నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
విశాఖలో భూ కుంభకోణం ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదంటారా?, లేదు…అసెంబ్లీలోనే ప్రకటన చేసిన తర్వాత భూములను కొనుగోలు చేశారంటారా??, గోడ కూల్చిన ఆనందంతో… భూములు ఇచ్చారని చెప్పుకుంటారా? అంటూ నర్సాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి ఎన్ని కహానీలు చెప్పుకుంటారో, చెప్పుకోండన్న ఆయన, అలైన్మెంట్ మార్చిన దాని పక్కనే లక్ష గజాల భూమి ఎలా దొరికిందో చెప్పాలంటూ నిలదీశారు. సీతమ్మధారతో పాటు, భీమిలి అవతలి వైపు ఎన్నో భూకుంభ కోణాలు జరిగాయన్న ఆయన, భీమిలి నుంచి విశాఖ సిటీకి వచ్చే దారిలో ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ…
అనకాపల్లి చుట్టూ వాగులు వంకలు కప్పెట్టి, 400 నుంచి 500 ఎకరాలలో లేఅవుట్ ను వేసుకున్నారని, దానికి తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏమి సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నించారు. విశాఖపట్నంలో బలవంతంగా భూములను భూములను అగ్రిమెంట్ చేయించుకున్నారని, వారు సమావేశం ఏర్పాటు చేసుకుంటే, వైకాపా శ్రేణులను మోహరించారని పేర్కొన్నారు. అవియాన్, ఆష్యుర్ కంపెనీల నుంచి కానుండే కాకుండా ట్రేడెంట్ కంపెనీ నుంచి కూడా పెట్టుబడులను పెట్టారని తెలిసిందన్నారు. ఉమేష్ కంపెనీకి 27%, కొత్తగా చేరిన రెడ్డి గారి కంపెనీకి 72 శాతం వాటాలట అంటూ ఎద్దేవా చేశారు. ఈనాడు దినపత్రిక తో పాటు, దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికలోనూ విశాఖ భూకంపం గురించి వార్తా కథనాలు రాశారని రఘురామ తెలిపారు. దానికి సమాధానం ఏమిటి అంటూ విజయసాయిని ప్రశ్నించారు. సాక్షి దినపత్రికలో ఇదిగో నిజమని ప్రతిరోజు లెఫ్ట్ సైడ్ కాలములో రాస్తుంటారని, ఈరోజు ఆ కాలం ఎందుకు మిస్సయింది అంటూ నిలదీశారు. దస పల్లా భూములను విజయసాయి రెడ్డి కూతురు అల్లుడు కు చెందిన అవియాన్ కంపెనీ ఇచ్చిన గ్యారెంటీ లేని అప్పుతోనే కొనుగోలు చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎయిర్ పోర్టు దారిలో కొత్తగా అలైన్ మెంట్ మార్చి మూర్తి గారి కాలేజీ ప్రహరీ గోడ బద్దలు కొట్టి హడావుడి చేసినందుకు, ఏడు ఎకరాల భూమి ఒకసారి, 2000 గజాల స్థలం మరొకసారి ప్రభుత్వ నామినల్ ధరకే విజయసాయి కూతురు నేహా రెడ్డి, అల్లుడు పినాక రోహిత్ రెడ్డిలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వాళ్లతో తనకేమి సంబంధం అని విజయ సాయి అనవచ్చునని, ఇప్పటివరకు అయితే అనలేదని అపహస్యం చేశారు.
అంతరాత్మ అనేది ఉండాలి
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ తమ పార్టీ అధ్యక్షుడికి అంతరాత్మ ఉన్నా లేకపోయినా ఇతరులకైనా అంతరాత్మ అనేది ఉండాలనిఅన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఆ కుటుంబమే కదా అంటూ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తరచూ విదేశాలకు వెళ్తున్నారని, ఆయన్ని 150 రోజులపాటు స్వదేశంలో ఉంచడానికి ఈ యాత్రకు ప్రణాళిక సిద్ధం చేశారంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు కేంద్రం లోని అధికార పార్టీ ఆనందిస్తుందని భావించి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. విశాఖ భూకంభకోణంపై, ఏఐసీసీ సభ్యుడు మాణిక్యం ఠాకూర్ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
సిట్ నివేదికలో… మూడు వేల భూములు అన్యాక్రాంతం అయినట్టు వెల్లడి
విశాఖ భూకంభకోణంపై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) నివేదికలో, 3000 ఎకరాల భూ ములు అన్యాక్రాంతం అయినట్లు పేర్కొన్నట్లుగా తెలిసిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. వాటిలో దస పల్లా భూములు కూడా ఉన్నాయని తెలిపారు. అందుకే ఏడాది గడిచిన, సిట్ నివేదికను బహిర్గతం చేయడం లేదని విమర్శించారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని తమ పార్టీ నాయకులు పట్టు పట్టడానికి అదే కారణమని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ప్రభుత్వ భూములతో పాటు, ప్రైవేటు వ్యక్తుల భూములను, దస పల్లా భూములను, హెల్త్ రిసార్ట్ పేరిట కొనుగోలు చేసిన భూముల కోసమే, విశాఖ ను కార్యనిర్వాక రాజధానిగా చేయాలని చూస్తున్నారన్నారు.
