Suryaa.co.in

Andhra Pradesh

పాలన ముగింపు దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సున్నం పెట్టుకోవడం ముఖ్యమంత్రికే నష్టం

• ఉద్యోగులు, వారి కుటుంబాలు అగ్నిపర్వతంలోని లావాలా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దహించడం ఖాయం
• ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని పక్కనపెట్టి ఎన్నికలకు వెళ్తే తనకు తిరుగుండదని జగన్ అనుకోవడం మూర్ఖత్వమే
• 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో నీలిరక్తం నిండిన వారు కేవలం లక్షన్నర మందేనని జగన్ గ్రహించాలి
• మిగిలిన 12లక్షల ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి బొక్క పెట్టడం ఖాయం
– టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

నేటికీ 40 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు…. 60శాతం మంది పిఛన్ దారులకు పెన్షన్లు అందలేదని, సరైన సమాచారం ఇవ్వాలని ఆర్థిక శాఖను వివరాలు అడిగితే, ఎంతమందికి జీతాలు పింఛన్లు ఇవ్వాల్సి ఉందో తెలియదని, ప్రతి నెలా రూ.5,500కోట్ల వరకు చెల్లిస్తున్నామని, ఈ నెలలో 10 వ తేదీ నాటికి రూ.2,500కోట్లు చెల్లించినట్టు సదరుశాఖ స్పష్టం చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఆర్థిక శాఖ చెబుతున్న వివరాలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అవసరాలు… కార్యక్రమాలకు నిధు కొరత లేకుండా చూసుకుంటున్న వ్యక్తి, అదే విధంగా నెలజీతంపై ఆధారపడి బతికే ఉద్యోగులు, వారి కుటుంబాలు మరీ ముఖ్యంగా పెన్షనర్ల గురించి ఎందుకు ఆలోచించ రని ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్లతో పాటు చిన్నా చితకా ఉద్యోగులు, అంగన్ వాడీ, ఆశా వర్కర్లు.. ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ ఉద్యోగులంతా కలిపి దాదాపు 13లక్షల పైచి లుకు ఉన్నారు. వారిలో నేటికి (అక్టోబర్ 11) ఎంతమందికి జీతాలు పింఛన్లు అందించారంటే ఆర్థిక శాఖ నీళ్లు నములుతోంది. జీతాలు, పింఛన్లు ఇవ్వలేమని ఈ ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ కరాఖండిగా చెప్పరు. అలా అని నెలకాగానే ఠంఛన్ గా చెల్లింపులు జరిగేట్టు చూడరు.

ప్రతి అంశాన్ని రాజకీయంగా మాట్లాడే మంత్రులు ఉద్యోగుల జీతాలు, వారి సమస్యలపై మాత్రం నోరు విప్పరు
మాజీ ముఖ్యమంత్రి జైల్లో పడుతున్న ఇబ్బందులపై వెటకారంగా మాట్లాడుతున్న సిగ్గులేని మంత్రి తన ప్రభుత్వం 11వ తేదీ వచ్చినా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయిం దో మాత్రం సమాధానం చెప్పడు. ప్రతిపక్షనేత జైల్లో ఉన్నాడని… అది వెల్ నెస్ సెంటర్.. మరోటికాదని తాత్కాలిక ఆనందం పొందడంపై పెడుతున్న శ్రద్ధలో సగం కూ డా… ఉద్యోగులు.. పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై మంత్రులు పెట్టడంలేదు.

ప్రతి అంశాన్ని రాజకీయంగా మాట్లాడే మంత్రులు.. జీతాలు, పింఛన్ల చెల్లింపులపై ఎందుకు నోరు విప్పరు? ఉద్యోగులు.. ఉద్యోగసంఘాలు మాతో (వైసీపీతో) లేవని గతంలో సకల శాఖల మంత్రిగా పిలువబడే ఒకాయన చెప్పుకొచ్చారు. మరో మంత్రేమో జీతాలు ఆల స్యంగా ఇస్తారు..దానివల్ల ఏమవుతుంది అని పెడధోరణితో మాట్లాడుతున్నాడు. ఇలా ఉద్యోగుల్ని… పింఛన్ దారుల్ని ఇబ్బందులు పెట్టడం ఈ ప్రభుత్వానికి, మంత్రులకు అలవాటుగా మారిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఒక విషయం గుర్తుంచుకోవాలి.

13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో నీలిరక్తం నిండిన వారు కేవలం లక్షన్నర మందేనని జగన్ గ్రహించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని పక్కనపెట్టి ఎన్నికలకు వెళ్తే తనకు తిరుగుండదని జగన్ అనుకోవడం మూర్ఖత్వమే
రాష్ట్రంలో ఉన్న13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో నరనరాన నీలిరక్తం నింపుకున్నవారు లక్షా30 వేల మంది ఉంటారు.. మిగిలిన 12లక్షల ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి బొక్క పెట్టడం ఖాయం. గత ఎన్నికల్లో ఉద్యోగులు వారి ఓట్లు వేయడంతో పాటు.. ప్రజల్ని కూడా ప్రభావితంచేసి వైసీపీకి ఓట్లు వేయించారనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి విస్మరించకూడదు. టీడీపీ ప్రభుత్వాన్ని కాదని ఉద్యోగులు.. ఉపాధ్యాయులు దూరం జరిగారు తప్ప.. వారిని మా ప్రభుత్వం పక్కన పెట్టలేదు. పనిచేయిస్తున్నారనే వారు ఆనాడు అలా వ్యవహరించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని సమస్యలున్నా… ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల కు ఠంఛన్ గా 1వ తేదీనే జీతభత్యాలు అందేవి. ఆ రోజు సెలవు అయితే.. దానికి ముందురోజే అందేవి. ఉద్యోగులు..ఉపాధ్యాయులు మాతోలేరు కాబట్టి.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదన్నట్టు ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి.

ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్తే…తనకు తిరుగుండదని జగన్ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. ఉద్యోగుల పక్షాన ఉద్యోగసంఘం నేతలు నోరెత్తడం లేదంటే వారిని ప్రభుత్వం ప్రలోభపెట్టింది కాబట్టి. సంఘనేతల్లా.. సాదాసీదా ఉద్యోగులు.. నెలజీతంపై ఆధారపడి బతికేవారు ఒక్కనెల జీతం ఆలస్యమై నా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి.

అలానే ఔట్ సోర్సింగ్…కాంట్రాక్ట్ సిబ్బం దికి ప్రభుత్వం రెండు, మూడు నెలలైనా జీతాలు ఇవ్వడంలేదు. అలాంటి వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారంతా ఇప్పు డు మౌనంగా ఉండి ప్రభుత్వం పెడుతున్న బాధల్ని భరించినా సమయం వచ్చిన ప్పుడు ఏం చేయాలో అది చేస్తారు.

రూ.10.85లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ రెడ్డి.. జీతాలు, పింఛన్ల చెల్లింపులకు నెలకు రూ.5,500కోట్లు ఇవ్వలేకపోతున్నాడు
చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీతో వాదనలు వినిపించిన, ఉద్యోగసంఘం నేత ఒకరి విషయంలో అదే న్యాయస్థానంలో ఎందుకు సరైన న్యాయపోరాటం చేయలేకపోయింది ? ఉద్యోగుల గొంతు నొక్కేందుకు వైసీపీప్రభుత్వం పెంచి పోషించిన ఒక భస్మాసుర హస్తం నేడు అదే ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందనేది వాస్తవం. అప్పులు తేవడం .. అవి తీర్చడానికి మరలా అప్పులు చేయడం ఇదీ ఈప్రభుత్వ నిత్యకృత్యం. నిన్న రూ.450కోట్ల అప్పులు తెస్తే.. ఆ సొమ్ము ఓవర్ డ్రాఫ్ట్ కింద జమైంది.

దాదాపు రూ.10.85 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంపై ఉంది. ఆ అప్పుకు వడ్డీలు అదనం. ఈ ప్రభుత్వం ఏంచేసినా చేయకపోయినా.. నెలకాగానే జీతాలు, పింఛన్లకు చచ్చినట్టు రూ.5,500కోట్లు చెల్లించాలి. రూ.1800కోట్లు భరోసా కింద ఇచ్చేసామాజిక పింఛన్లకు చెల్లించాలి. రూ.500 నుంచి రూ.600 కోట్లవరకు వడ్డీలు కట్టాలి. వీటిలో ఏ ఒక్కదానికి చెల్లింపులు ఆపినా ఈ ప్రభుత్వ మనుగడే కష్టంగా మారుతుంది. రాష్ట్ర ఆదాయం రూ.10 వేలకోట్లకు మించిలేదు.. ఏ పనిచేయాలన్నా.. ఎవరికి చెల్లించాలన్నా జగన్ సర్కార్ కు అప్పులే దిక్కు.

ఇప్పటివరకు చేసిన అప్పులు రూ.10.85 లక్షల కోట్లు అయితే.. ప్రజలకు అందే సంక్షేమం మాత్రం అత్తెసరుగానే ఉంది. ఇసుక, మద్యం అమ్మకాలపై వచ్చేఆదాయం… మైనింగ్ ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయం ఎటు పోతోందో తెలియదు. ఆఖరికి ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించమనే స్థితికి వైసీపీనేతలు వచ్చారు. స్వయంగా చీఫ్ సెక్రటరీ చెప్పినా వైసీపీనేత ఒకరు బిల్లులు ఇవ్వడం కుదరదని తెగేసిచెప్పారు. అదీ ఈ ప్రభు త్వ తీరు.

మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయం తెలియదంటున్న జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు లావాలా ఉద్యోగులు… వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని దహించడం ఖాయం
మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పే స్థితిలో జగన్ ఉన్నాడంటే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగడానికి ముమ్మాటికీ అనర్హుడే. ప్రధాన ప్రతిపక్షనేత అరెస్ట్ విషయం తనకు తెలియదని చెబుతూ.. వెకిలినవ్వులు నవ్వుతూ, కూనికోరుల్ని దోపిడీదారుల్ని ముఖ్యమంత్రి పెంచిపోషిస్తున్నాడు. జగన్ కు ఇంకా మూడునెలలే సమయం ఉంది. 2024 ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్తానంటు న్నాడు… అదే నిజమైతే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తాడో.. సీపీఎస్ వ్యవహారాన్ని ఎలా పరిష్కరిస్తాడో సమాధానం చెప్పాలి.

పాలన ముగింపు దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సున్నం పెట్టుకుంటే, జగన్ రెడ్డికి జరిగే నష్టం ఊహకు అందదు. ఎంత వీలైతే అంత రాష్ట్రాన్ని, ప్రజల్ని నాశనం చేయడమే తన ధ్యేయమన్నట్టుగా జగన్ రెడ్డి తీరు ఉంది. వైసీపీ ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని మాత్రం ఉద్యోగులు..పింఛన్ దారులు ఎప్పటికీ మర్చిపోరనే వాస్తవాన్ని జగన్ తెలుసుకుంటే మంచిది. ఉద్యోగులు, వారి కుటుంబాలు అగ్నిపర్వతంలోని లావాలా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కచ్చితంగా దహిస్తారు ” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE