– స్టాలిన్-శివకుమార్ మధ్యవర్తులుగా ఆస్తుల పంపకాలు
– జగన్ పక్షాన స్టాలిన్, షర్మిల వైపు డికె శివకుమార్?
– తెలంగాణలో భూములు- నగదు పంపకాలపై రాజీ
– పంపకాలతో షర్మిల సంతృప్తి?
– సయోధ్య కుదిర్చిన స్టాలిన్-డికె శివకుమార్
– అందుకే షర్మిల ఏపీ-తెలంగాణ రాజకీయాలకు దూరం
– చెల్లెమ్మ ఆంధ్రాలో అడుగుపెట్టకుండా అన్నయ్య పావులు
– కాంగ్రెస్ జోక్యంతో అన్నాచెల్లెల ఆస్తి గొడవలకు తెరపడినట్లే
– కొట్లాటలో పనిచేసిన క్రైస్తవ కార్డు
– ఏపీలో షర్మిల అడుగులు అనుమానమే
– ఇతర రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా షర్మిల
– అన్నాచెల్లెల పంచాయతీ తీర్చిన కాంగ్రెస్
– బ్రదర్ అనిల్ లేకుండానే షర్మిలతో సోనియా, రాహుల్ భేటీ ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులుండరని మరోసారి నిజమయింది. ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగత సమస్యలను.. రహస్య మిత్రుడు- మిత్రపక్షమైన బీజేపీ కాకుండా, బద్ధ శత్రువైన
కాంగ్రెస్ పార్టీ పరిష్కరించడం ఆసక్తికరంగా మారింది. చెల్లి షర్మిలతో కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న ఆస్తి-నగదు పంపకాల పంచాయతీ.. ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వ జోక్యంతో కొలిక్కి వచ్చాయన్న చర్చ, రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనికోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌వైపు, మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షర్మిల పక్షాన కృషి చేసినట్లు సమాచారం.
ఇది బీజేపీకి షాక్ కలిగించే వార్తనే కావచ్చు. ఇప్పటివరకూ తన అవసరాలు, భవిష్యత్తు రాజకీయాల కోసం బీజేపీకి మద్దతునిస్తున్న జగన్.. తన వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మాత్రం బీజేపీని కాకుండా, హటాత్తుగా కాంగ్రెస్‌పై ఆధారపడటం ఆసక్తికరంగా మారింది. తన చెల్లి షర్మిలను కాంగ్రెస్ ఏపీలో తనపై సంధించనుందన్న సమాచారంతో, జగనన్న వేగంగా పావులు కదిపారట. ఇదంతా చెల్లితో తనకున్న
ఆస్తుల పంచాయతీనే కారణమని గ్రహించిన అన్నయ్య.. ఆ రూట్లో నరుక్కొచ్చి, తన సమస్యను తానే పరిష్కరించుకున్నారన్న చర్చ, రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ మేరకు సోషల్‌మీడియాలో సైతం వస్తున్న కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తర్వాత.. అధికార-అనధికార ఆస్తుల్లో చాలావరకూ పరిష్కారం కాలేదన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రధానంగా ఇంకా పంచకుండా ఉన్న భూములు-నగదుపైనే జగన్-షర్మిల మధ్య విబేధాలు తలెత్తినట్లు చెబుతున్నారు.
అదీకాక షర్మిల రాజ్యసభ అడిగితే, జగన్ దానిని తిరస్కరించడం కూడా వారిద్దరి మధ్య అగాధం పెరిగేందుకు ఒక కారణమని, అప్పట్లోనే చర్చ జరిగిన విషయం తెలిసిందే. దానితో అప్పటివరకూ ఇడుపుపాయకు కలసి వెళ్లిన జగన్-షర్మిల దారి వేరయింది.
అటు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ స్థాపించి, జగన్‌కు మిత్రుడైన కేసీఆర్‌పై ఆరోపణలు సంధించడం ప్రారంభించారు. తెలంగాణలో ఆమె చేసిన పాదయాత్రలో, కేసీఆర్‌పై సంధించిన
ఆరోపణాస్త్రాలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయి. ప్రధానంగా ఖమ్మంలో ఆమె కేసీఆర్‌పై చేసిన ఆరోపణలను, ఆ జిల్లాకు చెందిన మంత్రులు-ఎమ్మెల్యేలు-నేతలు మూకుమ్మడిగా తిప్పికొట్టారు. ఆ తర్వాత షర్మిలను అరెస్టు చేసి, జైలుకు పంపించడం, షర్మిలను మరింత మొండిగా మార్చింది.