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్యస్పందన లభించిందని, రైతుల పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే నోటికొచ్చినట్లు మంత్రులు, మాజీ మంత్రులు, తమ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఉత్తరాంధ్రనేతలతో ఈ నాటకానికి తొలుత తెర లేపారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మరి కొద్ది మంది స్థానిక నేతలైన కళాకారులు… వికేంద్రీకరణకు మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే రాజీనామా చేస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఉద్యమంలోకి దూకాలని ఉందన్న వ్యాఖ్యలతో, ఆయనకు ఒక్కనికే ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఉద్దేశంతో కాబోలు… రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సైతం తనకు ఉద్యమంలోకి వెళ్లాలని ఉందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి విడతగా కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ రావు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు లను రిలీవ్ చేస్తే, తరువాత సీనియర్ ఆర్టిస్టులైనా ముఖ్యమంత్రి వంటి వారి వంతు వస్తుందని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానులకు మద్దతుగా ఎన్నికలకు వెళ్ళండి
ప్రజల్లో వికేంద్రీకరణ ఉద్యమం బలంగా ఉందని, ప్రభుత్వాన్ని రద్దు చేసి… మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్లాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అమరావతి రైతుల ఉద్యమానికి లభిస్తున్న అపూర్వ స్పందనతో తమ పార్టీ నాయకుల కుట్రలు పతాక స్థాయికి చేరాయని ఆయన విమర్శించారు.
అమరావతి రైతుల పాదయాత్ర పై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని, తాను ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాక్షి దినపత్రికలో క్వార్టర్ పేజీ స్థాయి నుంచి మూడు పేజీల వరకు వికేంద్రీకరణకు మద్దతుగా వార్తలు రాయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మా పార్టీ వారి రెడ్డి జేఏసీ
వికేంద్రీకరణ ఉద్యమానికి రెడ్డి జేఏసీ మద్దతు తెలియజేయడం పట్ల రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన రెడ్డి జేఏసీ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సంబంధం ఏమిటి అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే వికేంద్రీకరణకు ఒక కులానికి ఏమిటి సంబంధం అంటూ నిలదీశారు. విశాఖపట్నంలో తమ కులస్తులు భూములను కబ్జా చేశారు కాబట్టి, ఆ భూములను కాపాడుకునేందుకే వికేంద్రీకరణ కోరుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న ఇవ్వాలంటూ, రెడ్డి జేఏసీ చేసిన తీర్మానంపై రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో స్పందిస్తూ, ముందు రాజారెడ్డికి భారతరత్న అవార్డు ఇప్పించుకునేందుకు ప్రయత్నించాలంటూ అపహాస్యం చేశారు. అమరావతి రాజధాని అయితే కేవలం 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, కర్నూలులో రాష్ట్ర హైకోర్టు, విశాఖ ఋషికొండపై సచివాలయం నిర్మిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. అమరావతి నగరంలో మూడు ఒక్కచోట పెడితే మాత్రం కేవలం 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని చెప్పడం వారి ద్వంద నీతికి నిదర్శనం అని మండిపడ్డారు. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రజలను అమాయకులను చేసి మభ్యపెట్టాలని చూశారని, కానీ ప్రతిసారి ప్రజలు మోసపోరని అన్నారు.
అసలు ఆగ్రహం ఎవరి పైనా?
అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరిపైన ఆగ్రహం అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన చెత్త ఆర్డర్ ను వెనక్కి తీసుకున్న, విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధానిగా చేయలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం పై కోపమా అంటూ నిలదీశారు. ఈ దద్దమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనలో మనమే కొట్టు కుంటుంటే, చూడడానికి అసహ్యంగా ఉందని అన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అన్ని ప్రాంతాల దేవుళ్లకు మొరపెట్టుకుంటున్న అమరావతి రైతులకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి చేతకాని దద్దమ్మ అని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అనుకుంటున్నారా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
రాజధాని మార్చే అర్హత లేదని విజయసాయి ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా స్పష్టం
రాజధానిని ఏర్పాటును మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాజ్యసభలో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ద్వారా స్పష్టమైందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగి ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగా రాజధాని మార్పునకు అవకాశం ఇచ్చేలా చట్ట సవరణ చేయిస్తే బాగుంటుందని ఆయన అపహాస్యం చేశారు.
శ్రీరంగంలో విఐపి దర్శన టికెట్ల ధరలు తగ్గింపు…
శ్రీరంగం పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో విఐపి దర్శన టికెట్లను 250 నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం 100 రూపాయలకు తగ్గించిందని, అది పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ దేవాలయంలో గతంలో 50 రూపాయలు ఉన్న విఐపి దర్శన టికెట్ ను 100 రూపాయలకు పెంచారని ఇప్పుడు దాన్ని 200 రూపాయలు చేశారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలలో భక్తుల దర్శన టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై హిందూ మతాన్ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు తక్షణమే స్పందించాలని కోరారు.