Suryaa.co.in

Andhra Pradesh

అరబిందో గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా?

-ఎన్నో సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తుంటే… లేదని చెబితే నమ్మడానికి వెర్రి పప్పలమా?
-అరబిందో ఫార్మా వేరు… రియాల్టీ ఇతర సంస్థలు వేరు
-ప్రతిపక్ష నేతలను గౌరవించడం నేర్చుకోవాలి… హింసించడం మానుకోవాలి
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

అరబిందో గ్రూప్ యాజమాన్యానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఆర్ పీ ఆర్ సన్స్ అండ్ అసోసియేట్స్ జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులు పెట్టారు. దాన్ని ఎలా కాదంటారనీ నిలదీశారు.

అరబిందో రియాలిటీ, ట్రేడెంట్ లైఫ్ సైన్సెస్ యజమానులు పినాక శరత్ చంద్రారెడ్డి, పినాక రోహిత్ రెడ్డి లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ప్రజలందరికీ తెలుసున న్నారు . క్విడ్ ప్రోకో లో భాగంగా వారు ట్రేడెంట్ లైఫ్ సైన్సెస్ తరుపున జగతి పబ్లికేషన్ లో తొమ్మిది కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. గత 11 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో కొనసాగుతుందన్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డికి, అరబిందో గ్రూప్ కు సంబంధం ఏమిటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారని పేర్కొన్న ఆయన, అవును…సజ్జల చెప్పినట్లుగానే విజయసాయికి, అరబిందో గ్రూపుకు సంబంధ మేమీ లేదని అన్నారు . ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కూడా విజయసాయి కి సంబంధం లేదని చెప్పారు. దస్పల్లా భూములలో 90 వేల గజాల భూమిని అవియాన్ రియాల్డర్స్ పేరిట రోహిత్ రెడ్డి కొనుగోలు చేసినప్పుడే, పెళ్లయిన తర్వాత తన కూతురుతో తనకు సంబంధం ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. అటువంటప్పుడు అరబిందో గ్రూప్ కు, విజయసాయికి ఎలా సంబంధం ఉంటుందని అన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అరబిందో ఫార్మా వేరని, అరబిందో రియాల్టీ, ఆర్ పి ఆర్ సన్స్ అండ్ అసోసియేట్స్ వేరని అన్నారు. అరబిందో ఫార్మా కు, ఈ సంస్థలలో నయా పైసా వాటా లేదని పేర్కొన్నారు. ట్రేడెంట్ లైఫ్ సైన్సెస్, ట్రేడెంట్ కేమ్ ఫర్ లో పినాక కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ట్రేడెంట్ కేమ్ ఫర్ పాత్ర ఉందని పేర్కొన్నారు. అరబిందో ఫార్మా లిస్టెడ్ కంపెనీ అని, అరబిందో రియాలిటీ లిస్టెడ్ కంపెనీ కాదన్నారు.

కాకినాడ పోర్ట్, ఎస్ ఈ జడ్, రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 104, 108 అంబులెన్స్ సేవల నిర్వహణ బాధ్యత, కాకినాడ ఎస్ ఈ జడ్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ, హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలతో అరవిందో ఫార్మా కు సంబంధం లేదని, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో, అరబిందో రియాల్టీ, ట్రేడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలు అంగీకారాన్ని కుదుర్చుకున్నాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో, ఈ రెండు సంస్థలకు చెందిన మేజర్ ప్రమోటర్ అయిన పినాక శరత్ చంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లుగా అభియోగాలను ఎదుర్కొంటున్నారన్నారు.

ఈ మేరకు శరత్ చంద్రారెడ్డి పై ఈ డీ కేసులు నమోదు చేసిందన్నారు. అరబిందో గ్రూప్ కు, విజయసాయి రెడ్డికి సంబంధం లేదని తొందరపడి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారన్నారు. తన కూతురుతో, అల్లుడితో సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంతో పినాక శరత్ చంద్రారెడ్డికి, రోహిత్ రెడ్డికి మాత్రం సంబంధం ఉందని చెప్పారు. ఇన్ని సంబంధాలు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదంటే నమ్మడానికి మేమేమైనా వెర్రి పప్పలమా? అంటూ ప్రశ్నించారు. నిజాలు నిదానంగా బయటికి వస్తాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్రంలో సారా వ్యాపారంలో ఉన్నవారే… ఢిల్లీ సారా వ్యాపారం లోనే ఉన్నారు
రాష్ట్రంలో సారా వ్యాపారంలో ఉన్నవారే, ఢిల్లీ సారా వ్యాపారంలో కూడా ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆ సారా వ్యాపారానికి, ఈ సారా వ్యాపారానికి సంబంధం లేదంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. ఇవే అనుమానాలు అందరికీ వస్తాయన్నారు. ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడకుంటే మర్యాదగా ఉంటుందని సూచించారు. అక్కడేదో జరిగితే మాకేమిటి సంబంధం అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ఇతరులు ఎవరూ లేనట్టుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెట్టుబడులు, అరబిందో రియాల్టీ కి పోర్టుల నిర్మాణం కట్టబెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.

