-బీజేపీ నేత బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
తిరుపతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 7వ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం సమంజసం కాదని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. 2019 లో 81 మందిని బోర్డు సభ్యులుగా నియమించారన్నారు.
కోర్టు సూచనతో 51 మందిగా కుదించారన్నారు. వెంటనే ఆధ్యాత్మిక చింతన, హిందూ మత సంప్రదాయాలను పాటించే వారినే బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో ఉన్న నియమ నిబంధనలను ఇప్పుడు జగన్ గాలికి వదిలేశారన్నారు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానమా ? వైసీసీ కేసులకు, పోలీసులకు భయపడే వారు బీజేపీలో లేరు.
రాబోవు రోజుల్లో శ్రీవారి భక్తులను కలుపుకుని ఆందోళన చేపడతాం. అడ్డదారుల్లో టీటీడీ పాలకమండలి నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. టీటీడీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నాం. హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ డబ్బులను ఖర్చు పెట్టాలి.
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో కూడా కోట్లు చేతులు మారాయని ఆరోపణ. ఇతర మతాల ప్రార్థనా మందిరాలపై నాలుగు రాళ్ళు పడితే చర్యలు తీసుకున్న ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి టీటీడీపై స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ యాక్ట్ ను టీటీడీ అదికారులు,ప్రభుత్వ పెద్దలు ఎప్పుడయినా చదివారా.? టీటీడీ వెబ్ సైట్లలో సైతం నిబంధనలు కనపడటం లేదని పేర్కొన్నారు.