Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య వెనుక సాక్షి యాజమాన్యం ఉందేమో?

– కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పకుండా గుండెపోటు కథను సృష్టించారా?
– నేను దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసినట్టుగానే, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి
– న్యాయస్థానాలను తీర్పు ఇవ్వమని అడిగే హక్కు సామాన్యుడికి లేదా?
– కొంతమంది ప్రధాన న్యాయమూర్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు, వారి వెనుక సదరు దళారీ ఉన్న మాట నిజం
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలిసేందుకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కోరుతా
– మన సొమ్ముతోనే నడుస్తోన్న న్యాయస్థానాలు
– వినేసి ఇష్టం వచ్చినప్పుడు తీర్పు చెబుతామంటే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి?
– రాజ్యాంగ ప్రాథమిక హక్కుల విషయంలోనూ వాదనలు విన్న ధర్మాసనం… మూడు నెలలైనా తీర్పునివ్వకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించకపోతే ప్రజలు ఏమి చేస్తారు?
– వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేశాక, సాక్షి దినపత్రిక కామ కథలను వండడం చూస్తే… ఈ హత్య వెనుక సాక్షి యాజమాన్యం ఉందేమోనన్న అనుమానం
– మీ ఫ్యామిలీని మీరే కించపరుచుకుంటారా? వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారా?
-ఎమ్మెల్యేలకు కల్పించినట్లు గానే నాకు శాప విమోచనం కలిగించండి
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యాయస్థానాలను తీర్పు ఇవ్వమని అడిగే హక్కు సామాన్యుడికి లేదా?, న్యాయస్థానాలు మన సొమ్ముతోనే నడుస్తున్నాయి. న్యాయమూర్తులు సమాజానికి దూరంగా ఉంటారు కాబట్టి , వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అధికారాలు ఉన్నంత మాత్రాన వాదనలు వినేసి , తీర్పు మా ఇష్టం వచ్చినప్పుడు చెబుతామంటే, ప్రజాస్వామ్యం ఏమైపోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల విషయంలోనూ వాదనలు విన్న తర్వాత మూడు నెలలైనా ధర్మాసనం తీర్పు ఇవ్వకపోతే, ప్రజలు సుప్రీంకోర్టు ఆశ్రయించకుండా ఏమి చేస్తారన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అధికారం ఉందని ప్రాథమిక హక్కుల గొంతు నొక్కేస్తారా? మూడు నెలలైనా తీర్పు రాకపోతే సుప్రీం కోర్టును ప్రజలు ఆశ్రయిస్తారు. ఈ తరహా ఆలస్యం గతంలో ఏనాడు చూడలేదు. ప్రస్తుతం చూడాల్సి రావడం దురదృష్టకరం.

ఇంతలోనే దళారీల ప్రయోగం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దళారీలు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన మాట నిజం. కొంతమంది ప్రధాన న్యాయమూర్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు, వారి వెనుక సదరు దళారీ ఉన్న మాట నిజం. ఉన్నంత మాత్రాన సేవకుడిని సేవకుడి గానే చూస్తారు. దళారీ చెప్పిన మాట న్యాయ వ్యవస్థ వినదు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను గతంలో విన్న బెంచ్ కు ఇవ్వకుండా, ప్రధాన న్యాయమూర్తి తన వద్దనే ఉంచుకోవడం వల్ల అనుమానం రావడం సహజం. దయచేసి అనుమానించవద్దు. హైకోర్టు బెంచ్ ను అనుమానించకూడదు. అది తప్పు. ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ అనుకున్నట్టుగా జరిగితే, అప్పుడు అనుమానిద్దాం… అనుమానించి సుప్రీంకోర్టులో ప్రశ్నిద్దాం అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను అనుమానించినట్లుగా మనము బయటపడకూడదు. న్యాయ వ్యవస్థ పై గౌరవం తగ్గకుండా ఉండాలి అని లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా భావిస్తున్నాను. ఈ విషయంపై కమిటీ సమావేశంలోనూ చర్చిస్తాను. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలిసేందుకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కోరుతానని తెలిపారు.

ఇవాళ అరెస్టు ఖాయం… అరెస్టు ఆగుతుందా?
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు మరొక కీలక అరెస్టు ఖాయమన్న రఘురామకృష్ణంరాజు, అరెస్టు జరుగుతుందా?, ఆగుతుందా? అన్నది చూడాలన్నారు. ధనమేరా అన్నిటికీ మూలం… ధనము విలువ తెలుసుకోవడం మానవ ధర్మమని పేర్కొన్న ఆయన, ఈ అరెస్టు ఎన్ని రోజులు ఆగుతుందో చూడాలన్నారు. సీబీఐ అధికారులు మాత్రం… నీ పాపం పండెను నేడు… నీ భరతం పడతా చూడు… నీ పాలిట యముడ్ని నేను…నీ కరెక్టు మొగుడ్ని నేను అని అవినాష్ రెడ్డి ని ఉద్దేశించి పాట పాడుతున్నారని చెప్పారు. మరి అవినాష్ రెడ్డి ఏ పాట పాడుతారో చూడాలన్నారు.