దావోసుకు వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తనతో శరత్ చంద్రారెడ్డిని తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ఇక శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కి చెక్కు అందజేసే సమయంలో పక్కనే విజయసాయిరెడ్డి కూడా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అరబిందో గ్రూప్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు స్పష్టంగా వెళ్లడైనప్పటికీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో ప్రెస్ మీట్ పెట్టించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోడల్లుడు తాత ఏర్పాటు చేసిన కాలేజీ ప్రహరీ గోడను కూల్చి, ఆ కాలేజీ తో సంబంధాలను చంద్రబాబు నాయుడుకు అంటగట్టారని, అలాగే భారత్ బయోటెక్ తోను సంబంధం కలిపారన్నారు. అరబిందో గ్రూప్ తో మాత్రం విజయ సాయి కి సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ లోని అరబిందో ఫార్మా బిల్డింగులోనే ఉన్న అడాన్ డిస్టలరీ కంపెనీలో బినామీలుగా కొనసాగుతున్న అనిరుద్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు పొద్దున లేచింది మొదలు మీ చుట్టే తిరుగుతుంటారన్నారు. మీ చుట్టూ తిరిగే మనుషులకే ఆర్డర్లు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.

ప్రధాని మోడీతో పవన్ కలయిక పెను సంచలనాలకు నాంది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ పెను సంచలనాలకు నాంది పలకనుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ప్రభుత్వం వెనక్కి పంపిందన్నారు. జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. 25 రోజుల అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కు విశాఖకు రావలసిందిగా ఆహ్వానం అందిందన్నారు. ప్రధానమంత్రి తో, పవన్ బేటి కానున్నారని తెలిపారు.

ప్రతిపక్షాల ఓట్లు చీలిపోనివ్వనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్నారు. ప్రతిపక్షాల ఓట్ల చీలికపై ఆధారపడి ఉన్న మనం, అరాచకాలు చేస్తే తుత్తునియలు అయిపోతామని తాను మొదటి నుండి హెచ్చరిస్తున్నానని అయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చోటు చేసుకున్న పరిణామాలను తమ పార్టీ పెద్దలు ఎవరైనా ఊహించారా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రాలో అన్నింటా తానే అయిన వ్యక్తిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను గౌరవించాలని, హింసించడం మానుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి విశాఖ సభకు ఆహ్వానించడాన్ని శుభ పరిణామంగా రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారన్నారు. సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావడాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించకపోవచ్చునని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సభకు హాజరైతే, ముఖ్యమంత్రి అక్కడ ఉండకపోవచ్చునని అన్నారు. గతంలో తాను కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సభకు తాను హాజరైతే, ఆ సభకు హాజరుకానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.

సభా వేదికపై ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ లు ఉంటే అందరూ వారినే చూస్తారన్నారు. పవన్ కళ్యాణ్ సభ వేదికపైకి హాజరైతే, ఆ సభా వేదికపై జగన్మోహన్ రెడ్డి ఉండరు… ఉండలేరని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి విశాఖ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతారని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. గతంలో ఎన్నో మార్లు ప్రధానమంత్రిని కలిశారని గుర్తు చేశారు. అప్పుడు ప్రధానిని ఏమి అడిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదన్నారు. 25 లోక్ సభ స్థానాలు అడిగితే,రాజ్యసభ తో కలుపుకొని ప్రజలు 31 స్థానాలను కట్టబెట్టారని తెలిపారు.

రాజ్యసభలో బిజెపి సరిపోను మెజారిటీ లేక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రంలో పది రాజ్యసభ స్థానాలకు కాను, 9 స్థానాలను మన పార్టీకే కట్టబెట్టారని గుర్తు చేశారు. రాజ్యసభలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న బిజెపిని ఇరుకున పెట్టి ప్రత్యేక హోదాను ఎందుకు సాధించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో గొంతు చించుకొని మాట్లాడారని, రేపు ప్రజల ముందు వినతి పత్రం అందజేసి… మరుసటి రోజు సాక్షి దినపత్రికలో అచ్చు వేసి చదువుకోమంటారేమోనని అపహాస్యం చేశారు.

