Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరపాలి

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు

గుంటూరు: అధికార పార్టీలు గత దశాబ్ద కాలంగా ఆదానీ, షిర్డీ సాయి లాంటి ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరిపి, అవినీతికి పాల్పడిన సంస్థలపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.హెచ్. బాబూరావు పిలుపునిచ్చారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక జనచైతన్య వేదిక హాలులో విద్యుత్ కుంభకోణాలు – వినియోగదారుల పై భారాలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ప్రధాన వక్తగా హాజరై సిహెచ్ ప్రసంగించారు.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. సిహెచ్ బాబూరావు ప్రసంగిస్తూ ఆదానీ చేసుకున్న సేకీ ఒప్పందం రాబోయే 25 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలపై లక్ష 20 వేల కోట్ల పెను భారం మోపుతుందని, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ చేపట్టిన ఒప్పందాల ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, నేడు ఈ అవకతవకల పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి, విశ్రాంత అడిషనల్ ఎస్పీ చలపతిరావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, చావా శివాజీ, తదితరులు పాల్గొని ప్రసంగించారు.

LEAVE A RESPONSE