అయితే తాను ఎన్ని పోరాటాలు చేసినా, జాతీయ పార్టీ అండ లేకపోతే తన కష్టం వృధా అని గ్రహించడానికి, షర్మిలకు ఎంతో సమయం పట్టలేదు. దానితో వైఎస్‌కు ఆప్తుడైన కర్నాటక డిప్యూటీ సీఎం
డికె శివకుమార్‌తో మంతనాలు మొదలుపెట్టారు. ఆ మేరకు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే షర్మిల తన సేవలు తెలంగాణకు అందిస్తానంటే, రేవంత్‌రెడ్డి మాత్రం ఆమెను ఏపీకి పరిమితం చేయాలని నాయకత్వంపై ఒత్తిడి చేశారు.
దానితో తెలంగాణలో ప్రచారం వద్దని, దానిబదులు ఏఐసిసిలో ప్రధాన కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి పదవి ఇస్తామని డికె శివకుమార్ సూచించారు. దానితోపాటు కర్నాటక నుంచి రాజ్యసభ ఎంపి ఇస్తామని ఆఫర్ చేశారు. ఫలితంగా.. షర్మిల పార్టీ విలీనం ఖాయమైనప్పటికీ, వేదిక ఎక్కడన్నది మాత్రం పెండింగ్‌లో పడింది.
ఈలోగా మేల్కొన్న జగనన్న.. తన చెల్లి ఏపీకి వచ్చి, తనపై ‘కాంగ్రెస్ సంధించిన బాణం’గా మారితే, వచ్చే ప్రమాదాన్ని పసిగట్టారు. అప్పటికే షర్మిల ఏపీకి వస్తే కడప, కర్నూలు జిల్లాలతోపాటు, ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లోని వైసీపీ ఓటు భారీగా ఓట్లు చీలతాయన్న అంచనాలు మీడియాలో మొదలయ్యాయి. అదీకాక.. వైసీపీ నుంచి టికెట్లు దక్కని సిట్టింగులంతా, షర్మిల వైపు వెళతారన్న ప్రమాద సంకేతాలూ ముందస్తుగా వినిపించాయి. దీనితో అప్రమత్తమైన జగనన్న చకచకా పావులు కదిపారు.
అందులో భాగంగా.. తన మిత్రుడైన తమిళనాడు సీఎం స్టాలిన్ ద్వారా, కథ నడిపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆవిధంగా షర్మిల పక్షాన డికె శివకుమార్-జగన్ తరఫున స్టాలిన్ మధ్య
వర్తులుగా రంగంలోకి దిగి, అన్నాచెల్లెల ఆస్తి పంచాయితీకి, తెరదించినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అది ముగిసిన తర్వాతనే జగన్ లండన బయలుదేరారని చెబుతున్నారు. ఆ ప్రకారంగా తెలంగాణ, కర్నాటకలో పంచకుండా మిగిలిన భూములు-నగదులో షర్మిలకు కొంతభాగం ఇచ్చేలా ఒప్పందం కుదిరిందంటున్నారు. అయితే ఇది ఎంతన్నది తెలియకపోయినా, వేలకోట్లలోనే ఉంటుందన్నది రాజకీయవర్గాల అంచనా.
అటు రాహుల్ సైతం మీ అన్నాచెల్లల మధ్య తగవులు పెట్టామన్న అపవాదు వద్దని, అందుకే ఏపీ-తెలంగాణ కాకుండా, మిగిలిన రాష్ట్రాలకు ఇన్చార్జిగా నియమిస్తామని షర్మిలతో వ్యాఖ్యానించినట్లు, షర్మిల వర్గీయులు చెబుతున్నారు. అంటే జగనన్న ఎంతో జాగ్రత్తగా స్టాలిన్ ద్వారా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా మేనేజ్ చేసి, తనకు ఆపద రాకుండా చూసుకున్నారన్న ప్రశంస రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో క్రైస్తవ కార్డు అక్కరకు రాగా…బ్రదర్ అనిల్ లేకుండానే సోనియా-రాహుల్‌తో, షర్మిల చర్చలు జరిపారన్న ప్రచారమే విస్మయం కలిగిస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి
కాంగ్రెస్‌తో కలిసేందుకు, బ్రదర్ అనిల్ చొరవ చూపారు. ఆ మేరకు ఆయన అనేకమంది సీనియర్ల ఇళ్లకు వెళ్లి మరీ సలహాలు కోరారు. అయితే ఢిల్లీకి షర్మిలతో కలసి సోనియా నివాసానికి వెళ్లిన బ్రదర్ అనిల్, చివరకు ఆ చర్చల్లో లేరన్న వార్తపైనే, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.