– రిషికొండ గదులు చూసి ఆశ్చ్య్రపోయిన పవన్
– సీలింగ్ ఊడి నీళ్లు లీకైన దృశ్యంతొ విస్మయం
– అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే
– రిషికొండ ప్యాలె స్ను పరిశీలించిన పవన్ కల్యాణ్
విశాఖ: విశాఖలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న రిషికొండ ప్యాలెస్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించారు.
భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ .. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని..ఇప్పుడు ఈ కొత్త భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని పవన్ కల్యాణ్‌కు వివరించారు.
ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది అని వ్యాఖ్యానించారు. రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు.
అప్పుడే పగుళ్లా?
కాగా పవన్ రిషికొండ ప్యాలెస్ గదులు పరిశీలిస్తున్న సందర్భంలో, పైన ఉన్న సీలింగ్ ఊడి కిందపడటం పైనుంచి నీళ్లు లీక్ కావడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఈవిధ ంగా దుర్వినియోగం చేయడం విచారకరమన్నారు.