– హటాత్తుగా అమిత్‌షాను కలిసిన లోకేష్
– లోకేష్ వెంట కిషన్‌రెడ్డి, పురందేశ్వరి
– ముగ్గురితో అమిత్‌షా ముచ్చట్లు
– మంతనాల మర్మమేమిటి?
– గతంలో అమిత్‌షాతో బాబు ఒక్కరే భేటీ
– ఇప్పుడు లోకేష్‌తో కిషన్‌రెడ్డి, పురందేశ్వరి
– లోకేష్‌తో బీజేపీ అగ్రనేతల వెనుక ఆంతర్యమేమిటి?
– టీడీపీ-బీజేపీ పొత్తు పొడుస్తుందన్న సంకేతాలేనా?
– తెలంగాణ ఎన్నికల నుంచే పొత్తు బంధం మొదలు?
– కిషన్‌రెడ్డి-పురందేశ్వరి రాకతో బలపడుతున్న పొత్తు అనుమానాలు
– ఏపీతో సంబంధం లేని కిషన్‌రెడ్డి రాకతో తెలంగాణ పొత్తు ఖాయమేనా?
-తొలిసారి లోకేష్ వెంట పురందేశ్వరి
– బాబుపై అక్రమ కేసుల వివరాలు వెల్లడించిన లోకేష్
– సావధానంగా విన్న అమిత్‌షా
– బాబు ఆరోగ్యంపై అమిత్‌షా ఆరా
– మారుతున్న ఎన్నికల సమీక‘రణం’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకూ తాను మోదీ-షాల అపాయింట్‌మెంట్ కోరలేదని చెప్పిన టీడీపీ యువనేత లోకేష్.. హటాత్తుగా ఢిల్లీకి పయనమయి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. దానికితోడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి-ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కలసి, లోకేష్‌ను కేంద్రహోంమంత్రి వద్దకు తీసుకువెళ్లడం మరో సంచలనానికి తెరలేపింది. ఫలితంగా.. సహజంగానే పెండింగ్‌లో ఉన్న టీడీపీ-బీజేపీ పొత్తు పొడిచే చర్చకు కారణమయింది.
టీడీపీ యువనేత లోకేష్ , కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలవడం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే సంకేతాలకు కారణమయింది. సహజంగా లోకేష్ ఒక్కరే అమిత్‌షాను కలిస్తే, ఆ చర్చలకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. అది రొటీన్‌గానే మిగిలేది. కానీ.. లోకేష్‌ను బీజేపీ తెలంగాణ-ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వెంటబెట్టుకుని, అమిత్‌షాను కలవడమే సంచలనానికి కారణమయింది. దీనితో చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న, టీడీపీ-బీజేపీ పొత్తు బంధం మళ్లీ మొగ్గతొడిగేందుకు దోహదపడినట్టయింది.
మరికొద్దిరోజుల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా వారి చర్చలో భాగస్వామి కావడం, చర్చనీయాంశమయింది. సహజంగా ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కిషన్‌రెడ్డి కూడా ఆ చర్చలో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు అరెస్టు తర్వాత హైదరాబాద్, తెలంగాణలోని కమ్మ వర్గం- సెటిలర్లలో టీడీపీపై సానుభూతి వెల్లువెత్తుతోంది. వ్యక్తిగతంగా చంద్రబాబు ఇమేజ్ ఊహించనంతగా పెరిగిపోతోంది. టీడీపీ నేతల ప్రమేయం-భాగస్వామ్యం లేకుండానే సెటిలర్లు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి, ర్యాలీలు నిర్వహించడం, వాటిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా అనివార్యంగా పాల్గొంటున్న పరిస్థితి.
ఇటీవల హైదరాబాద్‌లోని ఐటి ఉద్యోగులు భారీ సంఖ్యలో ఒకచోట చేరి ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత వారు భారీ సంఖ్యలో వాహనాల ద్వారా రాజమండ్రికి ర్యాలీగా వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయిన విషయం తెలిసిందే. ప్రధానంగా.. బాబు అరెస్టు వెనుక మోదీ ఉన్నారని, ఆయనే జగన్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహం బలంగా ఉంది.
ఇది టీడీపీకి ఎన్నకల్లో పెద్దగా ఉపయోగపడకపోయినప్పటికీ.. కాంగ్రెస్‌కు పరోక్షంగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని, తెలంగాణ బీజేపీ నాయకత్వం పసిగట్టింది. వారంతా బీఆర్‌ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిర్ణయించుకున్న సమాచారంతో బీజేపీ తెలంగాణ నాయకత్వం అప్రమత్తమయింది. నిజానికి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడం, కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న బండి సంజయ్‌ను తొలగించడంతో.. బీఆర్‌ఎస్-బీజేపీ ఒకటేనన్న భావ న క్షేత్రస్థాయిలో స్థిరపడింది.
