Suryaa.co.in

Editorial

‘పువ్వు’తో పొత్తు లాభమా? నష్టమా?

– ఏపీలో బీజేపీపై జనంలో వ్యతిరేకత
– విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్‌పై ఉడుకుతున్న ఉత్తరాంధ్ర
– ‘హోదా’పై చేతులెత్తేసిన వైనంపై యువత అసంతృప్తి
– అమరావతి చావుకు కేంద్రమే కారణమన్న భావన
– మూడు జిల్లాల్లో అమరావతి ప్రభావం
– పోలవరం ఆలస్యానికి కేంద్రమే కారణమన్న ఆగ్రహం
– ఐదు జిల్లాలపై పోలవరం ప్రభావం
– రాష్ట్రంలో మతమార్పిళ్లు పెరుగుతున్నాయని హిందువుల ఫైర్
– దానిని అడ్డుకోవడంలో బీజేపీ విఫలమైందన్న ఆగ్రహం
– కేంద్ర మద్దతుతోనే జగన్ వెళుతున్నారన్న భావన
– రాష్ట్రం అప్పులపాలవడానికి కేంద్రమే కారణమన్న అభిప్రాయం
– హైదరాబాద్ సెటిలర్లపైనా ఈ ప్రభావం ఎక్కువే
– అందుకే ‘కమలం’ బదులు ‘కారు’ ఎక్కుతున్న ఆంధ్రా సెటిలర్లు
– తొలిసారి మోదీ సర్కారుపై క్త్రైస్తవ-ముస్లింలలో వ్యక్తిగత ఆగ్రహం
– ఎప్పుడూలేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్న భావనే దానికి కారణం
– సొంతగా వందమందిని సమీకరించలేని బీజేపీ నేత సంఖ్యనే ఎక్కువ
– పేపర్ టైగర్లతో ఇంతవరకూ ఏపీలో ఎదగని పువ్వు పార్టీ
– జనసేన -కమలం కలిస్తే ‘గ్లాసు’ పగలడం ఖాయం
– మైనారిటీలు దూరమయ్యే ప్రమాదం
– టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నా ‘సైకిల్’కు నష్టమే
– కమలంతో కలిస్తే ఏపీలో ఎవరికైనా కష్టమే
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ముల్లు వచ్చి ఆకుమీద పడినా, ఆకు వచ్చి ముల్లు మీద పడినా నష్టం ఆకుకే’’.. ఈ సామెత ఇప్పుడు, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న, ఏ పార్టీకయినా వర్తిస్తుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు కూడా అవే!

ప్రస్తుతం కమలంతో జనసేన ఒక్కటే మిత్రపక్షంగా ఉంది. ఎన్డీఏ భేటీకి జనసేనాధిపతి, పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఇక టీడీపీ-బీజేపీ కలసి నడుస్తాయన్నది, గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న చర్చ. అందుకు టీడీపీ కూడా సుముఖంగా ఉందన్నది మరో ప్రచారం. మొత్తానికి టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తాయన్నది తీవ్రంగా జరుగుతున్న చర్చ.

అయితే ఏపీ ప్రజల మనోగతం, బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది. విభజన హామీలు నెరవేర్చడంలో, కేంద్రంలోని బీజేపీ విఫలమయిందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రావలసిన పెండింగ్‌ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి కీలక అంశాలలో పెద్దమనిషి పాత్ర పోషించి, ఆ సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రెండు రాష్ర్టాల పెద్దలనూ కూర్చోబెట్టి, సమస్యలు పరిష్కరించే బదులు.. ‘తన్నుకుచావండి తమాషా చూస్తా’నన్నట్లుగా వ్యవహరిస్తోందని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి న్యాయం చేయడంలో విఫలమైందన్నది ప్రజల భావనగా కనిపిస్తోంది.

ఇక విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిథిలోని ఉత్తరాంధ్ర ప్రజలు.. ప్రతిష్టాత్మకంగా భావించే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ వ్యవహారంలో, బీజేపీ ముద్దాయిగా నిలిచింది. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే, రాష్ట్రంలోని బీజేపీ నేతలు అడ్డుకోవడంలో విఫలమయ్యారని, ఉత్తరాంధ్ర ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు.

అటు రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నిలబెట్టుకోలేని బీజేపీని.. ఎందుకు ఆదరించాలన్నది, ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు సంధిస్తున్న ప్రశ్న. ఈ ఆగ్రహంతోనే.. గతంలో గెలిపించిన బీజేపీ నేత మాధవ్‌ను, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. బీజేపీపై ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహం, ఏ స్థాయిలో ఉందో ఇంతకుమించిన ఉదాహరణలు.. మరేమీ అవసరం లేదని చెబుతున్నారు. విశాఖ స్టీల్‌, రైల్వే జోన్‌ ప్రభావం మూడు జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.

ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్యాకేజీలతో సరిపెట్టి.. అందులో కూడా కోతలు విధించిన బీజేపీ వైఖరి వల్ల, రాష్ట్రం నష్టపోయిందన్న భావన విద్యాధికుల్లో కనిపిస్తోంది. హోదా వస్తే వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయన్న ఆశ, వారిలో చాలాకాలం నుంచి ఉంది. దానికి అప్పట్లో జరిగిన ప్రచారమే కారణం.

ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిలిచిపోవడానికి సీఎం జగన్‌ ఎంత కారణమో, ఆయనను ప్రొత్సహిస్తున్న కేంద్రంలోని బీజేపీ కూడా, అంతే కారణమన్న అభిప్రాయం జనంలో పాతుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు ప్రభావం, నాలుగైదు జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది.

రాజధాని లేని రాష్ట్రంగా మారడంలో జగన్‌ కంటే.. ఎక్కువ పాపం బీజేపీదేనన్న భావన, రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని.. రాజధానిగా కొనసాగించకుండా, మూడు ముక్కలు చేస్తానన్న జగన్‌ ప్రకటనల వెనుక కేంద్ర ప్రోత్సాహం ఉందని, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్న పరిస్థితి. రాజధాని విషయంలో బీజేపీ నాయకులు వేస్తున్న పిల్లిమొగ్గలు, చేస్తున్న ప్రకటనలను వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.

అయితే పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి అగ్రనేతలు.. తమ ప్రకటనలతో నష్టనివారణ ప్రయత్నిస్తున్నా, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీగానీ, పార్టీ అధ్యక్షుడు నద్దా గానీ.. ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని, ఇప్పటిదాకా ప్రకటించకపోవడమే దానికి కారణం.

అమరావతి నుంచి రాజధానిని ఎవరూ కదిలించలేరని, తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూడా అమరావతినే రాజధానిగా తీర్మానం చేసిన విషయాన్ని సత్యకుమార్‌, సుజనాచౌదరి తరచూ గుర్తుచేస్తున్నారు. మూడు జిల్లాలపై అమరావతి ప్రభావం విపరీత ంగా ఉంది. బీజేపీ-వైసీపీకుమ్మక్కు రాజకీయాల వల్ల, ‘మీది రాజధాని లేని రాష్ట్రం’ అని .. పక్క రాష్ర్టాల మంత్రులతో ఎగతాళికి గురవుతున్న, అవమానకర పరిస్థితి ఏర్పండిందని వాపోతున్నారు.

ఇక రాష్ట్రం అప్పులపాలయ్యేందుకు.. కేంద్రంలోని బీజేపీ ప్రధాన కారణమన్న భావన విద్యాధికులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కనిపిస్తోంది. తమ రోజువారీ జీవితంలో , మీడియా-సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే ఈ వర్గాలన్నీ.. బీజేపీ ప్రభుత్వం అప్పులు ఇస్తున్నందునే, జగన్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్న అభిప్రాయంతో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం.. తెలంగాణ మాదిరిగా కఠినంగా ఉంటే, జగన్‌ ప్రభుత్వం అప్పులు చేసే అవకాశం ఉండదన్నది వారి భావనగా కనిపిస్తోంది.

ఇలాంటి భావన హైదరాబాద్‌లో నివసించే సెటిలర్లపై విపరీతంగా కనిపిస్తోంది. నిజానికి అమరావతి, విశాఖస్టీల్‌ అంశాలు.. ఏపీ, ఆయా జిల్లాల్లో కంటే, హైదరాబాద్‌లో స్థిరపడిన వారిపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు, వారి వైఖరి స్పష్టం చేస్తోంది. జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక బీజేపీ ఉందన్న భావన, తెలంగాణలో స్థిరపడిన సెటిలర్లలో బలంగా నాటుకుపోయింది. జగన్‌ను బీజేపీనే వెనుక ఉండి నడిపిస్తోందన్న ఆగ్రహం బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో, 35 నియోకవర్గాలలో ప్రభావితం చేసే కమ్మ వర్గం.. జగన్‌ కంటే మోదీపైనే, ఎక్కువగా ఆగ్రహంగా ఉండటం ఆశ్చర్యం.

అటు ముస్లిం-క్రైస్తవుల్లో కూడా బీజేపీపై గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత కనిపిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై మితిమీరిన దాడులు జరుగుతున్నాయన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ప్రధానంగా యుపిలో జరుగుతున్న సంఘటనల ప్రభావం ఏపీ ముస్లింలపై ఎక్కువగా ఉన్నట్లు ముస్లిం సంస్థల ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే విచిత్రంగా అటు హిందువుల్లోనూ బీజేపీ నిర్లిప్త వైఖరిపై అసంతృప్తి కనిపిస్తుండటం విశేషం. అంతర్వేది రథం తగులబెట్టిన వైనంపై.. సీబీఐ ఇప్పటివరకూ విచారణ మొదలుపెట్టకపోవడంపై హిందూ సంస్థల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఉభయగోదావరి, విశాఖ, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మతమార్పిళ్లు వాయువేగంతో జరుగుతున్నాయి.

రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎప్పుడూలేనంత వేగంగా, క్రైస్తవ మతమార్పిళ్లు జరగుతున్నాయని బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రేక్ష పాత్ర పోషిస్తుండటాన్ని హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తాడేపల్లి వద్ద మతమార్పిళ్ల కోసం పుష్కరఘాట్‌ మాదిరిగా.. ఏకంగా ఒక బాప్టిజం ఘాట్‌నే నిర్మించడం వివాదాస్పదమయింది. దానిని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమర్ధించగా, కోర్టు ఆదేశాలతో ఘాట్‌ నిర్మాణం నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు, వైసీపీ సర్కారుపై ఏమాత్రం పోరాడకపోవడంపై, హిందువుల్లో అసంతృప్తి వ్యక్తమయింది. రాష్ట్రంలోని ఆలయాల పరిథిలో జరుగుతున్న, అన్యమత ప్రచారంపైనా బీజేపీ మౌనం.. హిందువులకు అసంతృప్తి కలిగిస్తోంది.

ఇక సంస్థాగతంగా బలంగా లేని బీజేపీ, ఇప్పటిదాకా తన బలం పెంచుకోవడంలో విఫలమయింది. మీడియాలో కనిపించే నేతలే తప్ప, జనంలో ఉండే నేతల సంఖ్య బహు స్వల్పం. అగ్రనేతలుగా చెప్పుకునే ప్రముఖులు ఏ ఎన్నికల్లో పోటీ చేయరు. పోటీ నుంచి తప్పుకుంటారు. వీరికి ప్రజల్లో బలం లేదు. సొంత వీధిలోనే పలుకుబడి కనిపించదు. క్యాడర్‌ పెంచుకునే ప్రయత్నాలు, పార్టీని విస్తరించాలన్న పట్టుదల వీరికి ఉండదు. ప్రధాని సహా, అగ్రనేతల సభలు జనంలేక వెలవెలపోవడానికి ఇదే కారణం.

ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ అయినా, రాజకీయంగా నష్టపోక తప్పని అనివార్య పరిస్థితి కనిపిస్తోంది. జనసేన అభిమానుల్లో ముస్లింల సంఖ్య ఎక్కువ. పట్టణ-గ్రామ స్థాయిలో కాయకష్టం చేసుకుని బతికే ముస్లిం యువత, ఎక్కువగా పవన్‌ అభిమానులే. రేపు బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తే, వారిపై ఈ అంశాలు కచ్చితంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

ఇక టీడీపీ-బీజేపీ కలయిక ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అది టీడీపీకి రాజకీయంగా నష్టంగానే భావించాలంటున్నారు. గత రెండు ఎన్నికల్లో దూరమైన ముస్లింలు, తిరిగి టీడీపీకి దూరమవుతున్నారు. వైసీపీ-బీజేపీ కలసి పనిచేస్తున్నాయన్న భావన ముస్లిం వర్గాల్లో బలంగా నాటుకుపోవడమే దానికి కారణం.

దళితుల్లో ఒక వర్గం టీడీపీ వెనుకే నడుస్తోంది. ఇటీవలి కాలంలో దళితులపై జరుగుతున్న దాడులతో, ఆ వర్గం వైసీపీకి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆ అంశంలో టీడీపీ దళిత నేతలు రెండేళ్ల నుంచి చేస్తున్న ప్రచారం ఫలించినట్లే ఉంది. కాపుల్లో కొంత జనసేన-మరికొంత టీడీపీ వైపు మొగ్గు కనిపిస్తోంది. క్రిస్టియన్లు, మతం మారిన దళిత క్రిస్టియన్లలో అధిక భాగం వైసీపీ వైపే ఉండగా, మిగిలిన వారు టీడీపీ వైపు ఉన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కలిస్తే అది టీడీపీకి నష్టం-బీజేపీకి లాభంగా మారవచ్చని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే సొంతగా ఒక్క సీటుతోపాటు, కనీసం రెండు స్థానాల్లో రెండో స్థానం కూడా దక్కించుకోలేని బీజేపీ.. పొత్తులో అయితే, గతంలో మాదిరిగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయంటున్నారు.

అయితే.. ఎన్నికల సమయంలో వైసీపీ దూకుడు, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాల నియంత్రణ, దొంగఓట్లు, శాంతిభద్రతల వంటి అంశాలలో బీజేపీ పొత్తు టీడీపీకి ఉపకరిస్తుంది. ప్రధానంగా టీడీపీని ఎన్నికల సమయంలో ఆర్ధికంగా ఆదుకునే పారిశ్రామికవేత్తలు, కంపెనీలపై దర్యాప్తుసంస్థలు దాడులు జరగకుండా, పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇంతకుమించి.. పువ్వు పార్టీతో పొత్తు వల్ల, టీడీపీ-జనసేనకు వచ్చే లాభమేమీ లేదన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.

LEAVE A RESPONSE