– సింగయ్యను కుక్కతో పోల్చడానికి మనస్సెలా వచ్చింది ‘బాబూ’?
– చిత్తశుద్ది ఉంటే సింగయ్య భార్య అనుమానాలపై విచారణ జరిపించాలి
– కొమ్మూరి కనకారావు డిమాండ్
తాడేపల్లి: దళితుడు సింగయ్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకారంతో ఉపయోగించిన భాషపై వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కుక్కతో పోల్చడానికి చంద్రబాబుకు మనస్సెలా వచ్చిందని ప్రశ్నించారు. దళితుల శవాలతో రాజకీయం చేయాలని చంద్రబాబు, లోకేష్‌లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారికి చిత్తశుద్ది ఉంటే సింగయ్య భార్య లూర్ధుమేరి వ్యక్తం చేసిన అనుమానాలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెడతారా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
చంద్రబాబు దళితులను చులకన చేస్తూ వారి పట్ల ఎంతో అహంకారంతో మాట్లాడారు. సింగయ్య ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు హాస్పటల్‌కు తరలించాలని ప్రయత్నిస్తే, పోలీసులు వారిని వారించి అంబులెన్స్ పిలిచామంటూ అరగంట సేపు జాప్యం చేయడం వల్లే ఆయన పరిస్థితి విషమించింది. ఆయన భార్య లూర్ధుమేరి ఈ కూటమి ప్రభుత్వ కుట్రలను బయటపెట్టింది. పేద దళిత కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఈ ప్రభుత్వం దానిని సానుభూతితో చూడాల్సింది పోయి, రాజకీయంగా వాడుకోవాలని చూసింది.