ఇదేమి బెంచ్ హంటింగ్ అంటున్న ప్రజలు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్వీకరించడం పట్ల, డాక్టర్ వైయస్ సునీత తరపు న్యాయవాది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఇదేమి బెంచ్ హంటింగ్ అని నిర్మోహమాటంగా ప్రశ్నించాలి. ప్రజలు కూడా ఇదేమి బెంచ్ హంటింగ్ అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో విజయ్ కుమార్ అనే బ్రోకర్ మంతనాలు జరిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు వినడం సరికాదని సునీత తరపు విన్నవించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. గతంలో ఈ కేసు గురించి వాదనలు విన్న సింగిల్ బెంచ్ ధర్మాసనానికి కేటాయించాలని కోరాలన్నారు.. ఈ నెలాఖరులోగా వైయస్ వివేకా హత్య కేసు విచారణపై సిబిఐని చార్జ్ షీట్ దాఖలు చేయమని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేయాలి.

అలాగే విస్తృత కుట్ర పై విచారణ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం లో , న్యాయానికి అన్యాయం జరుగుతుందని తాను అనుకోవడం లేదు. న్యాయం చేయటమే కాదు… న్యాయం చేస్తున్నట్లుగా కనిపించాలి. న్యాయస్థానాల పై గౌరవం పోగొట్టే విధంగా ఉండకూడదు. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చిన గౌరవిస్తామని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
పార్లమెంటు సభ్యులు దాఖలు చేసే పిటిషన్ గతంలో సింగిల్ బెంచ్ ధర్మాసనానికి వెళ్ళేది. గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తిగా వ్యవహరించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు సభ్యులు దాఖలు చేసే కేసులను విచారించే బాధ్యతను తన వద్దే ఉంచుకున్నారు. గతంలో తనపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పోలీసులు కుట్రపూరితంగా నమోదు చేసిన డకోటా కేసు ను సవాల్ చేస్తూ , తాను దాఖలు చేసిన పిటిషన్ పై నథింగ్ టు హియర్ అని కొట్టివేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాను. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసినట్టుగానే, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి.

అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్వీకరించకుండా, గతంలో ఈ కేసును 15 రోజులపాటు పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి లక్ష్మణ్ బెంచ్ కు బదిలీ చేసి ఉంటే బాగుండేది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులోనైనా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొమ్మని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా, ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డికి, జిల్లా కోర్టుకు వెళ్ళమని హై కోర్టు చెప్పాలి.. 15 రోజుల పాటు ఈ కేసును పరిశీలించి, తీర్పు చెప్పిన న్యాయమూర్తి బెంచ్ కు కేసును అప్పజెప్పితే , కొంచెం సునాయసంగా ఉంటుంది. అలా కాకుండా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కేసును స్వీకరించి, తాను పరిశీలించే వరకు నిందితుడిని అరెస్టు చేయవద్దని అంటే, కేసు విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉంది. గతంలో ఆర్థిక నేరాభియోగాల కేసులో A 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాను దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను పూర్తిగా విన్న తర్వాత, 11 నెలల అనంతరం పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సహజంగానే బిజీగా ఉండవచ్చు. కేసులో ఆయనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తీర్పునిచ్చే విచక్షణ అధికారం ఉన్నదన్న రఘురామకృష్ణం రాజు, వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వలేదు. దీనితో, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

అవినాష్ రెడ్డి చెప్పకుండానే సాక్షి యాజమాన్యమే గుండెపోటు కథను సృష్టించిందా?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ ఫస్ట్ చార్జి షీట్ దాఖలు చేసిన తర్వాత సాక్షి దినపత్రిక యాజమాన్యం, కామ కథలను వండడం చూస్తుంటే, ఈ హత్య వెనుక సాక్షి యాజమాన్యం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షి యాజమాన్యం కు ఈ కేసుతో సంబంధం లేకపోతే, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పకుండా గుండెపోటు కథను సృష్టించారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉంటే ఇష్టం వచ్చిన కథనాలు రాసుకోవాలని, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. సిబిఐ ని తన విచారణను తాను చేసుకోనివ్వాలి. సాక్షి దినపత్రిక కథనాల వల్ల ప్రజల్లో పార్టీ చులకన అవుతుంది. సాక్షి దినపత్రిక యాజమాన్యం కంగారుపడి పేజీలకు పేజీలకొద్దీ అక్రమ సంబంధాల కథనాలను సృష్టించడం హాస్యాస్పదంగా ఉంది.

70 ఏళ్ల వయసులో ఒక మనిషి మహా అయితే ఒక్క మహిళతో సంబంధం పెట్టుకొని ఉంటే పెట్టుకుని ఉండవచ్చు. అంతేకానీ కనిపించిన ప్రతి మహిళతో సంబంధాలను అంటగడతారా?, సిగ్గు లేదా? మీ కుటుంబాన్ని మీరే కించపరుచుకుంటారా?, ఇటువంటి కుటుంబ నాయకత్వం లోనా తాము పనిచేస్తున్నదని ప్రజలు అసహ్యించుకోరా?, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారా? అంటూ రఘురామకృష్ణం రాజు ఫైర్ అయ్యారు. వైయస్ వివేకా హత్య కేసులో సాక్షి యాజమాన్యం ప్రమేయం ఉంటే చెత్త రాతలు రాసుకొండి. కానీ ప్రజల్లో పార్టీ రోజుకింత డౌన్ అవుతోంది. ప్రజల్లో పార్టీ నవ్వుల పాలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలన్న ఉద్దేశంతో వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు నాలుగు లక్షల కాఫీలను అమ్ముకుంటున్నారు. వైయస్ వివేక హత్యపై నిన్నటి వరకు కడప పులివెందుల ప్రజలకు ఉన్న అనుమానాలు సరిపోదన్నట్లుగా సాక్షి దినపత్రికలో రాస్తున్న కథనాలను చూసి, నేడు రాష్ట్ర ప్రజలందరికీ అదే అనుమానం కలుగుతుంది .

ఇప్పటికైనా ఈ చెత్త కథనాలు, అక్రమ సంబంధాల కథనాలను వండి వార్చడం ఆపివేయాలి. లేకపోతే పార్టీకే నష్టం. పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నాలుగు మంచి మాటలు చెబుతున్నాను. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మాదిరిగా తనకు శాపవిమోచనం కలిగిస్తే ఈ పార్టీని కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. మంచి మాటలు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. రావణుడికి లంకలో ఉన్నంతవరకు విభీషణుడు మంచిని చెప్పాడు. లంక నుంచి బహిష్కరించిన తర్వాతే మంచిని చెప్పలేకపోయాడు. అలాగే లంక వంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనని బహిష్కరిస్తే తాను కూడా మంచి మాటలు చెప్పే అవకాశం ఉండదన్నారు.

సిబిఐను మేనేజ్ చేసే శక్తి చంద్రబాబు నాయుడుకే ఉంటే జగన్ ను జైలులో పెట్టించేవారు కాదా?
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) ని మేనేజ్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఉండి ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో జైల్లో పెట్టించి ఉండేవారు కాదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కడప జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్సీ సహకారంతో, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో కలిసి తనను వైఎస్ వివేక హత్య కేసులో ఇరికించేందుకు సునీత కుట్ర పన్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… చంద్రబాబు నాయుడు కి అంతటి శక్తి ఉంటే, 12 ఏళ్లుగా ఆర్థిక నేరాభియోగాల కేసులో సిబిఐ నోరు విప్పక పోయినప్పటికీ ఊరుకొని ఉండేవారా? అని నిలదీశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తనని తొలుత అనుమానితుడిగా పేర్కొని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు నిందితుడిని చేశారంటున్నా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై ఆధారాలు ఉన్నాయని సీబీఐ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. బెంగళూరులో ని కొంతమంది వజ్ర వ్యాపారులతో కలిసి వైయస్ వివేకా, వ్యాపారం చేశారట. వారి భార్యలతోనూ వైఎస్ వివేకాకు సంబంధాలు ఉన్నట్లుగా అవినాష్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అవినాష్ రెడ్డి ఏమైనా బెడ్ రూమ్ లో దూరి చూశారా?, మరి అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు. సూటి కేసు విద్యలు ఫలించాయని అనుకున్నారు కానీ డామిట్ కథ అడ్డం తిరగడంతో, తండ్రి తర్వాత కొడుకును కూడా అరెస్టు చేస్తారని రెండు ఫుల్ పేజీల అఫిడవిట్ తో కూడిన పిటిషన్ దాఖలు చేశారన్నారు.

LEAVE A RESPONSE