Suryaa.co.in

Andhra Pradesh

జగన్ సర్కారులో బతకడం కష్టం స్వామీ… మళ్లీ మీరే రావాలి

– చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో చేరికలు

జగన్ ప్రభుత్వంలో తమ లాంటి సామాన్యులు బతకడం కష్టమైపోతోందని, అందుకే ఈసారి మీరే రావాలని పలువురు ఆటోడ్రైవర్లు, రైతుకూలీలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కోరారు. పార్టీలో చేరికల సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు.

సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ లీడర్ నగరబోయిన లీలా కృష్ణ పార్టీలో చేరారు. వీరి అనుచరులు, మద్దతు దారులు 100 మందికి పైగా తెలుగు దేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము ఎలా నష్టపోయామో రెండు నియోజకవర్గాల నేతలు వివరించారు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని….తమ పక్క నియోజకవర్గం అయిన పులివెందులలో కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని పార్టీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్ కు ఇబ్బంది తప్పదని కదిరి నుంచి వచ్చిన కార్యకర్తలు తెలిపారు. పార్టీలో చేరిన ఆటో యూనియన్ నేతలు మాట్లాడుతూ….పోలీస్ ఫైన్ లు, పన్నులు, పెట్రో ధరలు, బాదుడుతో తాము ఎంత నష్టపోతున్నామో వివరించారు. మద్యం ధరలతో తమ కుటుంబాలు ఎలా శిధిలం అవుతున్నాయో వారు వివరించారు. అన్ని వర్గాల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని….ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కందికుంట వెంకటప్రసాద్, బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజయనేయులు, వలవల బాబ్జి, రవి మందలపు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE