-ఎమ్మెల్యేలపై నివేదికలు సిద్దం
-సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై జగన్ క్లారిటీ?
-అందరి చూపూ జగన్ భేటీ వైపే
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలకు తన టీంను సిద్దం చేసుకొనేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలతో పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలంతా మమేకం కావాలని పదే పదే చెబుతూ వచ్చారు. వారికి సమయం ఇచ్చారు. వారి పని తీరు.. గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగానే పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం పైన సీఎం జగన్ తేల్చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
కీలక సమావేశం
అందులో భాగంగా.. 19న సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మంత్రులతో పాటుగా పార్టీలోని ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీల పని తీరు పైన సమగ్ర నివేదికలతో సీఎం జగన్ ఈ సమావేశానికి హాజరు అవుతున్నారు. ఎమ్మెల్యేల్లో కొందరు పని తీరులో వెనుక బడి ఉన్నారని..వారు మెరుగు పరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని సీఎం ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో వారికి మరింత క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు హెచ్చరికలు చేసిన సీఎం జగన్..ఇప్పుడు ఎమ్మెల్యేల పని తీరు పైన తేల్చి చెప్పేందుకు సిద్దమయ్యారు.
ఎమ్మెల్యేల పని తీరు పై గ్రేడ్ ల వారీగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యేల్లో గత కేబినెట్ లో పని చేసిన మాజీ మంత్రులు ఇద్దరు గడప గడపకు ప్రభుత్వం నిర్వహణలో వెనుకబడి ఉన్నట్లుగా తేల్చారు. దీంతో పాటుగా గత సమావేశం తరువాత పని తీరు మెరుగు పరుచుకున్న వారి వివరాలు సైతం నియోజకవర్గాల వారీగా సీఎం వద్దకు చేరాయి. ఇక, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పార్టీ జిల్లా సమన్వయకర్తలు..ప్రతీ జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం నిర్దేశించనున్నారు. అదే విధంగా నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీ నుంచి పరిశీలకుడిని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు వీలుగా ఈ నియామకాలు చేపడుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకు తన వద్ద ఉన్న రేటింగ్ జాబితా ఆధారంగా సీఎం జగన్ ఫైనల్ వార్నింగ్ ఇవ్వనున్నారని ముఖ్యనేతల్లో చర్చ జరుగుతోంది.
ఆ తరువాత ఇక, వారికి సమాచారం ఇచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ఇక జిల్లాల పర్యటనకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో..వచ్చే ఎన్నికల కోసం సమీక్షలతో పాటుగా క్షేత్ర స్థాయిలోనూ వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వీటిపైన ఈ సమావేశంలో నేరుగా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.