Suryaa.co.in

Features

కర్ణుడిని అనైతికంగా చంపడం శ్రీకృష్ణుడికి ధర్మమా?

-కల్కి సినిమా విడుదల అయిన దగ్గర్నుంచి అర్జునుడు గొప్పవాడా? కర్ణుడు గొప్పవాడా? అన్నీ సంవాదం నడుస్తోంది ఇద్దరిలో ఎవరు గొప్ప?
-సినిమాలు, సీరియళ్ళలో ఎలా చూపించినా, ఎవరు ఏమిటనేది వ్యాసభారతం ఆసాంతం చూస్తేనే తెలుస్తుంది

కర్ణుడు నిరాయుధుడు కాదు, కృష్ణుడు అనైతికంగానూ చంపించలేదు.
కర్ణుడు అర్జునుడు 17వరోజున ఒక్క ప్రహరం అంటే 3 గంటలు ముఖాముఖి పోరాడారు. యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరు వాళ్ళిద్దరి మధ్య కలుగజేసుకోలేదు. కర్ణుడి రక్షక సైనికులను అర్జునుడు తుడిచేసాడు. తర్వాత ఇద్దరి మధ్యన పోరు బాగా సాగింది.

యుద్ధం ఆఖరు క్షణాలలో, ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు. అప్పుడు అర్జునుడు రౌద్రాస్త్రాన్ని సంధిస్తాడు. ఇక్కడే కర్ణుడి రథచక్రం బ్రాహ్మణ శాపం వల్ల భూమిలో ఇరుక్కుంది.

ఓ పార్థా ఆగాగు, రథచక్రాన్ని ఎత్తుతాను, నీకిది ధర్మం కాదంటాడు. అర్జునుడు కాసేపు ఆగుతాడు. కృష్ణుడు మాత్రం ఆగలేదు –

ఏం రాధేయ, ఏకవస్త్రయై రజస్వలయైన ద్రౌపదిని సభామధ్యమునకు ఈడ్చినప్పుడు ఏమైనది ఈ ధర్మము? ఆమెతో మరో భర్తను పొందమని దుర్భాషలాడినప్పుడు ఏమైనది ఈ ధర్మము? భూమిమీద నిరాయుధుడై ఉన్న ఒక్క బాలుణ్ణి, అభిమన్యుడిపై మీ ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసినపుడేమైనది నీ నీతి? అని అర్జునుడిని అస్త్రాలు వేయమన్నాడు కృష్ణుడు. కృష్ణుని మాటలు విన్న రాధేయుడు సిగ్గుతో తల దించుకున్నాడు.

మళ్ళీ యుద్ధం సాగింది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు మేఘాలను సృష్టించాడు, అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటిని తొలగించాడు. కర్ణుడు అర్జునుడి ఛాతిపై కొట్టగా అర్జునుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు. మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టి విఫలమైనాడు.

అర్జునుడు త్వరగా మూర్ఛనుండి కోల్కున్నాడు. ఈ శత్రువు శిరస్సును నీ బాణముతో ఛేదింపుమర్జునా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కర్ణుడి ధ్వజాన్ని కూలగొట్టాడు. మహేంద్రవజ్రానలదండ సన్నిభమైన అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తరువాత, భూమి కంపించడం ప్రారంభించింది, ఆకాశం అద్భుతమైన శబ్దాలతో నిండిపోయింది.

“నేను తపస్సు నిజంగా ఆచరించిన వాడనైతే, గురువులను పెద్దలను సేవించి సంతోషింపచేసిన వాడనైతే, సదా పెద్దల వాక్కులను పాలించినవాడనైతే, ఈ అస్త్రము కర్ణుడిని చంపి, నాకు విజయము చేకూర్చుగాక” అని పిడుగుపాటు శబ్దంతో అర్జునుడు ఆ శరాన్ని విడిచిపెట్టాడు. ఆ అంజలికాస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరి పడింది. అతని శరీరం మిగతా భాగంలోంచి ఆతని ప్రాణాలు విడిచి సూర్యమండలంలో కలిసిపోయాయి. కర్ణుడి శరీరం నేలకొరిగింది.

