– ఇప్పటికే దారుణంగా మండుతున్న సరుకుల ధరలు
– దాంతో ప్రజలు దారుణంగా అల్లాడుతున్నారు
– జీఎస్టీపై సర్‌ఛార్జ్ విధింపు మరింత నడ్డి విరుస్తుంది
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్
రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిన «నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సామాన్య ప్రజల నడ్డి విరిగి, కుయ్యోమొర్రో అంటుంటే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, జీఎస్టీపై ఒక శాతం సర్‌ఛార్జ్ విధించాలని ప్రతిపాదించడం దారుణం. అది అమలైతే ఇంకా బాదుడే బాదుడు. నిత్యవసరాలు ఏం కొన్నా దేశంలో కన్నా, ఇక్కడ ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది.
సంపద సృష్టి అంటే భారం మోపడమేనా?. చంద్రబాబు మాటలకు అర్ధం ఇదేనా? చంద్రబాబు ఎన్నికల మందోమాట. అధికారంలోకి వచ్చాక మరోమాట. అదే ఆయన నైజం. జీఎస్టీపై సర్‌ఛార్జ్ విధిస్తే, అది ప్రజలపై మరింత భారం వేస్తుంది. అయినా అదేదో గొప్ప నిర్ణయం అన్నట్లు.. ‘వెసులుబాటు కల్పించండి’ అంటూ గొప్పగా హెడ్డింగ్ పెట్టి ఈనాడు అచ్చేసింది. విజయవాడ వరదలను చూపి రూ.500 కోట్లకు పైగా దాతల నుంచి వసూలు చేసి, వాటిని ఎలా దారి మళ్లించారో చూశాం. అది చాలదన్నట్టు ఇప్పుడు జీఎస్టీపై సర్‌ఛార్జ్ రూపంలో వేల కోట్లు దోచుకుందామని ప్లాన్ చేస్తున్నారా?.
వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ‘స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్లు’ అని ఎల్లో మీడియాలో రాశారు. చంద్రబాబు సీఎం కాగానే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయని గొప్పగా చెబుతున్నారు.రైతు మెడకు ఉరితాళ్లు వేయవద్దని ప్రతిపక్ష నేతగా చెప్పిన చంద్రబాబు, ఆయన సీఎం కాగానే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయని, పండగ చేసుకోవాలన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట తప్పారు. విద్యుత్ ఛార్జీల రూపంలో ఏకంగా రూ.20 వేల కోట్ల భారం మోపుతున్నారు. నవంబరు 1నుంచి యూనిట్‌కు రూ.1.58 పెంచారు.
ఇసుక దొరకడం లేదని కూటమి ఎమ్మెల్యేలే అంటున్నారు. నిన్న అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ కూడా పబ్లిక్‌గానే ఒప్పేసుకున్నారు. ఇంకా ఎందుకు సమర్ధించుకుంటున్నారు?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే అలస్యమన్నట్టు ఎమ్మెల్యేలు, వారి అనుచరులే దగ్గరుండి దోచుకు తింటుంటే ఇసుకెలా దొరుకుతుంది?. ఇప్పుడు ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెట్టి తప్పించుకోవాలని చూడటం విడ్డూరం.
రాష్ట్ర అప్పుల విషయంలోనూ ఎన్నికలకు ముందు పథకం ప్రకారం రూ.14 లక్షల కోట్లు అని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు.కానీ, రాష్ట్ర అప్పులు కేవలం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే అని, వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వమే స్పష్టం చేసింది. అయినా, మళ్లీ ఇప్పుడు పాత పాటే పాడుతూ, దుష్ప్రచారం చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. జీఎస్టీపై 1 శాతం సర్‌ఛార్జ్ వసూలును ఏ మాత్రం అంగీకరించబోమని మార్గాని భరత్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.