చంద్రయాన్ 3 విజయంపై చర్చలో విజయసాయి రెడ్డి సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఒక బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
‘భారత అంతరిక్ష యాత్రలో మహోజ్వల ఘట్టం – చంద్రయాన్ విజయం’ అన్న అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు అభినందనీయులని పేర్కొన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్ డాలర్ల బడ్జెట్ మాత్రమే ఉంది. అదే అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంది. అంటే ఇస్రో బడ్జెట్ కంటే అది 31 రెట్లు అధికం అన్నారు.
అంతరిక్ష ప్రయోగాల బడ్జెట్‌కూ కోతలా?
భారత అంతరిక్ష ప్రయోగాలలో అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషన్ అత్యంత తక్కువ వ్యయంతో పూర్తయింది. ఇంత తక్కువ వ్యయంతోనే ప్రపంచం అబ్బురపడే అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇస్రోకు దండిగా నిధులు సమకూర్చితే ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపిస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేటాయించిన మొత్తంలో 8 శాతం కోత పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన ఆక్షేపించారు.
గత ఏడాది అంతరిక్ష రంగానికి బడ్జెట్ అంచనాలలో 13,700 కోట్ల రూపాయలు కేటాయించి సవరించిన అంచనాలలో దానిని 10,530 కోట్లకు కుదించారు. అంటే 23 శాతం నిధులకు కోత పెట్టారు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్‌లలో అత్యధికంగా కోతకు గురైనది అంతరిక్ష పరిజ్ఞాన రంగం బడ్జెట్ అని ఆయన చెప్పారు. అతి తక్కువ వ్యయంతో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో చంద్రమండలం దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన ఇస్రోకు పరిశోధనలు, ప్రయోగాల కోసం బడ్జెట్‌లో దండిగా నిధులు కేటాయించాలని విజయసాయి రెడ్డి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పాలనలో వైజ్ఞానిక మేధకు చెర…
వైజ్ఞానిక మేధను చెరబట్టిన చరిత్ర కాంగ్రెస పార్టీది అని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, కేరళలోను అధికారంలో ఉన్న కాలంలో గూఢచర్యం పేరిట ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై తప్పుడు కేసులు బనాయించి ఆయనను 50 రోజులపాటు జైలులో నిర్బంధించి, తీవ్రంగా హింసించింది. ఆయనపై మోపిన అభియోగాలలో ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయింది.
తన రాజకీయ ప్రత్యర్ధులనే కాకుండా శాస్త్రవేత్తలను సైతం తప్పుడు కేసులతో వేధించి, హింసించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యలాంటిదని అన్నారు. ఈ వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నంబి నారాయణన్ కేసులో చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆయన అరెస్ట్ అక్రమం అని తేల్చింది. ఆయనపై అక్రమ కేసులు బనాయించి, జైలులో నిర్బంధించిన అధికారులపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన అన్నారు. రాజకీయ కారణాలతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేకమంది సైంటిస్టులను వేధింపులకు గురిచేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడినందు వలన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల రంగంలో దేశం ఆశించినంత పురోగతిని సాధించలేకపోయిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు ఆవిష్కరణలకు పేటెంట్లు తెస్తే డబ్బే డబ్బు…!
1962 నుంచి అంతరిక్ష పరిశోధనలను తమ పార్టీ ఎంతో ప్రోత్సహించిందని కాంగ్రెస్ చెబుతుంటే 2014 నుంచి మేం అందించిన సహకారంతోనే ఇస్రో ఇన్ని ఘన విజయాలు సాధించిందని బిజెపి చెప్పుకుంటోంది. వీళ్ళిద్దరి మధ్య అనేక వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికినట్లు చెప్పుకునే ముఖ్యమైన మూడో వ్యక్తి ఉన్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఐటీ విప్లవం తీసుకువచ్చానని, కంప్యూటర్‌ను, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని ఆయన ఇప్పటికే వందలసార్లు ప్రకటించుకున్నారు.
ఆయన ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలి. ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఐటీ, కంప్యూటర్లు, సెల్ ఫోన్ ఆవిష్కరణల సృష్టికర్త ఆయనే అని రుజువైతే వాటిపై భారత్ పేటెంట్ హక్కులు పొందవచ్చు. తద్వారా ఆ పేటెంట్‌లను వినియోగించుకుంటున్న ఐటీ కంపెనీలు, కంప్యూటర్ తయారీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలను రాయల్టీ కింద రాబట్టవచ్చని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కడున్నాం…?
ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న దేశాలతో పోల్చి చూసుకుంటే భారతదేశం ఎక్కడ ఉందో ఈ సందర్భంగా ఒక్కసారి అవలోకన చేసుకోవాలని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇస్రో స్థాపనకు కేవలం నాలుగేళ్ళ ముందు ఏర్పాటైన నాసా ఇప్పటి వరకు వేయికి పైగా అంతరిక్ష ప్రయోగాలు చేపడితే ఇస్రో కేవలం 200 మిషన్లు మాత్రమే పూర్తి చేయగలిగిందని అన్నారు. 2021 చైనా 55 పర్యాయాలు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తే భారత్ కేవలం రెండు ప్రయోగాలు మాత్రమే చేసింది.
భారత్ 4 టన్నుల పేలోడ్ కెపాసిటీ కలిగిన జిఎస్‌ఎల్‌వి-ఎంకె3 ఉపగ్రవాహక నౌకను అంతరిక్ష ప్రయోగాలకు వినియోగిస్తుంటే దీనికి 5 రెట్లు పేలోడ్ కెపాసిటీ కలిగిన లాంగ్ మార్చ్ రాకెట్లను ప్రయోగిస్తోందని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మనం మరిన్ని మిషన్లు చేపట్టాలని అప్పుడే అంతరిక్ష వాణిజ్యంలో మన దేశం ముందు వరసలో నిలబడగలదని అన్నారు.
అంతరిక్ష వైజ్ఞానిక రంగంలో వలసలు నిలవరించాలి…
అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభగల మానవ వనరుల అభివృద్ధి కోసం 2007లో తిరువనంతపురంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ (ఐఐఎస్‌టి) స్థాపన జరిగింది. అయితే దేశీయంగా పెరుగుతున్నఅంతరిక్ష కార్యక్రమాల అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవాలంటే ఇలాంటి సంస్థలు దేశంలో మరిన్నింటిని స్థాపించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
దేశంలో ఉద్యోగ అవకాశాలు లేక ప్రతి ఏటా వేలాదిమంది ఇంజనీర్లు, సైంటిస్టులు వివిధ దేశాలకు వలస పోతున్నారు. వందలాది మంది ఐఐటి గ్రాడ్యుయేట్లు ఉద్యోగావకాశల కోసం అమెరికా వంటి దేశాలకు వలస పోతున్నారు. ఇలాంటి వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ వలసలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆయన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.