ఇందులో అనైతికమేముంది? కర్ణుడు నిరాయుధుడా? కాదు. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు. భూమిలో ఇరుక్కున్న రథాంగం శాప ప్రభావాన ఇరుక్కుందని, బయటకి రాదని కర్ణుడికి కూడా తెలుసు. ఐనా అదే ఎత్తాడు.

కృష్ణుడు సమయమివ్వడని తెలుసు, ఐనా యుద్ధం మాని రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు. అతని ధ్వజం నేలకూలింది, ఐనా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు.

యుద్ధమంటే చిన్నపిల్లలాట కాదు, ఆగాగు నేను మెల్లగా రథమెక్కాక మనం మళ్ళీ ఆడుకుందామే అనటానికి. రథం మీద లేనివాడితో యుద్ధం చేయకూడదని నియమము లేదు.

నేల మీదనే నిల్చుని పోరాడవచ్చు, కర్ణుడంతటి వాడికి అదేం లెక్క కాదు, ఐనా రథ చక్రాన్నే ఎత్తుతూ ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడు చేయలేదా? ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసిననాడు అభిమన్యుడు నేల మీద లేడా? అర్జునుడు 14వ రోజున కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేసాడు. ఆ సమయంలో అర్జునుడు, అభిమన్యుడు కర్ణుడులా ఏడవలేదే?

అర్జునుడు కర్ణుడుని అనైతికంగా చంపలేదు. తప్పు ఖచ్చితంగా కృష్ణార్జునులది కాదు. కర్ణుడి చావుకు కర్ణుడే కారణం..అది ఎప్పటికైనా అనివార్యమైనదే.

మహాభారత కాలంలో ఉన్న కొద్దిమంది ఉత్తమ విలువిద్య నిపుణుల్లో కర్ణుడు కూడా ఒకడు. ఒక వ్యక్తిగా అతనిలో గుణాలు ఉన్నాయి, దోషాలు కూడా ఉన్నాయి. కర్ణుడు అస్త్ర విద్యలో నిపుణుడే ఐనా, అతని అస్త్రములన్నీ శాపగ్రస్తములు. నేర్చుకున్న విద్యలు కపటంతో నేర్చుకున్నాడు. అటువంటి విద్య ఎన్నటికీ అక్కరకు రాదు. కర్ణుడు స్వతహాగా గర్వి, అభద్రతాపరుడు. అర్జునుడి పట్ల అసూయతో విద్యలనభ్యసించాడు.

వయసులో కర్ణుడు పాండవులందరికన్నా కనీసం పదేళ్ళు పెద్దవాడు. వయసులో అంత చిన్నవాడైన అర్జునుడితో అతని పోటీ, ఏదో చిన్నపిల్లాడితో కాలేజీ కుర్రాడు వైరం పూనినట్టు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ కాలపు సాటిలేని విలుకాడు అనిపించుకోవాలన్నది కర్ణుడి ధ్యేయం, కానీ అందుకోసం అంత చిన్నవాడైన అర్జునుడిని దాటాలి. ఈ అసూయే కాలంలో వైరంగా మారింది. తనను తాను సాటిలేని విలుకాడుగా నిరూపించుకోవడం కోసం దుర్యోధనుడితో స్నేహం అతనికి ఆసరా అయ్యింది.

