( ఎంపీ విజయసాయిరెడ్డి)
ఉగాండాకు చెందిన మంత్రసాని (మిడ్వైఫ్), టీచర్, అడ్వొకేట్ ఇవా నంగాలో అనే మహిళ గురించి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపకుడు బిల్ గేట్స్ తన గేట్స్ నోట్స్ అనే బ్లాగ్ లో రాసిన తాజా పోస్టులో వర్ణించిన తీరు ఆసక్తికరంగా ఉంది. రైతు కుటుంబంలో పుట్టి ఆధునిక శిక్షణతో మంత్రసానిగా మారిన ఇవా తన దేశంలోని తోటి మహిళలకు ఎనలేని సేవలందిస్తున్నారట.
ఈ పోస్టు చదివాక తెలుగు ప్రాంతాల్లో పాత తరాలకు బాగా పరిచయమున్న మంత్రసాని పాత్ర గుర్తుకొచ్చింది. ఇప్పటి తరం పిల్లలు మంత్రసాని అంటే మంత్రగత్తె అని పొరపడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి గర్భిణుల ప్రాణాలు కాపాడే ఈ ప్రాథమిక వైద్య నిపుణుల గురించి తెలుసుకుందాం. అరవైడెబ్బయి ఏళ్ల క్రితం తెలుగునాట గ్రామాల్లో ప్రసవాలు ఇళ్లలోనే జరిగేవి. అలోపతీ వైద్యులు లేని రోజుల్లో పల్లెటూళ్లలో మంత్రసానులే మహిళలకు కాన్పులు చేసేవారు. గర్భిణిలు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా పిల్లలు కనడానికి ఈ సాంప్రదాయ మంత్రసానులు తోడ్పడేవారు.
ఇప్పుడు ఈ పనిని ఆస్పత్రుల్లో శిక్షణపొందిన నర్సులు లేదా నర్స్ కం మంత్రసానులు అంకితభావంతో చేస్తున్నారు. ఇంగ్లిష్లో మంత్రసానిని మిడ్ వైఫ్ అని పిలుస్తారు. రాష్ట్రంలో, దేశంలో ఎంబీబీఎస్ చదివాక గైనకాలజీ కూడా పూర్తిచేసిన వైద్యులు అందుబాటులో లేని రోజుల్లో మంత్రసానులే కాన్పులు చేసేవారు. ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు దేశంలోని ఆధునిక ఆస్పత్రుల్లో నర్సు–మిడ్ వైఫ్ పేరుతో 20 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. ఇంకా ఆగ్సియలరీ నర్స్ మిడ్ వైఫ్ (ఏఎన్ఎం–సహాయక నర్సు మంత్రసానులు) పేరుతో దాదాపు 9 లక్షల మంది మంది పనిచేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) అంచనా.
ప్రజారోగ్య రంగంలో మంత్రసానితనానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2023 చివరి నాటికి మరో 85 వేల మంది మిడ్ వైవ్స్ ను నియమించాలని నిర్ణయించింది. మంత్రసానుల సేవల వ్యవస్థను బలోపేతం చేయడానికి నిధులు సమకూర్చడం అనేది అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యసాధనకు పెట్టుబడులు పెట్టడం వంటిదని కూడా డబ్ల్యూ హెచ్ ఓ ప్రశంసించింది.
శిశు, బాలింత మరణాల నివారణకు తోడ్పడుతున్న మంత్రసానులు
ఇండియాలో ఏటా 35 వేల మంది గర్భంతో ఉన్నప్పుడు, కాన్పు సమయంలో, ప్రసవం తర్వాత మరణిస్తున్నారు. తల్లి గర్భంలో 2,72,000 శిశువులు కన్నుమూస్తుండగా, 5,62,000 మంది పసికందులు చనిపోతున్నారు. ఈ మరణాల్లో చాలా వరకు సంభవించకుండా ఉండాలంటే మంత్రసానుల సేవలు గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులుగా ఉన్న సమయం మొత్తంలో, ప్రసూతి, ప్రసవం తర్వాత స్త్రీలకు వెన్నంటి ఉండే మిడ్ వైవ్స్ నమ్మకస్తులైన స్నేహితులుగా సేవలందిస్తున్నారు.
ఆరోగ్యకరమైన గర్భధారణకు, ప్రసవం ఆడపడుచులకు సానుకూల అనుభవంలా ఉండడానికి మంత్రసానులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సురక్షితమైన, శక్తిమంతమైన మంత్రసానితనంతో 83 శాతం బాలింత మరణాలు, గర్భస్థ శిశు మరణాలు, ముక్కుపచ్చలారని నెలల పిల్లల చావులను నివారించవచ్చని ప్రపంచవ్యాప్తంగా మన అనుభవాలు చెబుతున్నాయి. మళ్లీ ఉగాండా మహిళ ఇవా నంగాలో విషయానికి వస్తే–ఆమె తన 23 ఏళ్ల సర్వీసులో అక్కడ అస్పత్రుల్లో ప్రసవాలు బాగా పెర గడానికి, కాన్పులు ఎలాంటి చిక్కులు లేకుండా పూర్తవడానికి ఎనలేని సేవలు అందించారు. మంత్రసానితనం అనేది ఇవాకు కేవలం వృత్తి మాత్రమే కాదు.
ఇది ఆమెకు జీవన సాఫల్యం. ‘నేను పెరిగి పెద్దయ్యాక మంత్రిసాని కావడానికి దేవుడు నన్ను సృష్టించాడు. మిడ్ వైఫ్ గా పనిచేయడానికి శిక్షణ పొందాను. ఇది నా డీఎన్యే లోనే ఉంది. అదే నేను,’ అంటూ బిల్ గేట్స్ తో అన్నారు ఇవా నంగాలో. ఇవా చేసిన అనన్య కృషి ఫలితంగా పేద ఆఫ్రికా దేశమైన ఉగాండాలో మంత్రసానుల సంఖ్యతోపాటు వారి పని పరిస్థితులు చాలా చాలా మెరుగయ్యాయని గేట్స్ తన బ్లాగులో వివరించారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్న ఇండియాలో కూడా మంత్రసానుల సేవలు ఇంకా విస్తరించి, ఈ ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేస్తే మహిళలకు, శిశువులకు ఎంతో మేలు జరుగుందనడంలో సందేహం లేదు.