లు వెళ్లేవి. ఇప్పుడు అది అదానీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత బ్రేక్ బల్క్ ఎక్స్‌పోర్టును మాత్రమే అనుమతిస్తున్నారు. కంటైనర్లు కావాలంటే చెన్నైకు పంపించాల్సిందే. కాగా చీమకుర్తి, బల్లికురువ, మార్టూరు, పరుచూరు, అద్దంకి ప్రాంతాల్లోని గ్రానైట్ కంపెనీలు తవ్వే రాళ్లన్నీ.. కృష్ణపట్నం పోర్టు నుంచే ఎగుమతి అవుతుంటాయి. బిల్లులు లేకుండా కొన్ని, ఒకే బిల్లుతో మరికొన్ని ఇక్కడ నుంచి రవాణా అవుతున్నాయన్నది బహిరంగ రహస్యమే.
ఈ పోర్టు నుంచే చాలాకాలం నుంచి రేషన్ బియ్యం కూడా ఎగుమతి అవుతోంది. వైసీపీ హయాంలో ఇసుక కూడా ఈ పోర్టు నుంచే అక్రమ రవాణా అయ్యేదన్న ఆరోపణలుండేవి. సహజంగా పోర్టు యాజమాన్యమే కస్టమ్స్ విభాగానికి వేతనాలు, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తుంటుంది. కాబట్టి సహజంగా పోర్టు యాజమాన్యంతో కస్టమ్స్ సిబ్బంది సఖ్యతగానే ఉంటారు. పోర్టు లోపల రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పోలీసుల జోక్యం తక్కువ. వారంతా బయటనే ఉండాలి. ఈ క్రమంలో పూర్తి ప్రైవేటు స్వాధీనంలో ఉండే కృష్ణపట్నం పోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వ జోక్యం తక్కువ కావడం, అక్రమార్కులకు వరంగా పరిణమించింది.