కర్ణుడు, అర్జునుడు ఇద్దరు ద్రోణ-కృపాచార్యుల వద్ద చదువుకున్నవారే. అక్కడ అర్జునుడు విద్యలో పైకెదగడానికి ప్రయత్నిస్తే, ఆ అర్జునుడిని చూసి అసూయ పెంచుకున్నవాడు కర్ణుడు. కానీ అర్జునుడు మాత్రం ఏనాడు కర్ణుడు గురించి అంతగా ఆలోచించినట్టు కనపడదు. విద్యంటే అమితమైన ప్రేమ, ఆ విద్యలో రాణించాలి. ఆ విద్యలకై గురువుల కడ ఒదిగి ఉండు వినయము, ఆ విద్య నేర్చు సమయంబున ఎనలేని దీక్ష, కృషి అతణ్ణి మరో స్థాయిలో నిలబెట్టాయి.

పరశురాముడి తర్వాత జ్ఞానార్జన, అస్త్రసముపార్జన కర్ణుడు నిలిపివేసాడు, కానీ అర్జునుడు ఆగలేదు. దేవతలు, ఇంద్రుడు, వసువులు, అగ్నివేశుడు, కృష్ణుడు, శివుడు ఇలా ఎందరివద్దనో కృషితో, తపస్సుతో ధనుర్వేదమును, సకలాస్త్రములను సంపాదించాడు. ‘అర్జునుడు దగ్గరున్నన్ని అస్త్రములు ఎవ్వరి దగ్గర లేవు. అతణ్ణి నిర్జించడం మీకెవరికి సాధ్యం కాదు. ముల్లోకాల్లో అతణ్ణి జయించగలిగేవారు లేరు.’ అని పరశురాముడు సభామధ్యమున తన శిష్యులైన భీష్మద్రోణకర్ణులు వింటుండగా బాహాటంగా ఉద్యోగపర్వంలో ప్రకటించాడు.

మనకొక విద్య వచ్చినా దానిని నిరూపించుకోవటానికి సరైన అవకాశాలు రావాలి. చదివిన చదువుకు ప్రశ్నాపత్రంలాంటివి అవన్నీ. అక్కడే మన ప్రతిభ బయటపడుతుంది. అర్జునుడుకి, కర్ణుడుకి సమంగా వచ్చిన అవకాశాలు – ద్రుపదుడి పరాభవం, ద్రౌపది స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తరగోగ్రహణం. ఈ అన్ని సందర్భాల్లో కర్ణుడు విఫలమయ్యాడు, అర్జునుడే రాణించాడు.

వ్యక్తిత్వంలో, ధర్మాచరణలో కూడా అర్జునుడే కర్ణునికన్నా అధికుడు. ద్రౌపది వస్త్రాపహరణం, ఉత్తరగోగ్రహణం వంటివి అందుకు తార్కాణాలు. యతో ధర్మస్తతో కృష్ణః అంటారు, భగవానుడు అర్జునుడు వైపు ఉన్నప్పుడే తెలిసింది కదా ఎవరు ధర్మాత్ముడో.

అర్జునుడు చేసినన్ని యుద్ధాలు, అనుభవం కర్ణుడుకు లేదు. యుద్ధవిద్యలో అర్జునుడికి తెలియని విషయం లేదు. యుద్ధవిద్యలో కర్ణుడుకి తెలియని మరొక అంశం వ్యూహరచన, దాని భేదన. అర్జునుడుకి తెలియని వ్యూహ రచన-భేదము లేదు. అందుకే పద్మవ్యూహం నాడు అర్జునుడు లేకుండా చూసుకోవలసి వచ్చింది.

అర్జునుడి పట్ల కర్ణుడి వైరం ఎంతటివరకు వెళ్ళిందంటే, పాండవులు తన తమ్ముళ్ళని శ్రీకృష్ణుడు ద్వారా తెలిసాక, నలుగురు పాండవుల్ని చిక్కినా విడిచిపెడతానని మాటిచ్చాడు కానీ అర్జునుడి గురించి మాత్రం మాటివ్వలేదు. కురుక్షేత్రం ముందటి వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కర్ణుడు ఒక్కసారి కూడా అర్జునుడుకన్నా మెరుగని నిరూపించుకో లేకపోయాడు.

అర్జునుడు స్వతహాగా సంయమశీలుడు, ఉగ్రంగా యుద్ధం చేయడం అతని లక్షణం కాదు. కానీ అభిమన్యుడు చనిపోయిన మర్నాడు యుద్దపు 14వరోజున చూడాలి అర్జునుడి ఉగ్ర రూపం. ఒకటి కాదు మూడు వ్యూహాలు – శకట, పద్మ, శుచి వ్యూహాలు ప్రవేశించి భేదించుకుని వెళ్తాడు జయద్రథుడి కోసం. ఆ రోజు పాండవులకెంత ముఖ్యమో కౌరవులకు అంతకన్న ఎక్కువ ముఖ్యమైనది. కానీ ఆరోజు అర్జునుడు కాలాగ్ని సముడు. అతన్ని ఆపడం దేవతలతో సహా ఎవ్వరి తరమయ్యేది కాదు. బీభత్సుః అనే నామం ఎందుకు వచ్చిందాని తెలుస్తుంది.

ఒంటిచేత్తో ఆనాడు 7 అక్షౌహిణుల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అర్జునుడి బాణపరంపరకు ఎదురుగా 2 మైళ్ళ వరకు ఒక్క సైనికుడు మిగిలేవాడు కాదు. ఆనాడు భూరిశ్రవసుడు, కర్ణుడు, అశ్వత్ధాముడు, శల్యుడు, వృషసేనుడు, కృపుడు, ఇందరు మహారథులు జయద్రథుడికి కాపలా ఉన్నారు. వీళ్ళలో ఒక్కరు కూడా అర్జునుడుని ఆపలేకపోయారు.

ఒకసారి కాదు రెండు సార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు చావకుండా అశ్వత్ధామ కాపాడాడు. చివరకు జయద్రథుని అర్జునుడుకి వదిలేసి, అందరితో కలిపి కర్ణుడు కూడా యుద్ధభూమి నుండి పారిపోతాడు. అది అర్జునుడి అసలు పరాక్రమం.

ఇలా ఎంతైనా చెప్పొచ్చు. ఇక ఆఖరుగా కర్ణుడుకి అర్జునుడుకి కలిపి 17వరోజున జరిగిన యుద్ధం చాలా ముఖ్యమైనది. ఆనాడు యుద్ధానికి వెళ్ళే ముందు, తన సారథి శల్యుడుతో కర్ణుడు నేరుగా అన్న మాటలివి. Right from the horse’s mouth అంటారే, అటువంటి వాక్యాలివి –

ఓ శల్యా ! నేను విన్నంతలో, ఏ యోధుడు ఈ ప్రపంచం మొత్తం మీద అటువంటి మహారథుడు లేడని కీర్తి గడించాడో, అటువంటి అర్జునుడితో నేను ఈ రోజు ఆజికి దిగుతాను. శ్వేతాశ్వరథారూఢుడై రణభూమియందు చరించే ఈ అర్జునుడి చేతిలో నాాకీనాడు మృత్యువు తథ్యము. నా మరణంతో కౌరవుల మిగతా వీరులంతా నిశ్చితంగా సమసిపోతారు.

ఆ అర్జునుడి చేతులకు ఏనాడు చెమట పట్టదు, అవి ఏనాడూ వణకవు. అతని అస్త్రశస్త్రములు సుదృఢమైనవి. ఆతని చేతులు అమిత వేగముతో కదులుతాయి. అటువంటి పాండుపుత్రుడు అర్జునకు సమయోధుడు ఎక్కడ లేడు.

కర్ణుడు-అర్జునుడు ఇద్దరు మహాయోధులు, ఎవరి వ్యక్తిత్వాలు వారివి. కానీ కర్ణుడా? అర్జునుడా? అంటే మాత్రం అర్జునుడే అన్నిటా గొప్పవాడు. ఆ విషయాన్ని కర్ణుడు కూడా ఒప్పుకున్నాడు.

LEAVE A RESPONSE