దానితో గత కొద్దికాలం వరకూ బీఆర్‌ఎస్ -బీజేపీ మధ్య ఉన్న పోటీ కాస్తా.. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య స్థిరపడింది. అటు బీఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీని పక్కనపెట్టి, కాంగ్రెస్‌పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి. దానితో తెలంగాణ ఎన్నికల యుద్ధంలో బీజేపీది, ‘పట్టించుకోనవసరం లేద’న్న సంకేతాలిచ్చినట్టయింది. ఇది పార్టీకి నష్టమని భావించిన బీజేపీ నాయకత్వం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ఢిల్లీ పార్టీకి వివరించినట్లు తెలుస్తోంది.
అటు చంద్రబాబు అరెస్టుతో ఏపీలో కూడా టీడీపీకి సానుభూతి పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానంగా తటస్థులు-విద్యావంతులు-యువకుల్లో బాబుపై సానుభూతి పెరుగుతోంది. బాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో వస్తారనుకున్న పార్టీ క్యాడర్.. పార్టీ నాయకత్వం ఊహించినంత స్థాయిలో కనిపించలేదు. దానికి పోలీసు కేసులతోపాటు, ఓటర్ల తనిఖీ కార్యక్రమాల్లో మునిగి ఉండటమేనని పార్టీ నేతల వాదన.
అయితే.. ఏ పార్టీకీ సంబంధం లేని తటస్థులు, వృద్ధులు సైతం రోడ్డుపైకొచ్చి ఆందోళనలో పాల్గొనడాన్ని, బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించింది. దానికితోడు కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి వంటి ప్రముఖులు.. ఏపీలో వాస్తవ రాజకీయ పరిస్థితులు ఇటీవలి కాలంలో జాతీయ నాయకత్వానికి వివరించారు.
ప్రధానంగా సుజనాచౌదరి.. ఏపీలో వాస్తవ పరిస్థితి వివరించి, ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి జరగబోయే నష్టాన్ని నిర్మొహమాటంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈసమయంలో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, ఈ నాలుగున్నరేళ్లలో పార్టీ చేసిన పోరాటాలు, కార్యక్రమాలు వృధా అవుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు కావాలనుకునే కొత్త తరం నేతలకు నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిస్థితిలో టీడీపీ యువనేత లోకేష్.. ఎవరూ ఊహించని విధంగా హటాత్తుగా ఢిల్లీకి వెళ్లి, తెలంగాణ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలోనే అమిత్‌షాను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఏపీ-తెలంగాణ బీజేపీ అధ్యక్షులే లోకేష్‌ను అమిత్‌షా వద్దకు తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. దీనితో సహజంగానే టీడీపీ-బీజేపీ పొత్తుపై మరోసారి చర్చకు తెరలేచింది. అయితే.. తొలుత తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కలసి పోటీ చేసే అవకాశాలున్నట్లు.. అమిత్‌షాతో భేటీ తర్వాత పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చంద్రబాబు-అమిత్‌షా భేటీలో కూడా, ఇదే చర్చ జరిగిందని, అప్పుడు చంద్రబాబు తన అభిప్రాయం చెప్పకపోవడమే.. ఇన్ని పరిణామాలకు కారణమన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.
తెలంగాణలో 35 నియోజకవర్గాలకుపైగా కమ్మ వర్గం, సెటిలర్ల ప్రభావం ఉన్న నేపథ్యంలో.. టీడీపీతో పొత్తు తమకు లాభిస్తుందని, తెలంగాణ బీజేపీ సీనియర్లలో ఒకవర్గం చాలాకాలం నుంచి బలంగా వాదిస్తోంది.
గత ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు వల్లనే 5 సీట్లు గెలిచామని గుర్తు చేశారు. బీజేపీ ఎప్పుడూ గెలవని చోట తొలిసారి విజయం సాధించడానికి టీడీపీతో పొత్తే కారణమన్నది వారి వాదన. అయితే పార్టీలో టీడీపీని వ్యతిరేకించే ఒక వర్గం మాత్రం, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో కలసి ఎలా పోటీచేస్తామని వాదిస్తోంది.
అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా, నిజామాబాద్-నల్లగొండ-వరంగల్-మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాక్షికంగా ఉన్న సెటిలర్లు, కమ్మ వర్గం దన్నుతో, పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనా తెలంగాణ బీజేపీ సీనియర్లలో లేకపోలేదు.
దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నేత ఒకరు.. కొద్దికాలం క్రితమే, బీజేపీ జాతీయ అగ్రనేత ఒకరి వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన సెటిలర్లు-కమ్మ వర్గ ప్రభావిత నియోజకవర్గ వివరాలను కూడా అందించినట్లు సమాచారం. దానిపై కసరత్తు చేసి, మరికొంత సమాచారం సేకరించుకుని, టీడీపీతో పొత్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
సో.. తెరవెనుక గత కొద్దికాలం నుంచి టీడీపీ-బీజేపీ అగ్రనేతలు చేసిన కసరత్తు.. చంద్రబాబు అరెస్టు తర్వాత ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నమాట.