Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఉందా.?

-కాపుల సంక్షేమానికి సమాధి కడుతున్న జగన్ ప్రభుత్వం
-రిజర్వేషన్లు రద్దు, కార్పొరేషన్ నిర్వీర్యం ఉద్దరించడమా.?
– టీడీపీ శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్

స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వమూ కాపులకు చేయనంతటి ద్రోహం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా.. రిజర్వేషన్ల పేరుతో కాపుల్ని రెచ్చగొట్టి, అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా రిజర్వేషన్లు ఎత్తేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు అసలు కార్పొరేషన్ ఉందా అనే పరిస్థితి తీసుకొచ్చారు. మూడేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా రూపాయి రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఒక్కరికి స్వయం ఉపాధి కల్పించిన జాడ లేదు.

సంక్షేమాన్ని కాగితాలకు పరిమితం చేశారు. కాపు కార్పొరేషన్ ను ఉత్సవ విగ్రహంగా మార్చారు. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా.. కాపుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఖర్చు చేసినది ఎంత అనే లెక్కలు కూడా చెప్పలేకపోతున్నారు. అన్ని వర్గాలకూ అందించే.. సున్నా వడ్డీ రుణాలు, అమ్మఒడి, విద్యా కానుక, రైతు భరోసా పథకాలనే కాపుల ఖాతాలో చూపించి అంకెల గారడీతో దగా చేస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించింది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3100 కోట్లు ఖర్చు చేశాం. 1.42 లక్షల మంది కాపు యువతకు స్వయం ఉపాధి రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేశాం. 4528 మందికి విదేశీ విద్య, లక్షన్నర మందికి స్కాలర్ షిప్స్, 1413 మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ, 47వేల మందికి స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో శక్షణ అందించాం. ఈ పథకాలన్నింటినీ జగన్ రెడ్డి రద్దు చేశారు.

కాపుల కోసం ప్రతి జిల్లాలో కాపు భవన్స్ నిర్మాణం చేపట్టాం. వాటినీ నిలిపేశారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, సామాజిక భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ కాపులకు అండగా నిలిస్తే.. జగన్ రెడ్డి నేడు అన్నీ రద్దు చేసి కాపులకు చరిత్రలో ఎన్నడూ, ఎవరూ చేయనంత ద్రోహానికి పాల్పడ్డారు. పైగా.. అన్ని వర్గాలకూ కలిపి ఇచ్చే పథకాలనే వారికీ అందిస్తూ.. అదే మహాప్రసాదం అనేలా అత్యంత దుర్మార్గమైన భ్రమ లు కల్పిస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ రూ.3వేలు పెన్షన్ ఇస్తానన్న హామీపై మాట తప్పి, మడమ తిప్పి.. ఐదేళ్లలో రూ.75వేలు అంటూ దగా చేశారు. అదే పథకాన్ని కాపులకు కాపు నేస్తం పేరుతో అమలు చేస్తూ మరో మోసానికి తెరలేపారు. కాపుల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఏదైనా ఉందా జగన్ రెడ్డి.? పథకాలు రద్దు, రిజర్వేషన్లు రద్దు చేసి కాపుల్ని ఉద్దరిస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. కాపులకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే.. తక్షణమే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన ప్రతి సంక్షేమ పథకాన్ని కాపులకు అమలు చేయాలి. కాపు సంక్షేమంపై జగన్ రెడ్డి చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

LEAVE A RESPONSE