– ఉన్నతస్థాయి విచారణ జరగాల్సిందే
– గతంలోనూ ఇలాగే జరిగింది
– బస్సు దహనంపై కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ అనుమానం
బెంగళూరు: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పై కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాగే జరిగిందన్న ఆయన, బస్సు ఆపరేటర్ బెంగళూరుకు చెందిన వాడవడంతో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీని వెనుక కుట్ర లేదా నిర్లక్ష్యం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తాజా దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గతవారం కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే దగ్ధమైంది. నేను ఇటీవల రాయచూర్‌కు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు నాకు ఆ వీడియో చూపించారు. ఆ బస్సులో మంటలు రాగానే మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు డ్రైవర్‌ను పట్టుకుని గట్టిగా అరిచి హెచ్చరించడంతో ప్రయాణికులందరూ వెంటనే కిందికి దిగిపోయారు.
ఆ బస్సులో సుమారు 20 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు, స్వల్ప గాయాలతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారి ల్యాప్‌టాప్‌లు మాత్రం కాలిపోయాయి. అంత పెద్ద ఘటన జరిగినా అధికారులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు. పోలీసులు కూడా పట్టించుకోలేదు. తాజా ప్రమాదానికి గురైన బస్సు ఆపరేటర్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఈ విషయంపై దృష్టి పెట్టాలని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, హోం మంత్రి జి.పరమేశ్వరను ఆదేశించినట్లు శివకుమార్ తెలిపారు.