ఇక విశాఖ బహిరంగ సభకు లబ్ధిదారులను తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసిందన్నారు. ఒకవేళ ఎవరైనా సభకు రాకపోతే, వారికి ప్రభుత్వము నుంచి అందే సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నట్లుగా తనకు సమాచారం అందిందని తెలిపారు. ప్రధాని మోడీ హాజరవుతున్న సభకు ప్రజలను తరలించవలసిన అవసరం లేదని, ప్రజలు స్వచ్ఛందంగానే హాజరవుతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సభలో పాల్గొంటే అదనంగా మరో లక్ష మంది సభా ప్రాంగణానికి చేరుకుంటారన్నారు.

ఫోటోల పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదు
ప్రజల వద్ద శాశ్వతంగా ఉండి భూమి హక్కును కల్పించే పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించాలనే నిర్ణయాన్ని రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఫోటోలో పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఒకవేళ సినీ నటుడు నారాయణ మూర్తి చిత్రాన్ని రూపొందిస్తే, అందులో ఈ భూమి మనదిరా… ఈ జాగా మనదిరా. ఈ పత్రం మనదిరా.. ఈ పంట మనదిరా. నడుమ జగన్ ఎవరు రా?.. వాడి ఫోటో ఏందిరా?? అనే గీతాన్ని పెట్టి ఉండేవారని అన్నారు. నారాయణమూర్తి కాకపోయినా ఇతర అభ్యుదయ కవులు అయినా ఈ తరహా పాట రాస్తే బాగుంటుందన్నారు. స్వతహాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఫోటోల పిచ్చి ఉందని అనుకోవడం లేదన్నారు. ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్లే, మెప్పుకోసం ఈ రకంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

గ్రీక్ మైథాలజీలో తనని తాను అతిగా ప్రేమించుకునే ఒక యువరాజు ఉండేవారట. ఆ యువరాజు నీటి ఒడ్డున కూర్చుని నీటి లో తన ప్రతిబింబాన్ని చూసుకునేవారట. ఒకరోజు ప్రమాదవశాత్తు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకోబోయే కొలనులో పడి దుర్మరణం చెందారట. తనని తాను అతిగా ప్రేమించుకోవడానికి నార్సి సీజం అంటారని ఒక మానసిక నిపుణుడు తెలిపారన్నారు.. తనను తాను అధికంగా ప్రేమించుకోవడం, చిత్రపటాలు పంచిపెట్టడం నార్సి సీజం లక్షణం తెలిపారన్నారు.

ముఖ్యమంత్రికి నార్సి సీజం ఉందని అనడం లేదన్న ఆయన, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో చులకన చేయడానికి ఆయన దగ్గర ఉన్న 100 మంది వందిమాగాదులు ఈ పని చేస్తున్నారన్నారు. రాచరిక వ్యవస్థ లోను కూడా ఎలిజిబెత్ మహారాణి, విక్టోరియా మహారాణిలు తమ ఫోటోలను ముద్రించుకునే అవకాశం ఉన్న, ముద్రించుకోలేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు, ప్రజలకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రుల ఫోటోలను ముద్రించలేదని తెలిపారు.

ఈ కాలానికి రాజకుమారుడు లాంటి జగన్మోహన్ రెడ్డి తన వందిమాగదుల మాటలు విని మోసపోవద్దని సూచించారు. పాసు పుస్తకాలు, డివిజన్ రాళ్లపై ఫోటోలను ముద్రించి శాశ్వత భూహక్కు పథకమని ప్రభుత్వం అంటుంటే, ప్రజలు మాత్రం శాశ్వత భూ నొక్కుడు పథకం అని ఎద్దేవా చేస్తున్నారన్నారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందిస్తూ… హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే సుప్రీంను ఆశ్రయించడం సరికాదని తెలిపిందన్నారు. ఋషికొండపై నిర్మాణాల నిలుపుదలకు హైకోర్టులోనే స్టే కోరాలని సూచించిందన్నారు. తాను తిరిగి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే, సాక్షి దినపత్రికలో రఘురామకు సుప్రీం చుక్కెదురు అనే వార్తా కథనం వస్తుందని ఎద్దేవా చేశారు. ఇక అమరావతి వైపే న్యాయం ఉందని… అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

LEAVE A RESPONSE